ప్రభుత్వ భూములను గుర్తించండి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ భూములను గుర్తించి ఈ నెల 16వతేదీలోగా వాటి వివరాలను సీసీఎల్ఏ వెబ్సైట్లో ఉంచాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. మంగళవారం హైదరాబాదు నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూముల గుర్తింపులో జాప్యం జరిగితే సహించబోమన్నారు. విలువైన భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు, అవసరమైతే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో జేసీల కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. 7వ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేయాలన్నారు. గ్యాస్ వినియోగదారుల నుంచి ఆధార్, బ్యాంకు అకౌంటు నెంబర్లు సేకరించి అనుసంధానం చేయాలని సూచించారు.
వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వన్‌టైమ్ కన్వర్షన్, నాల, ఆడిట్ ఫారాల పరిష్కారం తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల, ఆదోని తహశీల్దార్లు కూర్మానాథ్, నరసింహులు, రాంసుందర్‌రెడ్డి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.