IT services company
-
ఐటీ సర్వ్ అలయెన్స్ ఉదారత.. టాస్క్‌కి రూ. 80 వేలు విరాళం!
అమెరికాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ (ఐటీ సర్వీస్ అలియన్స్) నార్త్ ఈస్ట్ చాప్టర్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. న్యూజెర్సీలో సీఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా థాంక్స్ గివింగ్ చేపట్టింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ అయిన ట్రెంటన్ ఏరియా సూప్ కిచెన్ (టాస్క్) కి 1,000 డాలర్ల విరాళం అందజేశారు. ఈ మేరకు ఐటీ సర్క్ సభ్యులు టాస్క్ నిర్వహకులకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫుడ్ బ్యాంక్‌ను ఐటీ సర్వ్ సభ్యులు సందర్శించారు. టాస్క్ చేస్తున్నసేవా కార్యక్రమాలతో పాటు ఆహారం తయారు చేసే విధానాన్ని ఐటీ సర్వ్ సభ్యులకు నిర్వహకులు వివరించారు. ట్రెంటన్ నగరంలో ఆకలితో మరియు కష్టాల్లో ఉన్న వారి అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సంస్థ టాస్క్ అని ఈ సందర్భంగా కళ్యాణ్ విజయ్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ సర్క్ అలయన్స్ తరుపున సహాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయన్స్ ఉదారతను టాస్క్ ప్రశంసించింది. ఈ ఆర్థిక సాయం ఎంతో మందికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగమై ఆర్థిక సహాయసహాకారాలు అందించినందుకు ఐటీ సర్వ్ అలయన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం) -
ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు: రూ.9,300 విలువైన షేర్లు బైబ్యాక్
భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ముగిసిన త్రైమాసికానికి రూ.6,021 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే రెండో త్రైమాసికంలో నికర లాభంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సెప్టంబర్లో ఇదే కాలానికి రూ.5,241 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది పోలిస్తే ఇన్ఫోసిస్ ఆదాయం 23.4 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ.29,602 కోట్ల ఆదాయాన్ని గడించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా రూ. 36,538 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. Q2 FY22లో ఆర్జించిన ఆదాయం ప్రకారం 23.4 శాతం వృద్ధిని సాధించింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభాలు 12.3 శాతం పెరగగా, క్రమానుగతంగా ఆదాయం 6 శాతం పెరిగింది. రూ.9,300 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలుచేయాలని ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయించింది. అందుకు గరిష్ట బైబ్యాక్ ధరను రూ. 1,850గా కంపెనీ నిర్ణయించింది. చదవండి: ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్! -
ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు
కరోనా కారణంగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం ఊపందుకుంది. ఐటీ రంగానికి చెందిన ఆరు విభాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగుల అవసరం ఉందని సిబ్బంది సేవల సంస్థ ఎక్స్‌ఫెనో తెలిపింది. ఎక్స్‌ఫెనో తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ సెక్టార్లో ప్రాడక్ట్, సర్వీస్ విభాగాల్లో వేలల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఇండియన్ ఐటీ సర్వీసులు, స్టార్ట్ అప్‌లతో పాటు ఇతర ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలు ఉద్యోగుల్ని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపింది. ఆరు విభాగాల్లో ముఖ్యంగా ఫుల్ స్టాక్ డెవలపర్స్, డేటా ఇంజనీర్లు, రియాక్ట్ నెగిటీవ్ డెవలపర్స్, డెవలపర్స్, బ్యాకెండ్ ఇంజినీర్స్, మెషిన్ లెర్నింగ్‌లో ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయని చెప్పింది. ఈ ఆరు విభాగాల్లో మొత్తం 70 వేలు, అంతేకంటే ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉందన్న ఎక్స్‌ఫెనో.. ఎవరైతో ఈ ఉద్యోగాల్లో రాణిస్తారో వారికి అనుభవాన్ని బట్ట 50నుంచి 60శాతం హైక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. గతేడాది ఇదే విభానికి చెందిన 3నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులకు 20-25 శాతం శాలరీల్ని హైక్ ఇచ్చాయి. కరోనా కారణంగా ప్రాడక్ట్, సర్వీస్ బేస్డ్ రంగాల్లో వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల, శాలరీల విషయంలో ఐటీ కంపెనీలు వెనకడుగు వేయడం లేదని ఎక్స్ఫెనోమ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు గతేడాది ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ 3వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఉద్యోగుల అవసరం పెరిగి 18వేల నుంచి 32వేల మంది ఉద్యోగుల ఎంపిక చేసినట్లు యాక్సెంచర్ సీఈఓ జూలీస్వీట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాబట్టి నిరుద్యోగులు ఈ ఆరురంగాల్లో నిష్ణాతులై ఉండాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. -
మాస్టెక్ జూమ్- ఎస్ఐఎస్ ఇండియా బోర్లా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో సాఫ్ట్వేర్ సేవల రంగ కంపెనీ మాస్టెక్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆటుపోట్ల మార్కెట్లో మాస్టెక్ లాభాలతో జోరు చూపుతుంటే.. ఎస్ఐఎస్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. మాస్టెక్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో మాస్టెక్ నికర లాభం 20 శాతం పెరిగి రూ. 46.5 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 386 కోట్లను అధిగమించింది. ఇక త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం 12 బలపడి రూ. 85 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 21.1 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో మాస్టెక్ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 523 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వరకూ ఎగసింది. ఎస్ఐఎస్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎస్ఐఎస్ ఇండియా నికర లాభం 24 శాతం క్షీణించి రూ. 57 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం పుంజుకుని రూ. 2167 కోట్లను తాకింది. ఇబిటా 3 శాతం తక్కువగా రూ. 121 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్ఐఎస్ షేరు 4.4 శాతం పతనమై రూ. 344 వద్ద ట్రేడవుతోంది. -
బార్ట్రానిక్స్ దివాలాకు ఓకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సర్వీసులు, బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీ బార్ట్రానిక్స్ దివాలా పరిష్కార ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ అనుమతి ఇచ్చింది. ఇటీవల బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి చెందిన కంపెనీగా గతంలో పలుమార్లు ఈ కంపెనీపై ఆరోపణలొచ్చాయి. ఆయన బినామీలే నడిపిస్తున్నారనే వ్యాఖ్యలూ వచ్చాయి. సుజనా చౌదరికి చెందిన కంపెనీలు సుజనా టవర్స్, సుజనా యూనివర్సల్, సుజనా స్టీల్స్ ఇప్పటికే వేల కోట్ల రూపాయలు బకాయిల్ని బ్యాంకులకు తిరిగి చెల్లించటంలో డిఫాల్ట్ అయ్యాయి. బార్ట్రానిక్స్ సైతం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బ్యాంకుకు బార్ట్రానిక్స్ అసలు, వడ్డీతో కలిపి రూ.39.96 కోట్లు బాకీ పడింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా చిన్నం పూర్ణచంద్ర రావును ఎన్సీఎల్టీ నియమించింది. -
స్వల్పంగా పెరిగిన ‘హెక్సావేర్’ లాభం
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ నికర లాభం డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం పెరిగి, రూ.123.4 కోట్లుగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ మొత్తం రూ.120.9 కోట్లు. ఇక ఆదాయాలు 24.6 శాతం వృద్ధితో రూ.1,004.8 కోట్ల నుంచి రూ.1,252.4 కోట్లకు పెరిగాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా భావిస్తోంది. ఈ ప్రాతిపదికన మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 16.8 శాతం పెరిగి రూ.583.5 కోట్లకు చేరింది. కాగా డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ షేర్‌కు రూ.2.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. -
కాగ్నిజంట్ నికర లాభం 13 శాతం అప్
న్యూయార్క్ : ఐటీ సేవల సంస్థ కాగ్నిజంట్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవల విభాగాల్లో పటిష్టమైన వృద్ధి కారణంగా నికర లాభం 13 శాతం పెరిగిందని కాగ్నిజంట్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కనీసం 20 శాతం వృద్ధి సాధించగలమని కంపెనీ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు. ఆదాయ వృద్ది అంచనాలను ఈ కంపెనీ ఈ ఏడాది రెండోసారి పెంచింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 37 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 42 కోట్ల డాలర్లకు పెరిగిందని డిసౌజా తెలిపారు. ఆదాయం 252 కోట్ల డాలర్ల నుంచి 23 శాతం వృద్ధితో 309 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. డిజిటల్ వ్యాపారంలో అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంస్థ జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తోంది. -
టెక్ మహీంద్రాకు రూపీ దెబ్బ
* 23 శాతం క్షీణించిన నికర లాభం * ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు 23% తగ్గింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, వేతనాల పెంపు, ఇటీవల కొనుగోలు చేసిన కంపెనీల పనితీరు పేలవంగా ఉండడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మిలింద్ కుల్కర్ణి చెప్పారు. 2013-14 క్యూ4లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 క్యూ4లో రూ.472 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం రూ.5,058 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.6,117 కోట్లకు పెరిగిం దని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల పరంగా అత్యధిక వృద్ధి సాధించిన క్వార్టర్లలో ఇదొకటని వివరించారు. డాలర్ల పరంగా ఆదాయం 19% వృద్ధితో 98 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.2,628 కోట్లకు తగ్గిందని, ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.22,628 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ల పరంగా నికర లాభం 43 కోట్ల డాలర్లుగా, ఆదాయం 19 శాతం వృద్ధితో 368 కోట్ల డాలర్లకు చేరిందని వివరించారు. కొత్తగా చేరిన 13,840 మంది ఉద్యోగులతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,03,281కు పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.700 కోట్ల రుణభారం, రూ.3,212 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ధర మంగళవారం ఎన్ఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ.640 వద్ద ముగిసింది. -
ఐగేట్ డీల్‌తో వేమూరికి జాక్‌పాట్
రూ. 120 కోట్ల ప్రయోజనం న్యూయార్క్: ఐటీ సేవల సంస్థ ఐగేట్ సీఈవో అశోక్ వేమూరికి జాక్‌పాట్ తగిలింది. ఐగేట్‌ను ఫ్రాన్స్‌కి చెందిన క్యాప్‌జెమిని కొనుగోలు చేస్తుండటంతో వేమూరికి సుమారు 19.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.120 కోట్లు) ప్రయోజనం చేకూరనుంది. 2013లో ఐగేట్ సీఈవోగా చేరిన వేమూరికి కంపెనీలో ప్రస్తుతం 4,00,000 పైచిలుకు షేర్లు ఉన్నాయి. క్యాప్ జెమిని ఆఫర్‌ను బట్టి చూస్తే ఈ షేర్ల విలువ రూ. 120 కోట్ల పైచిలుకు ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఆయన 18,750 షేర్లను గానీ విక్రయించకుండా ఉండి ఉంటే మరింత ఎక్కువగా ప్రయోజనం చేకూరేది. అప్పట్లో ఆయన ఒక్కోటి 39.01 డాలర్ల రేటు చొప్పున మొత్తం దాదాపు రూ.5 కోట్లకు వీటిని విక్రయించారు. ప్రస్తుతం ఐగేట్‌ను 4 బిలియన్ డాలర్లకు కొంటున్న క్యాప్‌జెమిని.. ఒక్కో షేరుకి 48 డాలర్లు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
టెక్ మహీంద్రా చేతికి స్విస్ కంపెనీ
న్యూఢిల్లీ: కన్సల్టింగ్ సేవల సంస్థ సాఫ్‌జెన్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తెలిపింది. అయితే, ఒప్పందం విలువ మాత్రం వెల్లడించలేదు. ఈ డీల్ మార్చి నాటికి పూర్తికాగలదని కంపెనీ వివరించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే సాఫ్‌జెన్.. కమర్షియల్, రిటైల్ బ్యాంకింగ్ తదితర రంగాల సంస్థలకు సేవలు అందిస్తోంది. ఇందులో 450 మంది ఉద్యోగులు ఉన్నారు. కస్టమర్లకు అత్యాధునిక కోర్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఈ డీల్ ఉపయోగపడగలదని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీయంగా నాలుగో అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న టెక్ మహీంద్రా కొన్నాళ్లుగా పలు కంపెనీలను కొనుగోలు చేసింది. ఇటీవలే 240 మిలియన్ డాలర్లతో అమెరికాకు చెందిన లైట్‌బ్రిడ్జ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేసింది.