జాక్‌పాట్ లారీ పట్టివేత
తడ: చెన్నై నుంచి నెల్లూరుకు వెళుతున్న పార్శిల్ లారీ, బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వచ్చేసింది. దీంతో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వెంబడించి పోలీసుల సాయంతో లారీని పట్టుకున్నారు. సీటీఓ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం తెల్లవారుజాము 4.30ని. సమయంలో డీసీటీఓ వెంకటేశ్వరనాయక్ ఇతర సిబ్బందితో కలసి రహదారిపై వాహనాలను తనీకీ చేస్తున్నారు. ఇంతలో ఓ పార్శిల్ లారీ వేగంగా చెక్‌పోస్టును దాటి వెళుతుండటం గమనించారు. నాయక్ వెంటనే సిబ్బందితో కలిసి వెంబడించారు. సమాచారం అందుకున్న సీటీఓ వెంటనే తడ ఎస్ఐకి ఫోను ద్వారా విషయం తెలపడంతో అప్రమత్తమైన పోలీసులు లారీని వెంబడించారు. ఇంతలో నాయక్ బృందం లారీని మాంబట్టు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై పట్టుకున్నారు. కానీ లారీ డ్రైవర్ వాణిజ్యపన్నుల శాఖ అధికారులతో వాదనకు దిగగా అదే సమయానికి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని చెక్‌పోస్టుకు తరలించారు. ఈ లారీపై నాన్‌స్టాప్ వాహనం కింద కేసు నమోదు చేసి, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఏఓ రవికుమార్ తెలిపారు.