బాటిల్లో బబ్బోపెట్టండి..
తాము చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా శవపేటికలను ముందే తయారుచేయించుకుంటున్న వాళ్లు విదేశాల్లో పెరిగిపోయారు. అలాంటోళ్లలో ఈయనో వెరైటీ టైపు. ఈయన చనిపోయాక తనను విస్కీ బాటిల్లో బబ్బోపెట్టమంటున్నాడు. ఈయన పేరు ఆంటో విక్‌హాం(48). గతంలో బ్రిటన్ సైన్యంలో పనిచేశాడు. ఇరాక్ యుద్ధంలో తన కళ్ల ముందే చాలా మంది సహచరులు చనిపోయారట. వారి అంత్యక్రియలకు వెళ్లడం.. అందరూ ముఖాలు వేలాడదీసుకుని ఉండటం వంటివి చూశాడట. అప్పుడే డిసైడయ్యాడట. తన అంత్యక్రియలు సంతాప కార్యక్రమంలా కాకుండా ఓ వేడుకలా జరగాలని.. ఎలాంటి శవపేటిక తయారుచేయించుకోవాలా అని ఆలోచించాడు.
వెంటనే తనకిష్టమైన జాక్ డానియల్స్ విస్కీ గుర్తొచ్చింది. వెంటనే అదే బాటిల్ రూపంలో 10 అడుగుల పొడవున్న శవపేటికకు ఆర్డర్ ఇచ్చాడు. దీని కోసం రూ.30 లక్షలు వెచ్చించాడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్న విక్‌హాం.. తన అంత్యక్రియలకు ఇంకా చాలా వినూత్న ప్లాన్స్ వేసుకుంటున్నాడు. సమాధి రాయిని ఐప్యాడ్ రూపంలో చేయించాలని యోచిస్తున్నాడు.