Jagamohana Rao
-
HCA: రూ. కోటికి పైగా బిల్లు చెల్లింపు.. వివాదానికి ముగింపు
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలోని కార్యవర్గం ఇందుకు శుభం కార్డు వేసింది. ఈ క్రమంలో 2015లో మొదలైన ఈ విద్యుత్ జగడానికి తాము స్వస్తి పలికినట్లు జగన్మోహన్ రావు వెల్లడించారు. సుమారు రూ. ఒక కోటీ 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని ఆయన చెప్పారు. మిగిలిన మొత్తం 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నామన్నారు. అయితే హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించామని ఆయన వివరించారు.ఈ మేరకు మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి జగన్మోహన్ రావు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ తీసేసి, హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫరూఖీని జగన్ ఈ సందర్భంగా కోరారు.చదవండి: ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్ -
రక్తం ధరలు తగ్గుముఖం
శ్రీకాకుళం కల్చరల్: రక్తం విక్రయ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర రెడ్‌క్రాస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పలు సంస్థలు, జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు రక్తం ధరలను తగ్గిస్తూ రాష్ట్ర రెడ్‌క్రాస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడిం చారు.ఇప్పటి వరకు రక్తం ప్యాకెట్టు మామూలుగా రూ.1450, దాత ఉంటే దాన్ని 12 వందల రూపాయలకు అందజేసేవారు. అయితే ధర ఎక్కువగా ఉండడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించి విషయాన్ని రాష్ట్ర రెడ్‌క్రాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. కొత్తరేట్ల ప్రకారం రక్తం ప్యాకెట్టు మామూలగా అయితే రూ.1050, దాత ద్వారా అయితే రూ. 900కు అందజేస్తామన్నారు. -
‘ఎక్సైజ్’ సదస్సులో కొట్లాట
భీమవరపుకోటలో అవగాహన సదస్సు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు గ్రామంలో సారా తయారీదారుల పేర్లు చెప్పిందెవరంటూ ఇరువర్గాల కొట్లాట నాతవరం : విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల ఎక్సైజ్ అధికారులు భీమవరపుకోటలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సు ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు ఎక్సైజ్ పోలీసులు లాఠీ చార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ గ్రామంలో సుమారు 80 మందికిపైగా నాటు సారా తయారీ విక్రయదారులు ఉన్నట్టు తమ దృష్టికి రావడంతో ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు అనంతరం ఇరువర్గాల వారు గ్రామంలో సారా తయారు చేస్తున్నవారి పేర్లు ఎవరు చెప్పారంటూ ఎక్సైజ్ అధికారులు ఎదుట ఘర్షణకు దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ సదస్సు ప్రాంగణంలో కొట్టుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనలో కొందరు స్వల్ప గాయాలకు గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అధికారులు లాఠీ చార్జి చేసి వారిని చెదగొట్టారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ జగన్మోహనరావు మాట్లాడుతూ మీ కోసమే ఈ సదస్సు నిర్వహించామని, ఈ విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల నాతవరం మండలంలో పట్టుబడిన సారా విక్రయదారులను ప్రశ్నిస్తే మీ వద్ద నుంచే సారా తెస్తున్నామని వారు చెప్పిన నేపథ్యంలో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో వారంతా శాంతించారు.