ఓ పాపాయి నేను డాక్టర్‌ని అవుతాను... అంటే! మన దగ్గర కావలసినన్ని కాలేజీలున్నాయి.
మరో పాపాయి ‘ఇంజినీరింగ్ ఇష్టం’ అంటే... లెక్కకు మించిన విద్యాసంస్థలున్నాయి.
‘నేను ఆస్ట్రోనాట్ అవుతాను’ అంటే... ఎలా చదవాలో చెప్పేవాళ్లే లేరు.
‘స్పేస్ ఎడ్యుకేషన్’కి తగిన స్పేస్ మన దగ్గర లేదు.
ఒక కల్పనాచావ్లా... మరో సునీతా విలియమ్స్ గురించి చెప్పుకుని సంతోషపడుతున్నాం ఇప్పటికీ.
భారత సంతతికి చెందిన వారని సంతృప్తిపడుతున్నాం. మనదేశం నుంచి తొలిసారిగా ఒక అమ్మాయి ముందుకొచ్చింది.
‘నేను అంతరిక్షంలో అడుగుపెడతాను’ అంటున్న... ఈ తెలుగమ్మాయి పేరు జాహ్నవి దంగేటి.
‘చందమామ రావే’ అంటూ సాగిన బాల్యం. ‘అంతరిక్షంలో విహరిస్తా’ అంటూ రెక్కలు విచ్చుకున్నది.
జాహ్నవి దంగేటిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూఎస్‌కు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి పార్టిసిపేషన్ లేని ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొన్నది. జాహ్నవి రికార్డు ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్టే.
రాకెట్ నడిపింది!
జాహ్నవి గత నవంబర్ పన్నెండున యూఎస్‌కి వెళ్లి, అక్కడి అలబామాలోని నాసాకు చెందిన ‘స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్’లో ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని 22వ తేదీన తిరిగి వచ్చింది. పదిరోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్‌వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకుంది. జాహ్నవి మిషన్ కంట్రోలర్‌కి ఫ్లైట్ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి నేతృత్వం వహించింది.
‘సెస్నా 171 స్కైహాక్’ అనే చిన్న రాకెట్‌ను విజయవంతంగా లాంచ్ చేసింది. ‘భూమి మీద నుంచి గాల్లోకి ఫ్లై అవడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడం’ మరిచిపోలేని అనుభూతి అన్నది ఈ అమ్మాయి. ‘ఆస్ట్రోనాట్‌గా పూర్తి స్థాయి శిక్షణ తీసుకోవాలనే కోరిక బలపడడంతోపాటు ఆస్ట్రోనాట్ కాగలననే నమ్మకం కూడా కలిగింది. పైలట్ ఆస్ట్రోనాట్ అయి తీరుతాను’ అని చెప్పింది.
అమ్మమ్మ పెంపకం!
జాహ్నవి అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉండడంతో ఆమె అమ్మమ్మ లీలావతి దగ్గరే పెరిగింది. అమ్మమ్మ చందమామ కబుర్లు చెబుతూ పెంచింది. అలా ఆకాశంలో విహరించాలనే కోరికకు బీజం పడింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే క్లాసులో చేర్చింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించింది. అంతరిక్షం కల మాత్రం ఆమెను వెంటాడుతూనే వచ్చింది. అందుకు ఉపకరించే స్కిల్స్ కోసం అన్వేషణ ఆమె మదిలో సాగుతూనే ఉండేది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో కూడా తర్ఫీదు పొందింది.
వివక్ష తప్పలేదు... కానీ!
ఆడపిల్లలు డైనమిక్‌గా ఉంటే సమాజం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. తీర్పులు ఇస్తూనే ఉంటుంది. వద్దన్నా వినకుండా సలహాలు ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ తనకూ తప్పలేదని చెప్పింది జాహ్నవి. ‘‘పాలకొల్లు వంటి చిన్న పట్టణంలో చాలామందికి నేను చేస్తున్నవన్నీ విచిత్రాలుగానే తోచాయి. మెడిసినో, కంప్యూటర్ ఇంజనీరింగో చేసి ఉద్యోగం చూసుకోకుండా ఇవెందుకు? అన్నారు. ఇంతడబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా! అని కూడా అన్నారు.
ఇవన్నీ వాళ్లకు ‘స్పేస్’ మీద అవగాహన లేకపోవడం వల్ల అన్న మాటలే. అందుకే ప్రతి పట్టణంలోనూ స్పేస్ మ్యూజియం కానీ అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించిన యాక్టివిటీ సెంటర్ కానీ పెడితే బావుంటుంది. అమ్మాయిలను రొటీన్ కోర్సులకు పరిమితం చేయకుండా వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లోకి వెళ్లడానికి ప్రోత్సహించమని పెద్దవాళ్లను కోరుకుంటున్నాను. మా క్లాసులో 33 మంది అబ్బాయిలుంటే నేను మాత్రమే అమ్మాయిని. ఈ విషయంలో మా అమ్మానాన్నలు గ్రేట్ అని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది’’ అని చెప్పింది జాహ్నవి.
అంతరిక్షమే హద్దు!
‘‘స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంట్లో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్‌కు వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్‌డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసమే స్కూబా డైవింగ్ కోసం అంత పట్టుపట్టాను. ఈ మధ్యలో ఓసారి నా ఆలోచనలు ఏవియేషన్ పైలట్ వైపు మళ్లాయి. కానీ నాన్న ‘నీ లక్ష్యం అంతకంటే పెద్దది, దాని మీద నుంచి దృష్టి మరల్చవద్దు’ అన్నారు. ఇక అంతరిక్షం అనే కల నాతోపాటు పెరిగి నాలో స్థిరపడిపోయింది.
ఇంజినీరింగ్‌కి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని ఎంచుకోవడంలో ఉద్దేశం కూడా అంతరిక్షం కలను సాకారం చేసుకోవడానికే. ఇప్పటికే ఆన్‌లైన్‌లో నాసా నిర్వహించిన ఐదు ప్రోగ్రామ్‌లలో పాల్గొన్నాను. గత ఏడాది ‘పీపుల్స్ చాయిస్’ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పటి వరకు నాసా నుంచి నేను సాధించిన అన్నింటిలో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. నేను ఇవన్నీ చేస్తున్న సమయంలోనే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ నుంచి ఫోన్ వచ్చింది. ఆగస్టులో ఆ పురస్కారం అందుకున్నాను. నేనేం సాధించినా ప్రశంసలు దక్కాల్సింది మా అమ్మమ్మకే’’ అన్నది జాహ్నవి అమ్మమ్మను అల్లుకుంటూ...
‘నాసా’ సెంటర్‌లో, అమ్మమ్మ లీలావతితో జాహ్నవి.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: రియాజ్, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment