'ఏమయ్యా! ఇవాళ టిఫిన్ ఎక్కువయిందా?'
జగపతి గెస్ట్‌హౌస్‌లో షూటింగ్. మేనేజర్ హుస్సేన్ వచ్చి ‘లంచ్‌కి ఏం కావాలి?’ అని అడిగారు. నేను మేకప్ చేసుకుంటున్నాను. నవ్వి, ‘నేను ఈ సినీమాకి హీరోని. హోటల్ చోళా నుంచి ఫలానా ఐటమ్స్ తెప్పించండి!’ అన్నాను.
ఆ రోజుల్లో ‘జగపతి’ సంస్థ అంటే మాకందరికీ పెద్ద గ్లామరు. కారణం.. మంచి జనాదరణ పొందిన చిత్రాలను నిర్మించడం. అంతకుమించి నిర్మాత రాజేంద్రప్రసాద్ గారి పెద్ద మనస్సు, ఆదరణ, ఔదార్యాన్ని గురించి కథలుగా చెప్పుకునే వారు. ఆయన గురించి పొల్లుగా మాట్లాడిన ఒక్కరినీ నేను చూడలేదు.
నేను ముమ్మరంగా సినీమాలు చేస్తున్న రోజుల్లో రాజేంద్రప్రసాద్ గారు పిలిపించారు. ఆయన మాట లివి: ‘నేను బాగా చితికిపోయాను. ఏం ఇమ్మంటారు?’ అని. నా సమాధానం గుర్తుంది. ‘మీ నోటి వెంట ఆ మాట రాకూడదు. మీ సంస్థలో చేయడం మంచి అవకా శం. మీరేమనుకుంటే అది చెయ్యండి’’ అన్నాను. ఏదో అంకె చెప్పారు. ‘ఎస్.పి. భయంకర్’ చిత్రం. నా ఆడ వేషానికీ, ‘ఆజా దేఖో మజా’ అనే ఖవ్వాలీ (నేనూ, అక్కి నేని చేసిన డ్యాన్స్)కీ ఆయన తీసుకున్న శ్రద్ధ ఆశ్చర్య కరం. వేషంలో నన్ను చూసి అక్కినేని, ‘మీరు నా కెరీ ర్లో 53వ హీరోయిన్’ అన్నారు. సినీమా అయిపోయింది. రేపు రిలీజనగా మేనేజర్ హుస్సేన్ మా ఇంటికి వచ్చి ‘ప్రొడ్యూసర్‌గారు ఇమ్మన్నారు’ అంటూ ఒక కవరు కిటికీ దగ్గర పెట్టి వెళ్లిపోయారు. అది అప్పుడు నేను తీసుకుంటున్న, నేను చెప్పని పైకం బ్యాలన్స్. అదీ ఆయన వితరణ.
రాజేంద్రప్రసాద్‌గారు సినీమాల్లో నటించడానికి వచ్చారు మొదట్లో. కాని అనుకోని రెండు గొప్ప ప్రక్రియ లను చేపట్టారు - నిర్మాణం, దర్శకత్వం. ఆయన అక్కి నేని వీరాభిమాని. అంతకు ముందే ఆ కుటుంబాలకు సాన్నిహిత్యం ఉంది. నిర్మాత అయ్యాక అక్కినేనిని మొదటి సినీమా చేయమంటే ‘నేను నటించి నిన్ను చెడగొట్టను’ అన్నారట. జగ్గయ్య ప్రధాన పాత్రగా ‘అన్న పూర్ణ’ తీశారు. తర్వాత అన్ని చిత్రాలకు అక్కినేని హీరో. ఆయనంటే ఎంత అభిమానమంటే- ఏదయినా రిస్క్ తీసుకునే షాట్ చేయాలంటే- ముందు తను చేసి ఆయన్ని పిలిచేవారు.
ఆయన అజాతశత్రువు. ఎవరినయినా కోపగించగా ఎవరూ చూసి ఉండరు. ఓసారి సెట్ మీద ఏదో విసుగు దలతో ‘ఏమయ్యా! ఇవాళ టిఫిన్ ఎక్కువయిందా?’ అని ఎవరితోనో అన్నారు. నా పక్కన ఉన్న అక్కినేని నవ్వి, ‘బహుశా బాబు జీవితంలో కోపంగా అన్నమాట ఇదేనేమో!’ అన్నారు. తనతో పనిచేసిన సిబ్బంది సంక్షే మానికి ప్రత్యేకంగా ఒక సినీమా తీసిన ఒకే ఒక్క నిర్మాత రాజేంద్రప్రసాద్‌గారు.
ఆయన చిత్రాలలో పాటలు చాలా పాపులర్. పాట లన్నీ కలిపి గొలుసు చిత్రంగా తయారుచేశారు. దాని పేరు ‘చిటపట చినుకులు’. పాటలని అతికించే చిన్న సన్నివేశాలకి నటులు కావాలి. నన్నూ, రమాప్రభనీ ఎంపిక చేశారు. అంటే ఆ చిత్రానికి నేను హీరో. జగపతి గెస్ట్‌హౌస్‌లో షూటింగ్. మేనేజర్ హుస్సేన్ వచ్చి ‘లం చ్‌కి ఏం కావాలి?’ అని అడిగారు. నేను మేకప్ చేసుకుం టున్నాను. నవ్వి, ‘నేను ఈ సినీమాకి హీరోని. హోటల్ చోళా నుంచి ఫలానా ఐటమ్స్ తెప్పించండి!’ అన్నాను. నా పక్కన మేకప్ చేసుకుంటున్న రమాప్రభ నన్ను చేత్తో పొడిచింది కళ్లెగరేస్తూ. తీరా వెనక్కి చూస్తే రాజేంద్ర ప్రసాద్‌గారు కనిపించారు. సిగ్గుపడిపోయాను. ఆ రోజు లంచ్‌కి చోళా నుంచి నాకూ, రమాప్రభకీ పెద్ద పెద్ద పార్శిళ్లు వచ్చాయి.
జగపతిబాబు నటించిన మొదటి చిత్రానికి (సింహ స్వప్నం) నేను విలన్ని. వి. మధుసూదనరావుగారు దర్శకులు. ఆయన తీసిన ‘భార్యాభర్తల అనుబంధం’ సినీమాలో నేను నటిస్తే, మా అబ్బాయి శ్రీనివాస్ ఆయన దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు.
మా గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండేషన్ కార్యక్రమానికి శివాజీ గణేశన్‌గారిని పిలవాలని కోరిక. శివాజీగారు జగపతిలో పనిచేశారు. ఆయనకి ఫోన్ చేశాను. నన్ను స్వయంగా వెంటబెట్టుకుని శివాజీ గారింటికి తీసుకెళ్లారు. అదే నేను శివాజీగారిని కలవడం, ఇంటికెళ్లడం. ‘ఏమాత్రం వీలున్నా వస్తాను రాజా’ అన్నారు శివాజీ. ‘రాజా’ అన్న పిలుపులో శివాజీకి ఆయన పట్ల ఉన్న అభిమానం, ఆత్మీయతా పెల్లుబికింది.
ఈమధ్య బి. నాగిరెడ్డిగారి స్మారక పురస్కార సభకి ప్రధాన అతిథిగా వచ్చారు. ఆయాసపడుతున్నారు. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించాను. ‘బాగులేను. నా ఆస్త్మా తెలుసుకదా! ఇంక పైకి వెళ్లిపోవడమే’ అన్నారు.
చివరి రోజుల్లో పూర్తిగా అంతర్ముఖులై ఫిలిం నగర్లో ఆలయ సముదాయాన్ని ఉద్ధరించే పనిలో నిమగ్నమయిపోయారు. మనస్సులో ఉన్న ఉదాత్తత పండి పరిపక్వతకు వచ్చిన దశ అది. తెలుగు సినీమా రంగంలో జగపతి ఓ చరిత్ర. రాజేంద్రప్రసాద్‌గారు అభిరుచికీ, అభినివేశానికీ, ఆదర ణకీ, ఔదార్యానికీ అరుదయిన ప్రతీక.