చరిత్ర తెలిసి ఉంటేనే.. సేవ చేయగలం
నల్లగొండ టూ టౌన్: ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా నిర్వహించే పరీక్షల్లో తెలంగాణ చరిత్రను సిలబస్‌గా చేర్చడంపట్ల అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన కళ్లముందున్న మన చరిత్రను చూడాలి. మన ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి, రాసుకోవడానికి వెసులుబాటు ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై అద్భుతమైన సమాచారం అందుబాటులో ఉంది. అభ్యర్థులందరూ దీనిని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి. మన చరిత్ర మనకు తెలియకపోతే మన ప్రాంతానికి సేవ చేయలేరు.
ఉద్యోగులకు ప్రాంతం గురించి పూర్తిగా తెలిసి ఉండాల్సిందే.’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. శుక్రవారం నల్లగొండలోని చిన వెంకటరెడ్డి ఫంక్షన్‌హాలులో ‘సాక్షి- భవిత’ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్స్ పరీ క్షలపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించాలన్న బలమైన ఆకాంక్ష ఈ ప్రాంత విద్యార్థుల్లో ఉందన్నారు. అయితే, ఉద్యోగంరాని వారు బాధపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిజాయితీతో పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ‘సాక్షి’ నిర్వహిస్తున్న సదస్సులకు హాజరవుతున్న అభ్యర్థులలో ఎక్కువ మంది రైతు కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలేవారే కనుక సబ్జెక్టుపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ ఐదారునెలల పాటు అహర్నిశలు శ్రమించి టీఎస్పీఎస్సీ లో కీలకమార్పులు తీసుకొచ్చామన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి నిబద్ధతతో పరీక్ష లు జరుగుతాయన్నారు.
పరీక్షకేంద్రాల్లో బయోమెట్రిక్ పద్ధతిని అమల్లోకి తేవాలని కమిషన్ నిర్ణయించిందని, పరీక్ష రాసిన వ్యక్తే ఇంటర్వ్యూకు హాజరయ్యారా లేదా అని నిర్ధారించేందుకు ఇంటర్వ్యూ వేళ కూడా బయోమెట్రిక్ తీసుకుంటామని, నాలుగు వైపులా కని పించే విధంగా పరీక్ష గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని విఠల్ తెలిపారు. కవి, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి చరిత్రపై అవగాహన కల్పించారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సిల బస్ పుస్తకాలను సాక్షి సహకారంతో పేద విద్యార్థులకు అందించేందుకు ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రయత్నిస్తామని చెప్పారు.
‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో గందరగోళం తొలగిం చడానికే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షల కోసం త్వరలోనే సాక్షి హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రకటిస్తామని తెలి పారు. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ పరీక్ష అయిపోయే వరకు అభ్యర్థులు తమ జేబుల్లో సిల బస్ కాగితం పెట్టుకుని తిరగాలన్నారు.
ప్రముఖ కవి, రచయిత వేణు సంకోజు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో ‘సాక్షి’ మఫిసిల్ ఎడిటర్ ఎస్.చలపతిరావు, నెట్వర్క్ ఇన్చార్జ్ కె.శ్రీకాంత్‌రావు, నల్లగొండ మునిసిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మితోపాటు వేల సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. సదస్సు ప్రాంగణం కిక్కిరిసిపోయింది.