ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా.. నేను రెడీ!
జై లవకుశ’ ట్రైలర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇది. ఎన్టీఆరే కాదు, ఇప్పుడు సినిమా కూడా రెడీ! విడుదలకు వారం ముందే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందీ సినిమా. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన ‘జై లవకుశ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సిన్మా ట్రైలర్లో మ్యాగ్జిమమ్ కథేంటో చెప్పేశారు. కానీ, చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడదే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది. జై లవ కుశలు ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలే.
అయితే... ముగ్గురిలో పెద్దోడు ‘జై’ చిన్నప్పుడే తమ్ముళ్లకు దూరమై రావణుడిలా ఎదుగుతాడు. లవకుశలు రామలక్ష్మణుల్లా ఎదుగుతారు. మళ్లీ కొన్నాళ్ల తర్వాత ముగ్గురూ కలుస్తారు. అప్పుడు ఏం జరిగింది? ‘మనమనేది అబద్ధం. నేను అనేదే నిజం’ అన్న ‘జై’ తమ్ముళ్లతో ఎలా కలిశాడు? అనేది ఈ 21న థియేటర్లలో చూడాలి. ‘‘ఘట్టం ఏదైనా... పాత్ర ఏదైనా... తారక్ (ఎన్టీఆర్) ఎంత అద్భుతంగా నటిస్తాడో ఈ సినిమా చెబుతుంది. మూడు పాత్రలో తారక్ జీవించాడు’’ అన్నారు కల్యాణ్‌రామ్. రాశీఖన్నా, నివేథా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.