బంగారం బెంగ తీరింది..!
మంచిర్యాల అర్బన్: ఈ నెల 31న ప్రారంభమయ్యే మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మలకు మొక్కులుగా సమర్పించే బంగారం (బెల్లం)పై ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. మేడారం జాతర పూర్తయ్యే వరకు బెల్లం విక్రయాలు జరుపుకోవడానికి అనుమతిచ్చింది. అయితే విక్రయించే బెల్లానికి సంబంధించి పక్కాగా లెక్క ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు గాను ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఇదివరకు గుడుంబా నియంత్రణ పేరిట ఆంక్షలు విధించడం, మరోవైపు పోలీస్, ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేయటంతో బెల్లం విక్రయాలను వ్యాపారులు నిలిపివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా బెల్లం కొరత ఏర్పడింది. మేడారం జాతర సమీపిస్తుండటంతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జాతర వరకు బెల్లంపై నిబంధనలు సడలించడంతో భక్తులకు ఊరట కలిగింది.
కొనుగోలుదారులతో సందడి..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం బెల్లం కొనుగోలుకు జనం తరలిరావడంతో హోల్‌సేల్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. మహిళలు మంగళహారతులు చేబూని బెల్లం కొనుగోలుకు వచ్చారు. తల్లుల మొక్కులు తీర్చుకునేందుకు బంగారం (బెల్లం)ను తూకం వేసే దృశ్యాలు కనిపించాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు మొక్కులు అప్పగించే భక్తులు నిలువెత్తు (వ్యక్తి బరువుకు సమానం) బెల్లం కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
ఆధార్‌కార్డు చూపిస్తేనే...
బెల్లం పక్కదారి పట్టకుండా వ్యాపారులకు కొన్ని షరతులను విధించారు. బెల్లం కొనుగోలు చేసే వారి నుంచి తప్పనిసరిగా ఆధార్‌కార్డు నెంబర్, ఫోన్ నెంబర్లను వ్యాపారులు సేకరిస్తున్నారు. గృహ అవసరాల కోసం వాడుకుంటామని, ఇతర అవసరాల వినియోగించబోమని హామీపత్రం (రశీదు)పై సంతకం తీసుకుని బెల్లం విక్రయాలు జరపుతున్నారు. రిటైల్ వ్యాపారులకు విక్రయించే సమయంలో పక్కాగా బిల్లులు ఇస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ అధికారులు లెక్కలు అడిగితే చూపేందుకు జాగ్రత్తలు పడుతున్నారు.
లారీ వచ్చిన మూడు గంటల్లోపే ఖతం
బుధవారం నుంచి బెల్లంపై నిబంధనలు సడలించటంతో మంచిర్యాలలోని హోల్‌సేల్ వ్యాపారులు మహారాష్ట్ర నుంచి బెల్లం దిగుమతి చేసుకున్నారు. ముగ్గురు హోల్‌సేల్ వ్యాపారులు మూడు లారీల్లో బెల్లం తెప్పించారు. ఒక్కో లారీలో ఒక్కో ముద్ద పది కిలోల చొప్పున ఉండే 1600 ముద్దలు (16 టన్నులు) తెచ్చారు. మూడు గంటల్లోపే మొత్తం విక్రయాలు పూర్తి చేశారు. హోల్‌సేల్ వ్యాపారులు కిలోకు రూ.32 చొప్పున అమ్ముతున్నారు. జాతరకు వెళ్లే భక్తులు మంచిర్యాల జిల్లా నుంచే ఎక్కువ మంది ఉండటం వల్ల బెల్లం విక్రయాలు అధికంగానే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. ఇక్కడినుంచి మంథని, కాటారం, సిరోంచ, మందమమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాలకు బెల్లం సరఫరా చేస్తుంటారు. దాదాపుగా జాతర పూర్తయ్యేవరకు 30 నుంచి 40 లారీల మేర బెల్లం అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఓ వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి బెల్లం దిగుమతి అవుతోందని చెప్పారు.
హోల్‌సేల్ దుకాణాలు..
మంచిర్యాలలోని శ్రీనివాస టాకీస్ రోడ్లో హోల్‌సేల్ బెల్లం దుకాణాలు ఉన్నాయి. ఓం ట్రేడింగ్ కంపెనీ, దయాల్ ట్రేడింగ్, రాందయాల్, సంతోష్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు మరో రెండు హోల్‌సేల్ దుకాణాల్లో బెల్లం లభిస్తోంది.