సాక్షి,హైదరాబాద్: లక్ష్యాలు నిర్దేశించటం, లక్ష్యసాధన కోసం వ్యూహాలు రూపొందించంతో పాటు కార్యక్షేత్రంలో పాల్గొనే ఉద్యోగుల్లో విజయానికి అనువైన మానసిక సామర్థ్యాన్ని నింపటం అంత్యంత కీలకమని పలువురు సీఈఓలు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటు పనిచేసే ఉద్యోగులు పూర్తిగా లీనమైతేనే అసమాన విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. మంగళవారమిక్కడ ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) నిర్వహించిన ‘మైండ్‌ఫుల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఫోరం’ సదస్సులో పలు కంపెనీల సిఈఓలు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
ఐఎంఏ వ్యవస్థాపకుడు డాక్టర్ లీ మాట్లాడుతూ... తాను 50 దేశాల్లో పర్యటించానని, వాతావరణం, సంస్కృతి, సంప్రదాయాల్లో తప్ప మనుషుల స్వభావాలు ఎక్కడైనా ఒక్కటేనని చెప్పారు. ఏ మార్పు రావాలన్నా మనుషుల మైండ్‌లోనే రావాలని, అందుకే మైండ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాల్ని రూపొందించి, నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ‘‘బిజినెస్ లీడర్‌షిప్ అంటే సంస్థను, ఉద్యోగులను తన కనుసన్నలలో నడిపించటమే కాదు. ఉద్యోగులు సంస్థ లక్ష్యాల కోసం పాటుపడేలా చెయ్యటం. మైండ్‌ఫుల్ మేనెజ్‌మెంట్‌ని సీఈఓలు పాటిస్తూ ఉద్యోగులను ముందుకు నడిపిస్తే వ్యాపారాన్ని ఎక్కువ కాలం కొనసాగించవచ్చు.’’ అని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆర్–బయోఫార్మ్ ఎండీ డాక్టర్ బీజే దేశాయ్ మాట్లాడుతూ... ‘‘తొలిసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నా. పలు దేశాల్లో మైండ్ మేనేజ్‌మెంట్‌ను పరిశీలించా. అందులో ఒకటి మా సంస్థలో నేను పాటించా. ఉద్యోగుల కోసం టెన్నిస్ కోర్టుల్లాంటివి ఏర్పాటు చేశాం. దీంతో రోజూ లేటుగా వచ్చే వాళ్లు 45 నిముషాలు త్వరగా విధుల్లోకి వస్తున్నారు. ఇలాంటి మైండ్‌ఫుల్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాల ద్వారా యాజమాన్యం, ఉద్యోగుల మధ్య మంచి వాతావరణం నెలకొంటుంది’’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అడ్జంక్, ఐవైఎఫ్ రీజినల్ డైరెక్టర్ కిమ్‌డాంగ్ యాప్‌లు పాల్గొని ప్రసంగించారు.
గెలవాలంటే మైండ్‌సెట్ మారాలి!
Published Wed, Apr 26 2017 2:37 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
Advertisement
Advertisement