న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి కూల్చివేతల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ కూల్చివేతలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాయి.
విపక్షాల నిరసన
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ నివాసం వద్ద యువజన కాంగ్రెస్ గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, ఎంపీ శక్తి సింగ్ గోహిల్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, ఉపాధ్యక్షుడు అభిషేక్ దత్‌తో సహా 15 మందితో కూడిన బృందం జహంగీర్‌పురి బాధితులను కలిసింది.
‘మేము బాధితులను కలిసేందుకు జహంగీర్‌పురికి వచ్చాము. పోలీసులు సహకరించారు. దీన్ని మతం కోణంలో చూడకూడదని ప్రజలకు చెప్పేందుకు ఇక్కడికి వచ్చామ’ని మీడియాతో అజయ్ మాకెన్ చెప్పారు. కూల్చివేతల సమయంలో అక్కడ లేనందుకు క్షమాపణ చెబుతూ మాకెన్ ట్వీట్ చేశారు. (క్లిక్: ఇంత జరుగుతున్నా కేజ్రీవాల్ ఎక్కడ..)
విభజన రాజకీయాలు చేయం: మమత
ఇక ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘మేము బుల్డోజ్ చేయకూడదనుకుంటున్నాము. ప్రజలను విభజించాలని కోరుకోవడం లేదు. ప్రజలను ఏకం చేయాలనుకుంటున్నాం. ఐకమత్యమే మా ప్రధాన బలం. ఐక్యంగా ఉంటేనే సాంస్కృతికంగా ఎంతో దృఢంగా ఉంటా’మని ఏఎన్‌ఐతో అన్నారు.
మతం ఆధారంగా బుల్డోజర్లు: తేజశ్వి యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ) అధ్యక్షుడు తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... ‘సుప్రీంకోర్టు జోక్యం తర్వాత కూడా జహంగీర్‌పురిలో కూల్చివేతలు కొనసాగాయి. మనదేశంలోకి చైనా చొచ్చుకుని వస్తున్నా చర్యలు శూన్యం. అయితే మతం ఆధారంగా బుల్డోజర్లు నడుపుతున్నార’ని ఆయన వ్యాఖ్యానించారు. (క్లిక్: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్)
ఆ ఆరోపణలు సరికాదు: తుషార్ మెహతా
కేంద్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందనే ఆరోపణ సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లు జమియత్ ఉలమా-ఐ-హింద్ దాఖలు చేసిందని వెల్లడించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఉత్తర ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జహంగీర్‌పురిలో కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment