IYF
-
గెలవాలంటే మైండ్‌సెట్ మారాలి!
సాక్షి,హైదరాబాద్: లక్ష్యాలు నిర్దేశించటం, లక్ష్యసాధన కోసం వ్యూహాలు రూపొందించంతో పాటు కార్యక్షేత్రంలో పాల్గొనే ఉద్యోగుల్లో విజయానికి అనువైన మానసిక సామర్థ్యాన్ని నింపటం అంత్యంత కీలకమని పలువురు సీఈఓలు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటు పనిచేసే ఉద్యోగులు పూర్తిగా లీనమైతేనే అసమాన విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. మంగళవారమిక్కడ ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) నిర్వహించిన ‘మైండ్‌ఫుల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫోరం’ సదస్సులో పలు కంపెనీల సిఈఓలు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఐఎంఏ వ్యవస్థాపకుడు డాక్టర్ లీ మాట్లాడుతూ... తాను 50 దేశాల్లో పర్యటించానని, వాతావరణం, సంస్కృతి, సంప్రదాయాల్లో తప్ప మనుషుల స్వభావాలు ఎక్కడైనా ఒక్కటేనని చెప్పారు. ఏ మార్పు రావాలన్నా మనుషుల మైండ్‌లోనే రావాలని, అందుకే మైండ్ మేనేజ్మెంట్ కార్యక్రమాల్ని రూపొందించి, నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ‘‘బిజినెస్ లీడర్షిప్ అంటే సంస్థను, ఉద్యోగులను తన కనుసన్నలలో నడిపించటమే కాదు. ఉద్యోగులు సంస్థ లక్ష్యాల కోసం పాటుపడేలా చెయ్యటం. మైండ్‌ఫుల్ మేనెజ్మెంట్ని సీఈఓలు పాటిస్తూ ఉద్యోగులను ముందుకు నడిపిస్తే వ్యాపారాన్ని ఎక్కువ కాలం కొనసాగించవచ్చు.’’ అని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్–బయోఫార్మ్ ఎండీ డాక్టర్ బీజే దేశాయ్ మాట్లాడుతూ... ‘‘తొలిసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నా. పలు దేశాల్లో మైండ్ మేనేజ్మెంట్ను పరిశీలించా. అందులో ఒకటి మా సంస్థలో నేను పాటించా. ఉద్యోగుల కోసం టెన్నిస్ కోర్టుల్లాంటివి ఏర్పాటు చేశాం. దీంతో రోజూ లేటుగా వచ్చే వాళ్లు 45 నిముషాలు త్వరగా విధుల్లోకి వస్తున్నారు. ఇలాంటి మైండ్‌ఫుల్ మేనేజ్మెంట్ కార్యక్రమాల ద్వారా యాజమాన్యం, ఉద్యోగుల మధ్య మంచి వాతావరణం నెలకొంటుంది’’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అడ్జంక్, ఐవైఎఫ్ రీజినల్ డైరెక్టర్ కిమ్డాంగ్ యాప్‌లు పాల్గొని ప్రసంగించారు. -
నాణ్యమైన విద్యతోనే ఉద్యోగాలు
ఫ్యాప్సీతో ఐవైఎఫ్ అవగాహన సాక్షి, సిటీబ్యూరో: యువతకు నాణ్యమైన విద్యను అందిస్తేనే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) రీజినల్ డైరెక్టర్ డాంగ్ యాప్ కిమ్ చెప్పారు. వివిధ దేశాల్లో మైండ్ ఎడ్యుకేషన్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ యువత అభ్యున్నతికి పాటు పడుతున్న ఐవైఎఫ్... సోమవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో (ఎఫ్టిఏíపీసీసీఐ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ...యువతకు నాణ్యమైన చదువులు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. ఫ్యాప్సీతో కలిసి చేపట్టే కార్యక్రమాల ద్వారా వచ్చే నిధులను యువత విద్యకు వెచ్చిస్తామని చెప్పారు. తమ సామాజిక బాధ్యతలో ఇది కూడా భాగమేనని ఫ్యాప్సీ యూత్ కమిటీ చైర్మన్ అనిరుధ్, ఐవైఎఫ్ డైరెక్టర్ జాన్ యోహాన్ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ యూత్ ఎంపవర్ సెంటర్
దక్షిణ కొరియా ఐవైఎఫ్తో ఎంవోయూ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యువత, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ యూత్ ఎంపవర్మెంట్ సెంటర్ (ఐవైఈసీ)ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు. దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అంగీకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈసందర్భంగా మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడారు. ఐవైఎఫ్ రెండో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుందన్నారు. హకీంపేటలోని క్రీడాప్రాధికార సంస్థకు చెందిన ఐదెకరాల స్థలంలో రూ.100 కోట్ల పెట్టుబడులతో రాబోయే మూడేళ్లలో ఐవైఎఫ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంత్రి చె ప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి, క్రీడాప్రాధికార సంస్థ ఎండీ దినకర్‌బాబు, ఐవైఎఫ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు కిమ్ తదితరులు పాల్గొన్నారు.