తీరు మారని చైనా
నిద్రపోతున్నప్పుడు అందరి మొహాలూ ఒకేలా ఉంటాయి. మేల్కొన్న సమయంలోనే ఎవరేమిటో తెలుస్తుందంటారు. దేశాల అధినేతలు కలిసినపుడు చిరునవ్వులు చిందించుకోవడం... ఎంతకూ వదలకుండా కరచాలనాలు చేసుకోవడం... అవతలివారిని పొగడ్తలతో ముంచెత్తడం... గంభీరమైన అంశాలతో సంయుక్త ప్రకటనలు విడుదలచేయడం దౌత్యంలో సర్వసాధారణం. సంక్షోభం తలెత్తినప్పుడో, అంతర్జాతీయ వేదికలపై తీర్మానాలు వచ్చినప్పుడో అసలు రంగు తేలిపోతుంది. ఉగ్రవాద నేత, లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాకిస్థాన్ వైఖరిని అభిశంసించే తీర్మానానికి చైనా రెండురోజులక్రితం అడ్డం తిరిగి తన అసలు నైజాన్ని చాటుకుంది.
ఆ తీర్మానం ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీలో చర్చకొచ్చిన వెంటనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి చైనా దాన్ని వ్యతిరేకించింది. భద్రతామండలిలోని 15 సభ్యదేశాలకూ సభ్యత్వం ఉండే ఈ కమిటీ...భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించి ఉంటే పాక్ అభిశంసనకు గురయ్యేది. కానీ ఈ ప్రతిపాదనతోపాటు లఖ్వీకి సంబంధించిన సరైన సాక్ష్యాలు భారత్ అందజేయలేదన్నది చైనా ప్రధాన అభ్యంతరం. చైనా అంటున్న ఈ మాటలు ఇంతక్రితం మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో కాదు...అవి పాకిస్థాన్ తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి తరచుగా అనే మాటలే. ఇప్పుడు ఆ మాటలే చైనా నోటివెంబడి వచ్చాయంటే ఆ రెండింటిమధ్యా ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు.
మన దేశంలో గత కొన్నేళ్లుగా అనేకచోట్ల ఉగ్రవాద దాడులు జరిగాయి. పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటిలోనూ 2008లో ముంబై నగరంపై మారణాయుధాలతో చేసిన దాడి అతి పెద్దది. ఆ ఘటనలో ఉగ్రవాదులు 160మందిని పొట్టనబెట్టుకున్నారు. మన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతోపాటు వారిలో ఒకడైన కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. అతన్ని విచారించి ఎన్నో విషయాలు రాబట్టారు. ఉగ్రవాద చర్యల్లో తాము శిక్షణ పొందింది పాకిస్థాన్ గడ్డపైనే అని అతను చెప్పాడు. లష్కరే తోయిబా పంపగా తాము ముంబైకి వచ్చామని వివరించాడు. ఈ క్రమంలో జకీవుర్ రెహ్మాన్, హఫీజ్ సయీద్ తదితరుల పేర్లను వెల్లడించాడు. అతని వాంగ్మూలంలో చెప్పిన అంశాలన్నిటితో సవివరమైన నివేదిక రూపొందించి మన దేశం పాకిస్థాన్‌కు అందజేసింది. అందులోని సాక్ష్యాధారాల ఆధారంగా అతన్ని అప్పగించాలని కోరింది. ఉగ్రవాదం ఏ దేశానికైనా శత్రువే గనుక పాక్ సరిగా స్పందించి ఆ సాక్ష్యాల ఆధారంగా చర్య తీసుకుని ఉంటే వేరుగా ఉండేది. కానీ, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఆర్మీల ప్రాపకంతోనే ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోతున్నాయి గనుక ‘తగిన’ సాక్ష్యాధారాలు లేవన్న సాకుతో అది తప్పించుకుంటున్నది. లఖ్వీని అప్పగించాలంటే మరింత విస్పష్టమైన సాక్ష్యాధారాలు అవసరం అంటున్నది.
ఐక్యరాజ్యసమితిలో ఏ దేశంపైన అయినా చర్య తీసుకోవడం ప్రయాసతో కూడుకున్నది. భద్రతామండలిలోని మిగిలిన పది దేశాల మాటా ఎలా ఉన్నా...అయిదు శాశ్వత సభ్య దేశాలూ సరేనంటే తప్ప ఏదీ అమల్లోకి రాదు. ఏప్రిల్ 10న పాక్‌లో బెయిల్‌పై విడుదలైన లఖ్వీ విషయంలోనూ ఇదే జరిగింది. మరికొందరితోపాటు లఖ్వీని కూడా ఉగ్రవాదిగా గుర్తిస్తూ 2008 చివరిలో ఆంక్షల కమిటీ నంబర్-1267 తీర్మానాన్ని ఆమోదించింది. ఉగ్రవాదుల ఆస్తుల్ని, వారి సంస్థలకు చెందిన ఆస్తుల్ని స్తంభింపజేయాలని ఆ తీర్మానం ఆదేశించింది.
అలాంటపుడు లఖ్వీ బెయిల్‌కు అవసరమైన మొత్తాన్ని లేదా పూచీకత్తును ఇచ్చినవారెవరో విచారణ జరిపించాలని భారత్ ప్రతిపాదన కోరుతున్నది. ఇప్పుడు చైనా సాంకేతిక కారణం చూపి ఆపేసింది ఆ తీర్మానాన్నే. ఇలా చేయడం చైనాకు ఇది మొదటిసారి కాదు. ఇంతక్రితం కూడా పాకిస్థాన్ విషయంలో ఇలాగే వ్యవహరించింది. లఖ్వీ తదితరుల్ని ఉగ్రవాదులుగా గుర్తించే అమెరికా తీర్మానంపై కూడా 2008లో అది పేచీ పెట్టింది. అందులో ఉన్న ఐఎస్ఐ ప్రస్తుత, రిటైర్డ్ అధికారులు నలుగుర్ని జాబితానుంచి తీసివేస్తే తప్ప అంగీకరించబోనని చైనా హఠాయించింది. శాశ్వత సభ్యదేశం వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది కనుక చేసేది లేక అమెరికా అందుకు అంగీకరించింది.
ఇంతకూ పాకిస్థాన్‌పై ఇలా అవధుల్లేని ప్రేమను ప్రదర్శించడంలో చైనాకున్న ప్రయోజనాలేమిటి? భారత్-పాక్‌లకు సంబంధించిన సరిహద్దు వివాదంలోనో, ఇరు దేశాలమధ్యా ఉండే మరో వివాదంలోనో ఇలాంటి వైఖరి తీసుకుంటే చైనాను అర్ధం చేసుకోవచ్చు. ఇది ఉగ్రవాదానికి సంబంధించిన సమస్య. నెల్లాళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటించినప్పుడు విడుదలైన సంయుక్త ప్రకటన ‘ఇరుదేశాలూ ఉగ్రవాదంపై దృఢంగా పోరాడతాయ’ని చెప్పింది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌నూ, వారికి నిధులందే మార్గాన్నీ, సరిహద్దులు దాటి సాగుతున్న వారి సంచారాన్నీ అన్ని దేశాలూ చిత్తశుద్ధితో అడ్డుకోవాలని కోరింది. ఇరు దేశాల అధినేతలూ విడుదల చేసిన ఈ సంయుక్త ప్రకటన స్ఫూర్తి ఎటు పోయింది? ఆచరణకొచ్చేసరికి ఉగ్రవాది లఖ్వీ విషయంలో చైనా పాక్ పాటే ఎందుకు పాడింది? ఇవి తేలాల్సిన అంశాలు. నిజానికి చైనా వ్యవహారశైలి గురించి తన పర్యటనలో మోదీ నేరుగా ఆ దేశాధినేతల దృష్టికి తీసుకెళ్లారని వార్తలొచ్చాయి. అలా చేసినా మళ్లీ అదే పునారావృతమైందని తాజా ఉదంతం తెలియజెబుతోంది.
ఆంక్షల కమిటీలో ఆయా దేశాల తరఫున జూనియర్ అధికారులే ఉంటారని, వారికి చైనా ఉన్నత స్థాయి నాయకత్వంనుంచి ఆదేశాలు అందడంలో జాప్యం జరిగి ఉండొచ్చునని మన దేశం సరిపెట్టుకుంటున్నది. చైనాతో మరోసారి ప్రస్తావించి లోపాన్ని సరిచేస్తామని చెబుతున్నది. నిరాశ దరి చేరనీయకపోవడం మంచిదేగానీ ఇరుదేశాల సంబంధాలూ మరింత మెరుగుపడాలంటే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ వైఖరిని వ్యతిరేకించాలని చైనాకు నిర్మొహమాటంగా చెప్పాల్సిన అవసరం ఉంది. భారత్ తీర్మానాన్ని అడ్డుకోవడంద్వారా పాక్‌ను మంచి చేసుకుంటే... తమ దేశంలో మైనారిటీలు అధికంగా ఉండే గ్జిన్జియాంగ్ రాష్ట్రంలో అడపా దడపా సాగే ఉగ్రవాద ఘటనలను అరికట్టడంలో అది తోడ్పడగలదని చైనా భావిస్తూ ఉండొచ్చు. ఉగ్రవాదానికి ఏరూపంలో తోడ్పడినా అది పాముకు పాలుపోసినట్టేనని ఆ దేశం తెలుసుకోవాలి. తన చర్యలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో తెలుసుకోవాలి. మాటలకూ, చేతలకూ పొంతన లేకపోతే తనకు ఎవరూ సన్నిహితులు కాలేరని గుర్తించాలి.