ఏడుగురు మహిళల్ని చంపిన నిందితుడి అరెస్టు
మహబూబ్‌నగర్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు మహిళల్ని చంపేశాడతను. ఇదీ కేవలం మూడు నెలల కాలంలోనే..! ఇలా ఆభరణాల కోసం మహిళలను చంపిన నిందితుడిని చివరకు మహబూబ్‌నగర్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మహబూబ్‌నగర్ మండలం కోడూరుకు చెందిన వడ్డె రాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. కొన్ని నెలలక్రితం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌కు వెళ్లి కొంతకాలం సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇటీవలే ఆమెను మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చి టీడీగుట్ట ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
ఈ క్రమంలో బతికేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి, వారిని దూరంగా తీసుకెళ్లి, దాడిచేసి చంపి, వారి ఒంటిపైనున్న ఆభరణాలను అపహరించడం మొదలుపెట్టాడు. కేవలం మూడు నెలల్లో ఒకే తరహాలో ఏడుగురు మహిళలు హత్యకు గురయ్యారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు వలపన్ని ఎట్టకేలకు బుధవారం రాజును పట్టుకున్నారు. అతడి నుంచి 320 తులాల వెండి ఆభరణాలు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
కాగా, మృతుడి చేతిలో హతమైన మహిళల్లో హన్వాడ మండలం వేపూర్‌కు చెందిన దంతపల్లి నర్సమ్మ (35), వెంకటాపూర్‌కు చెందిన డోకూర్ వెంకటమ్మ (40), దొడ్డలోనిపల్లికి చెందిన మంజలి శాంతమ్మ (43), జైనల్లీపూర్‌కు చెందిన బియ్యన్ని ఎల్లమ్మ (35), చౌడాపూర్కు చెందిన చెన్నమ్మ (35), కొత్తపేటకు చెందిన పారుపల్లి యాదమ్మ (42), మరో గుర్తుతెలియని మహిళ ఉన్నారు.