మనసున్న మారాజుకు నివాళి
ప్రముఖ నిర్మాత, దర్శకుడు జగపతి ఆర్ట్స్ అధినేత వీబీ రాజేంద్రప్రసాద్ మృతితో తెలుగుచలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప మానవతా వాదిని, ఉద్దండులైన ఓ సినిమా ప్రముఖుడిని కోల్పోయి నట్లయింది. తన సొంత బ్యానర్ జగపతి ఆర్ట్స్ ద్వారా దసరా బుల్లోడు, బంగారుబుల్లోడు, ఆరాధన, అన్నపూర్ణ, అంతస్తులు, ఆత్మ బలం వంటి ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను అందించడమేగాక, తన వారసత్వంగా జగపతిబాబు రూపంలో ఓ ప్రతిభా సంపన్నుడైన నటున్ని తెలుగు సినిమా ప్రపంచంపై ఆవిష్కరించుకున్న ఘనత వీబీది అనడంలో ఎలాంటి సందేహంలేదు.
ముఖ్యంగా సినిమా జీవి తంలో ఎన్నో ప్రసిద్ధమైన అవార్డులను సొంతం చేసుకున్నప్పటికీ రఘుపతి వెంకయ్య జీవితకాల సాఫల్య పురస్కారం ఆయనకెంతో సంతృప్తినిచ్చి ఉంటుంది. అదేవిధంగా ఫిలింనగర్లో ‘దైవసన్ని ధానం’ అనే పూజా మందిర నిర్మాణంలో కీలకపాత్ర పోషించి అదే దేవస్థానం సన్నిధిలోనే తన శేషజీవితాన్ని చాలా సుఖప్రదంగా, శాంతి సౌభాగ్యాలతో గడిపి తన జీవితానికి ఒక గొప్ప సార్థకతను సంత రింపజేసుకున్నారు. ఏది ఏమైనా తెలుగు సినిమా పరిశ్రమ ఓ పేరు మోసిన విశిష్ట వ్యక్తిని వీబీ రాజేంద్రప్రసాద్ రూపంలో కోల్పోయి నట్లయింది. తెలుగు సినిమా ప్రపంచంలో మనసున్న మారాజుగా పేరొందిన ఆయనకు కన్నీటి నివాళి.
- బుగ్గన మధుసూదనరెడ్డి బేతంచెర్ల, కర్నూల్ జిల్లా