నేడే రాజ్యసభకు జీఎస్టీ బిల్లు
సభ్యులకు సవరణల ప్రతుల పంపిణీ
* కాంగ్రెస్ కీలక డిమాండ్లకు కేంద్రం అంగీకారం
* బిల్లు ఆమోదానికి కేంద్రం కసరత్తు
* కాంగ్రెస్‌సహా ముఖ్య పార్టీలతో జైట్లీ చర్చలు
* బిల్లు ఆమోదం పొందుతుందని సర్కారు ధీమా
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రతిపాదించిన అధికారిక సవరణల ప్రతులను సభ్యులకు పంపిణీ చేసింది.
జీఎస్టీ బిల్లు ఆమోదానికి ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్‌తోపాటు సమాజ్‌వాదీ, బీజేడీ, తృణమూల్, ఆర్జేడీతో మంగళవారం మరోసారి సంప్రదింపులు జరిపారు. రాజ్యసభలో జీఎస్టీ ప్రతులు తమకు అందలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేష్ అగర్వాల్ నిరసన వ్యక్తంచేశారు. ఈ ప్రతులను రెండు రోజుల క్రితమే రాజ్యసభ సెక్రటేరియట్‌కు అందజేశామని జైట్లీ చెప్పారు. ఈ పరోక్ష పన్ను సంస్కరణ బిల్లు గత ఏడాది ఆగస్టు నుంచి రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది.కాంగ్రెస్ డిమాండ్లు-సవరణలు
కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఈ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటుండటంతో ప్రభుత్వం దిగివచ్చి ఆ పార్టీ డిమాండ్లకు దాదాపు అంగీకరించి సవరణలు చేపట్టింది. కాంగ్రెస్ చేసిన డిమాండ్లలో ఒకటైన ఒక శాతం అదనపు తయారీ పన్నును తొలగించింది. సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో జీఎస్టీ వివాదాల పరిష్కారానికి కమిటీని నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. దీనికి జీఎస్టీ కౌన్సిల్ వివాదాల పరిష్కార వ్యవస్థను నియమిస్తుందని ప్రభుత్వం సవరణను ప్రతిపాదించింది. అలాగే రాజ్యాంగంలో జీఎస్టీ రేటుపై పరిమితి విధించాలన్న మరో డిమాండ్‌కు మాత్రం ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సవరణను చూపలేదు.
ఆమోదంపై ప్రభుత్వం ధీమా..
బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం అన్ని ముఖ్య పార్టీలతో వరుస భేటీలు నిర్వహిస్తూ ముమ్మర కసరత్తు చేసింది. ఏకాభిప్రాయ సాధనకు అటు ఆర్థిక మంత్రి జైట్లీ, ప్రధాని మోదీ కూడా విపక్ష నాయకులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో బిల్లుకు కాంగ్రెస్ సహా ఇతర ముఖ్య రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలుపుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ బీజేపీ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ వ్యూహం.. జీఎస్టీ సవరణల ప్రతులను పంపిణీ చేసిన తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నేతలతో పార్లమెంటు హౌస్‌లో సమావేశమయ్యారు. బుధవారం రాజ్యసభలో ఎలా వ్యవహరించాలో అవసరమైన వ్యూహంపై చర్చించారు. అయితే, తాము బుధవారం సభలో తమ వ్యూహం ఎలా ఉంటుందో చెప్పడానికి సీపీఎం నిరాకరించింది. దీనికి మద్దతిస్తారా అన్న ప్రశ్నకు సభలో ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బదులిచ్చారు.
జీఎస్టీ గురించి మరికొన్ని...
* ఈ రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు-2014 రాజ్యసభ ఆమోదం పొందితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్/సేల్స్ ట్యాక్స్ లాంటి అన్ని పరోక్ష పన్నులు దేశవ్యాప్తంగా ఏకీకృతమవుతాయి.
* రాజ్యాంగ సవరణ చేపట్టాలంటే సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాలి. ఆ తర్వాత ఈ సవరణను దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి.
* గత ఏడాది మేలో లోక్‌సభ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సవరణలను ప్రతిపాదించింది.
* వాస్తవంగా జీఎస్టీని కాంగ్రెస్ 2006లో తీసుకొచ్చింది. రాజ్యాంగ సవరణ బిల్లును 2011 మార్చిలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే 15వ లోక్‌సభ రద్దవడంతో ఈ బిల్లు వీగిపోయింది.
ఒకే పన్ను.. ఒక్కసారే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టం భారతదేశంలోని పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైంది. ప్రస్తుత పన్ను విధానాల్ని సరళీకరించి దేశమంతా ఏకీకృత పన్ను ఉండేలా దీన్ని రూపొందించారు. సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, వినోదపు పన్ను, అమ్మకపు పన్నుల స్థానంలో వస్తు సేవల పన్ను వసూలు చేస్తారు. విద్యుత్తు, ఆల్కహాల్, పెట్రోలియం వంటి కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుంది.
జీఎస్టీ ఎందుకు?: మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు బిల్లు గమనిస్తే ఎమ్మార్పీ ధరతో పాటు వ్యాట్, ఇతర పన్నుల కింద భారీగా వసూలును చూడొచ్చు.
ఎమ్మార్పీలోనే ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేసేస్తున్నారు. పరోక్ష పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వసూలు చేయడంతో చిక్కులతో పాటు కొన్నిసార్లు ఒకే పన్ను రెండు సార్లు కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం వినియోగదారుడు వస్తువు ధరలో 25 నుంచి 30 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాడు. ఈ భారాన్ని ముందుగానే గ్రహించిన కేంద్రం 1994లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై ఆలోచన చేసింది. అమలుకు అనేక అడ్డంకులుండడంతో మొదటిగా 1994లో సేవల పన్ను అమల్లోకి తెచ్చింది. 1, ఏప్రిల్ 2005లో వ్యాట్‌ను అమలు చేశారు.
ఇవన్నీ గుదిబండగా మారడంతో జీఎస్టీ అమలు వాదన 2010లో విస్తృతమైంది. చివరకు డిసెంబర్ 19, 2014న జీఎస్టీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మే 6, 2015 లోక్‌సభ బిల్లును ఆమోదించింది. మే 12, 2015న సెలక్ట్ కమిటీకి పంపగా... జూలై 22, 2015న కమిటీ నివేదిక ఇచ్చింది.
రాష్ట్రాల ఆందోళన: జీఎస్టీ అమలుతో ఆదాయం కోల్పోతామని కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వస్తువును ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే అవకాశముంది. ఇందుకోసం ఒక శాతం పన్నును ఉత్పత్తి రాష్ట్రం కోసం వసూలు చేయాలని భావించినా.. సవరణ బిల్లు నుంచి దాన్ని తొలగించారు. నష్టాల్ని భర్తీ చేస్తామన్న కేంద్రం హామీతో ఒకట్రెండు మినహా అన్ని రాష్ట్రాలూ మద్దతిచ్చాయి. మొదటి ఏడాది 100 శాతం, రెండో ఏడాది 75 శాతం, మూడో ఏడాది 50 శాతం నష్టాల్ని భర్తీ చేస్తామని కేంద్రం హామీనిచ్చింది.
లాభమా? నష్టమా?
జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల భారం తగ్గి వ స్తువు ధర తగ్గుతుంది. సేల్స్ ట్యాక్స్ ఉండకపోవడంతో ప్రతి రాష్ట్రంలో పన్ను చెల్లించక్కర్లేదు. ఇకపై పన్నుపై పన్ను ఉండదు. పన్నులు తగ్గి కంపెనీల ఏర్పాటు పెరగవచ్చు. ద్రవ్యోల్బణం దిగొస్తుందని, పన్ను ఎగవేతలు తగ్గుతాయని నిపుణులంటున్నారు. రవాణా వ్యయాలు, పేపర్ పని తగ్గి వ్యాపార వాణిజ్యాలు సమర్థంగా జరుగుతాయి. జీడీపీ 2% పెరుగుతుందని అంచనా.
బిల్లు ఆమోదం లాంఛనమే!
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో మూడింట రెండొంతుల మద్దతు కావాలి. అంటే ఓటింగ్‌లో 163 మంది అనుకూలంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బిల్లు గట్టెక్కేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 131 మంది సభ్యులు సానుకూలంగా ఉండగా, కాంగ్రెస్ (60) మద్దతిస్తే ఇక అడ్డే ఉండదు. కాంగ్రెస్ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందున ఆ పార్టీ మద్దతిచ్చే అవకాశముంది. లోక్‌సభలో జీఎస్టీ బిల్లును వ్యతిరేకించిన అన్నాడీఎంకే (13) ఇప్పుడు తన వైఖరిని మార్చుకునే అవకాశముంది. ఎన్సీపీ(5), డీఎంకే (4)లు మాత్రం బిల్లుపై వ్యతిరేకంగా ఉన్నాయి. సీపీఎం (8) తన వైఖరిని స్పష్టంచేయలేదు. వీరుకాకుండా ఇతర పార్టీలు (22) కూడా బిల్లుకు మద్దతిచ్చే అవకాశముంది.