Jahnavi Dangeti
-
ఇచ్చిన మాటకు కట్టుబడి.. జాహ్నవికి రూ.50లక్షల సాయం
సాక్షి, పశ్చిమగోదావరి: ఇచ్చిన మాట ప్రకారం తనకు సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల సాయం అందజేయడంపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి ఆనందం వ్యక్తం చేసింది. జగనన్న మేలు మర్చిపోలేనిదని పేర్కొంది. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఇటీవల వరదల సమయంలో సీఎం రాజమండ్రి వచ్చినప్పుడు కలిశానని, ‘‘నీ విద్యకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదు.. నీకు ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తా’’ అంటూ అప్పుడు ఆయన హామీ ఇచ్చారని పేర్కొంది. సీఎం భరోసాతో ఆస్ట్రోనాట్‌గా అవ్వాలన్న తన ఆశలు మరింత పెరిగాయంది. బుధవారం అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతులమీదుగా ప్రభుత్వం అందించిన రూ. 50 లక్షల చెక్కును జాహ్నవి అందుకుంది. చదవండి: (Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు) -
Jahnavi Dangeti: వ్యోమగామి కలకు సీఎం జగన్ చేయూత
సాక్షి, అమరావతి/పాలకొల్లు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసినట్టు పౌరసంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. సచివాలయంలో బుధవారం జాహ్నవికి చెక్కును అందజేశారు. చదవాలనే తపన ఉండి నిరుపేద విద్యార్థులకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా నిలుస్తారని చెప్పారు. జాహ్నవి పంజాబ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతో నాసాతో పాటు పోలాండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందింది. అయితే వ్యోమగామికి అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉండగా ఆర్థిక సాయం నిమిత్తం సీఎంని కలిసి కోరగా సానుకూలంగా స్పందించారు. నెలలోపే ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. జాహ్నవి మాట్లాడుతూ సీఎం దీవెనలతో త్వరలోనే శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు. వ్యోమగామిగా దేశ కీర్తిని పెంచేందుకు కష్టపడతానని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాసరావు ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను జాహ్నవి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జాహ్నవిని పద్మ సత్కరించారు. (క్లిక్ చేయండి: చరిత్ర సృష్టించిన జాహ్నవి.. స్పేస్ కావాలి!) -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జాహ్నవి దంగేటి
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం కలిశారు. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. చదవండి: వరద బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం జగన్ భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు సీఎంకి వివరించింది. జాహ్నవి విజ్ఞప్తిపై సీఎం జగన్.. సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జాహ్నవి కుటుంబ సభ్యులు ఉన్నారు. చదవండి: అమ్మమ్మ కథలు.. అస్ట్రోనాట్ కలలు -
అమ్మమ్మ కథలు.. అస్ట్రోనాట్ కలలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)తూర్పుగోదావరి: నిండు పున్నమి రోజు ఆరు బయట మంచం మీద బామ్మ ఆమెకు అన్నం తినిపిస్తూ ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అనేక కథలు చెప్పేది. చందమామ లోపల ఒక ముసలావిడ నూలు వడుకుతుందని చెప్పేది. ఒక్కోసారి చందమామ ఎందుకు కనిపించకుండా పోతుందని అమ్మమ్మని అడిగితే..రాహువు, కేతువులు చందమామని మింగేస్తారు అందుకే చందమామ క్రమంగా తరుగుతూ, పెరుగుతూ ఉంటుందని తెలపడంతో మనవరాలిలో ఆలోచనలు మొలకెత్తాయి. చదవండి: రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే.. ఆ చిన్నారికి చందమామ దగ్గర ఏం ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ వచ్చింది. 17 సంవత్సరాలకే నాసా నిర్వహించిన ప్రోగ్రామ్‌లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. 18 ఏళ్ల వయసులో ఇప్పుడు పోలెండ్‌లో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతి చిన్న వయసులో ఈ శిక్షణ పొందిన మొదటి మహిళగా రికార్డు సాధించింది. అంతరిక్షంలో విహారానికి రెక్కలు చాపుకుని ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి పాలకొల్లుకి చెందిన జాహ్నవి దంగేటి. అమ్మమ్మ నాగమణితో జాహ్నవి అమ్మమ్మ లాలనలో... జాహ్నవి అమ్మానాన్నలు శ్రీనివాస్, పద్మశ్రీ ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉండడంతో ఆమె అమ్మమ్మ నాగమణి దగ్గర పెరిగింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే నేర్చుకొనేలా చేసింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ పతకాలు సాధించింది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో కూడా తర్ఫీదు పొందింది. 17వ ఏటే నాసాలో పాల్గొన్న రికార్డు పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉండే జాహ్నవి పంజాబ్‌లోని లవ్లీ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. యూఎస్‌కి చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం లేని ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొంది. జాహ్నవి పాల్గొనడం ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్డే. తల్లిదండ్రులతో జాహ్నవి రాకెట్ నడిపింది.. జాహ్నవి గత సంవత్సరం 2021 నవంబర్ 12వ తేదీన యూఎస్‌కి వెళ్లి అక్కడి అలబామాలోని నాసాకు చెందిన స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్లో అస్ట్రానాట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకొంది. పది రోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్, ట్రైనింగ్, అండర్‌వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతో పాటు ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకొంది. మెషీన్ కంట్రోలర్‌కి ఫ్లైట్ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి జాహ్నవి నేతృత్వం వహించింది. సెస్మా 170 స్కైహాక్ అనే చిన్న రాకెట్‌ని విజయవంతంగా లాంచ్ చేసింది. భూమి మీద నుంచి గాల్లోకి ఎగరడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడంలో ప్రతిభ చూపింది. నాసా సెంటర్లో తోటి అనలాగ్ అస్ట్రోనాట్స్‌తో కలెక్టర్ ప్రశంసలు పొంది.. పోలెండ్‌లో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతి చిన్న వయసులో ఈ శిబిరంలో పాల్గొన్న మొదటి మహిళాగా రికార్డు సాధించిన జాహ్నవి బుధవారం పోలెండ్ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని కలెక్టర్ మాధవీలతను మర్యాద పూర్వకంగా కలిసింది. అనలాగ్ అస్ట్రోనాట్‌గా శిక్షణ పొంది దేశానికి గర్వకారణంగా జాహ్నవి నిలిచిందని, అంతరిక్షంలోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యం నెరవేరాలని కలెక్టర్ మాధవీలత ఆకాంక్షించారు. తమ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు. స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంటో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్ వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ కోసమే స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నా పేరు నమోదు అయ్యింది. నేను సాధించిన వాటికి వచ్చిన ప్రశంసలన్నీ మా అమ్మమ్మకే దక్కాలి. – జాహ్నవి దంగేటి -
చరిత్ర సృష్టించిన పశ్చిమ గోదావరి జాహ్నవి.. స్పేస్ కావాలి!
ఓ పాపాయి నేను డాక్టర్ని అవుతాను... అంటే! మన దగ్గర కావలసినన్ని కాలేజీలున్నాయి. మరో పాపాయి ‘ఇంజినీరింగ్ ఇష్టం’ అంటే... లెక్కకు మించిన విద్యాసంస్థలున్నాయి. ‘నేను ఆస్ట్రోనాట్ అవుతాను’ అంటే... ఎలా చదవాలో చెప్పేవాళ్లే లేరు. ‘స్పేస్ ఎడ్యుకేషన్’కి తగిన స్పేస్ మన దగ్గర లేదు. ఒక కల్పనాచావ్లా... మరో సునీతా విలియమ్స్ గురించి చెప్పుకుని సంతోషపడుతున్నాం ఇప్పటికీ. భారత సంతతికి చెందిన వారని సంతృప్తిపడుతున్నాం. మనదేశం నుంచి తొలిసారిగా ఒక అమ్మాయి ముందుకొచ్చింది. ‘నేను అంతరిక్షంలో అడుగుపెడతాను’ అంటున్న... ఈ తెలుగమ్మాయి పేరు జాహ్నవి దంగేటి. ‘చందమామ రావే’ అంటూ సాగిన బాల్యం. ‘అంతరిక్షంలో విహరిస్తా’ అంటూ రెక్కలు విచ్చుకున్నది. జాహ్నవి దంగేటిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూఎస్‌కు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి పార్టిసిపేషన్ లేని ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొన్నది. జాహ్నవి రికార్డు ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్టే. రాకెట్ నడిపింది! జాహ్నవి గత నవంబర్ పన్నెండున యూఎస్‌కి వెళ్లి, అక్కడి అలబామాలోని నాసాకు చెందిన ‘స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్’లో ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని 22వ తేదీన తిరిగి వచ్చింది. పదిరోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్‌వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకుంది. జాహ్నవి మిషన్ కంట్రోలర్‌కి ఫ్లైట్ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి నేతృత్వం వహించింది. ‘సెస్నా 171 స్కైహాక్’ అనే చిన్న రాకెట్‌ను విజయవంతంగా లాంచ్ చేసింది. ‘భూమి మీద నుంచి గాల్లోకి ఫ్లై అవడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడం’ మరిచిపోలేని అనుభూతి అన్నది ఈ అమ్మాయి. ‘ఆస్ట్రోనాట్‌గా పూర్తి స్థాయి శిక్షణ తీసుకోవాలనే కోరిక బలపడడంతోపాటు ఆస్ట్రోనాట్ కాగలననే నమ్మకం కూడా కలిగింది. పైలట్ ఆస్ట్రోనాట్ అయి తీరుతాను’ అని చెప్పింది. అమ్మమ్మ పెంపకం! జాహ్నవి అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉండడంతో ఆమె అమ్మమ్మ లీలావతి దగ్గరే పెరిగింది. అమ్మమ్మ చందమామ కబుర్లు చెబుతూ పెంచింది. అలా ఆకాశంలో విహరించాలనే కోరికకు బీజం పడింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే క్లాసులో చేర్చింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించింది. అంతరిక్షం కల మాత్రం ఆమెను వెంటాడుతూనే వచ్చింది. అందుకు ఉపకరించే స్కిల్స్ కోసం అన్వేషణ ఆమె మదిలో సాగుతూనే ఉండేది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో కూడా తర్ఫీదు పొందింది. వివక్ష తప్పలేదు... కానీ! ఆడపిల్లలు డైనమిక్‌గా ఉంటే సమాజం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. తీర్పులు ఇస్తూనే ఉంటుంది. వద్దన్నా వినకుండా సలహాలు ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ తనకూ తప్పలేదని చెప్పింది జాహ్నవి. ‘‘పాలకొల్లు వంటి చిన్న పట్టణంలో చాలామందికి నేను చేస్తున్నవన్నీ విచిత్రాలుగానే తోచాయి. మెడిసినో, కంప్యూటర్ ఇంజనీరింగో చేసి ఉద్యోగం చూసుకోకుండా ఇవెందుకు? అన్నారు. ఇంతడబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా! అని కూడా అన్నారు. ఇవన్నీ వాళ్లకు ‘స్పేస్’ మీద అవగాహన లేకపోవడం వల్ల అన్న మాటలే. అందుకే ప్రతి పట్టణంలోనూ స్పేస్ మ్యూజియం కానీ అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించిన యాక్టివిటీ సెంటర్ కానీ పెడితే బావుంటుంది. అమ్మాయిలను రొటీన్ కోర్సులకు పరిమితం చేయకుండా వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లోకి వెళ్లడానికి ప్రోత్సహించమని పెద్దవాళ్లను కోరుకుంటున్నాను. మా క్లాసులో 33 మంది అబ్బాయిలుంటే నేను మాత్రమే అమ్మాయిని. ఈ విషయంలో మా అమ్మానాన్నలు గ్రేట్ అని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది’’ అని చెప్పింది జాహ్నవి. అంతరిక్షమే హద్దు! ‘‘స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంట్లో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్‌కు వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసమే స్కూబా డైవింగ్ కోసం అంత పట్టుపట్టాను. ఈ మధ్యలో ఓసారి నా ఆలోచనలు ఏవియేషన్ పైలట్ వైపు మళ్లాయి. కానీ నాన్న ‘నీ లక్ష్యం అంతకంటే పెద్దది, దాని మీద నుంచి దృష్టి మరల్చవద్దు’ అన్నారు. ఇక అంతరిక్షం అనే కల నాతోపాటు పెరిగి నాలో స్థిరపడిపోయింది. ఇంజినీరింగ్‌కి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని ఎంచుకోవడంలో ఉద్దేశం కూడా అంతరిక్షం కలను సాకారం చేసుకోవడానికే. ఇప్పటికే ఆన్లైన్లో నాసా నిర్వహించిన ఐదు ప్రోగ్రామ్‌లలో పాల్గొన్నాను. గత ఏడాది ‘పీపుల్స్ చాయిస్’ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పటి వరకు నాసా నుంచి నేను సాధించిన అన్నింటిలో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. నేను ఇవన్నీ చేస్తున్న సమయంలోనే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ నుంచి ఫోన్ వచ్చింది. ఆగస్టులో ఆ పురస్కారం అందుకున్నాను. నేనేం సాధించినా ప్రశంసలు దక్కాల్సింది మా అమ్మమ్మకే’’ అన్నది జాహ్నవి అమ్మమ్మను అల్లుకుంటూ... ‘నాసా’ సెంటర్లో, అమ్మమ్మ లీలావతితో జాహ్నవి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: రియాజ్, ఏలూరు