బాధిత రైతులను ఆదుకోవాలి
దోషులను కఠినంగా శిక్షించాలి
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు
జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్
రాపాక (సీతానగరం) :
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. రఘుదేవపురం పంచాయతీ రాపాక, నల్లగొండ రోడ్డులో 35 మంది రైతులకు చెందిన 39 వరి కుప్పలు శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో దగ్ధమైన విషయం విదితమే. సమాచారం అందుకున్న జక్కంపూడి విజయలక్ష్మి అర్ధరాత్రి 12 గంటలకు సంఘటన స్థలానికి తరలివచ్చారు. బాధిత రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. రైతులకు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ వరి కుప్పలకు నిప్పు పెట్టిన దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నష్టపోయింది అందరూ కౌలు రైతులేనన్నారు. వీరికి పంట బీమా పథకం వర్తింపజేయాలని కోరారు. రైతులకు న్యాయం చేయకుంటే పార్టీ తరఫున ఉద్యమిస్తామని జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గెద్దాడ త్రిమూర్తులు ఉన్నారు.