ఘనంగా ఖాదర్లింగ స్వామి జన్మదిన వేడుకలు
కౌతాళం: మండల కేంద్రంలో వెలసిన జగద్గురు ఖాదర్లింగ స్వామి 397వ జన్మదినం సందర్భంగా గురువారం వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారు జామున 5గంటలకు ప్రత్యేక ఫాతెహాలు నిర్వహించి భక్తులను దర్శనానికి వదిలారు. సాయంత్రం స్వామి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, డిల్లీ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆచారం ప్రకారం స్వామి చిత్రపటాన్ని గ్రామానికి చెందిన లింగాయితీ వంశస్థులు మోసుకుంటూ తిరిగారు. హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వేడుకల్లో ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఖాదర్లింగ స్వామి దర్గా ధర్మకర్త సయ్యద్సాహెబ్ పీర్ వుసేని చిష్తీ ఆశీస్సులతో ఈవిన్యాసాలను చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన డ్రమ్సులు వారు చేసిన డప్పు వాయిద్యాలు అలరించాయి. కార్యక్రమాల్లో పీఠాధిపతి ఖాదర్బాషా చిష్తీ, గుల్షన్ కమిటీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు మున్నాపాషా, నజీర్అహ్మద్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.