Jahangirpuri
-
రెచ్చగొట్టేలా హెడ్‌లైన్స్ వద్దు: కేంద్రం హెచ్చరికలు
వివాదాస్పదమైన హెడ్డింగ్‌లు, రెచ్చగొట్టేలా హెడ్‌లైన్స్, సంచలనాల పేరిట ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయొద్దంటూ టీవీ ఛానెల్స్‌కు కేంద్రం చురకలంటించింది. న్యూస్ ఛానెల్స్‌లో టెలికాస్ట్ చేసే కంటెంట్ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ.. శనివారం ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, జహంగీర్‌పురి హింస నేపథ్యంలో.. పలు మీడియా ఛానెల్స్ వ్యవహరించిన తీరు దృష్టికి రావడంతో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ స్పందించింది. ఉక్రెయిన్ పరిణామాలపై.. చాలావరకు న్యూస్ యాంకర్లు అతిశయోక్తితో కూడిన ప్రకటనలు ఇవ్వడం, వివాదాస్పదమైన హెడ్డింగ్‌లు, ట్యాగ్ లైన్లు తగిలించడం దృష్టికి వచ్చిందని కేంద్రం పేర్కొంది. అలాగే ఢిల్లీ జహంగీర్‌పురి హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మీడియా ఛానెల్స్ వ్యవహరించిన తీరు.. దర్యాప్తునకు ఇబ్బంది కలిగించిందని కేంద్రం అభిప్రాయపడింది. అలాగే టీవీ ఛానెల్స్‌లో డిబేట్స్ సందర్భంగా ఘటనలకు సంబంధించి.. నీచమైన భాష, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, సమాజం అంగీకరించలేని రీతిలో భాషను గుర్తించినట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కంటెంట్ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీని విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(నియంత్రణ) చట్టం 1995 ప్రకారం.. టీవీ ఛానెల్స్ నడుచుకోవాలి. ►కుల, మతాలను రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసారాలు ఉండకూడదు. ► ఇంకొకరి పరువు, ప్రతిష్టలను దెబ్బతినేలా ఉద్దేశపూర్వక వార్తలు వేయకూడదు. ► తొందరపాటులో ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. వాటిని వెంటనే ప్రసారం చేయకూడదు ► తప్పుడు సమాచారం, అశ్లీల కథనాల వార్తలు వద్దు. ► జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులపై పుకార్లను ప్రసారం చేయకూడదు ► అసత్యాలను వల్లె వేసి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దు ► సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా.. రెచ్చగొట్టేలా పదే పదే ప్రసారం చేయొద్దు ► కథనాలను సగం చెప్పి.. వీక్షకులకు పక్కదారి పట్టించొద్దు. ► వివిధ వర్గాల మనోభావాలను కించపరిచే, దెబ్బతీసే కథనాలు వద్దు. -
జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి కూల్చివేతల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ కూల్చివేతలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాయి. విపక్షాల నిరసన కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నివాసం వద్ద యువజన కాంగ్రెస్ గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, ఎంపీ శక్తి సింగ్ గోహిల్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, ఉపాధ్యక్షుడు అభిషేక్ దత్తో సహా 15 మందితో కూడిన బృందం జహంగీర్‌పురి బాధితులను కలిసింది. ‘మేము బాధితులను కలిసేందుకు జహంగీర్‌పురికి వచ్చాము. పోలీసులు సహకరించారు. దీన్ని మతం కోణంలో చూడకూడదని ప్రజలకు చెప్పేందుకు ఇక్కడికి వచ్చామ’ని మీడియాతో అజయ్ మాకెన్ చెప్పారు. కూల్చివేతల సమయంలో అక్కడ లేనందుకు క్షమాపణ చెబుతూ మాకెన్ ట్వీట్ చేశారు. (క్లిక్: ఇంత జరుగుతున్నా కేజ్రీవాల్ ఎక్కడ..) విభజన రాజకీయాలు చేయం: మమత ఇక ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘మేము బుల్డోజ్ చేయకూడదనుకుంటున్నాము. ప్రజలను విభజించాలని కోరుకోవడం లేదు. ప్రజలను ఏకం చేయాలనుకుంటున్నాం. ఐకమత్యమే మా ప్రధాన బలం. ఐక్యంగా ఉంటేనే సాంస్కృతికంగా ఎంతో దృఢంగా ఉంటా’మని ఏఎన్ఐతో అన్నారు. మతం ఆధారంగా బుల్డోజర్లు: తేజశ్వి యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... ‘సుప్రీంకోర్టు జోక్యం తర్వాత కూడా జహంగీర్‌పురిలో కూల్చివేతలు కొనసాగాయి. మనదేశంలోకి చైనా చొచ్చుకుని వస్తున్నా చర్యలు శూన్యం. అయితే మతం ఆధారంగా బుల్డోజర్లు నడుపుతున్నార’ని ఆయన వ్యాఖ్యానించారు. (క్లిక్: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్) ఆ ఆరోపణలు సరికాదు: తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందనే ఆరోపణ సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లు జమియత్ ఉలమా-ఐ-హింద్ దాఖలు చేసిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఉత్తర ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జహంగీర్‌పురిలో కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.