హర్యానా గవర్నర్కు త్రుటిలో తప్పిన ముప్పు
విమానం టేకాఫ్ అవుతుండగా పొగలు
చండీగఢ్: హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియాకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో అత్యవసరంగా దించేశారు. దీంతో గవర్నర్తో పాటు పది మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది కాక గవర్నర్ పహాడియా, ఆయన భార్య శాంతి, ఇద్దరు ఏడీసీలు, ఓ డాక్టర్, ఓ సహాయకుడుతో పాటు ఎనిమిది మంది ఉన్నారు. గురువారం ఉదయం 11.37 గంటలకు గవర్నర్ పహాడియా ఛండీగఢ్ నుంచి ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వ విమానంలో బయలుదేరారు.
విమానం 30 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్వే సమీపంలో అత్యవసరంగా దించేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వైమానికదళ అధికారులు గవర్నర్ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పైలట్ వింగ్ కమాండర్ బీ నందా వెల్లడించారు.