Jal Palli
-
అధికారులూ.. సిగ్గు సిగ్గు
పహాడీషరీఫ్: హోలీ పండుగ వచ్చిందంటే పార్దీ కులస్థుల్లో (నక్కల పిట్టలోల్లు) ఏ ఒక్కరిని కదిలించినా జల్పల్లి గ్రామం పేరే చెబుతారు. తమ పూర్వీకులు మొత్తం జల్పల్లిలోని పిట్టలగూడెంలో ఉండి తదనంతరం నగరంతో పాటు ఇతర జిల్లాలలో పార్దీవాడలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. హోలీ సమయంలో ఏ స్థాయిలో స్థిరపడిన వారైనా జల్పల్లిలోని పిట్టల గూడెంకు వచ్చి మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇలా వచ్చిన ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో జల్పల్లి మున్సిపాలిటీ అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. విఫలమవ్వడం కాదు.. కావాలనే తమ పట్ల వివక్ష చూపారని పార్దీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీటిను కూడా సమకూర్చకపోవడంతో సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశామని వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలకు స్నానాలు చేసేందుకు నీరు లేకపోవడంతో మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలోని మూత్రశాలలో కొంత మంది స్నానాలు చేశారు. ఇది కూడా నచ్చని మున్సిపాలిటీ అధికారులు ఏకంగా వారు రాకుండా కార్యాలయ గేట్‌కు తాళం వేశారు. ఒకవైపు మున్సిపాలిటీ పరిధిలోని తమకు నచ్చిన వారి ఇళ్లల్లోకి ఏకంగా నీటి ట్యాంకర్లను పంపిస్తున్న అధికారులు ఏడాదికోసారి ఉత్సవం కోసం వచ్చిన వారికి నీరు ఇవ్వకపోవడం ఏమిటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని కారణంగా యువతులు, మహిళలు జల్పల్లి, ఉందాసాగర్ చెరువుల వద్ద స్నానాలు చేయాల్సిన పరిస్థితి. కావాలనే మాపై వివక్ష చూపిస్తున్నారు.. పహాడీషరీఫ్‌లో వచ్చే నెలలో నిర్వహించనున్న ఇజ్తెమా (ఇస్లామిక్ సమ్మేళనం)కు దేశం నలుమూలల నుంచి ముస్లింలు రావడాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తోందనీ కానీ చిన్న పాటి ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చే తమకు మాత్రం నీరు, విద్యుత్ సదుపాయాలు కూడా ఎందుకు కల్పించడం లేదని నక్కల పిట్టల్లోల సంఘం నాయకులు విజయ్ కుమార్, చిట్టిబాబు, రవి, రమేశ్ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆడ పడుచులు స్నానం చేసేందుకు వస్తే మున్సిపాలిటీ గేట్‌కు తాళం వేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు
10,400 లీటర్ల నూనె స్వాధీనం హైదరాబాద్: పాతనగరం అడ్డాగా కల్తీ నూనెల తయారీపై సెప్టెంబరు 18న ‘సాక్షి’ దినపత్రికలో ‘కల్తీ రాజ్యం!’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఎట్టకేలకు ఎస్ఓటీ పోలీసులు స్పందించారు. సోమవారం జల్పల్లి గ్రామ శివారులో పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న ఓ కేంద్రంపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. దుర్గంధపూరిత జంతుకళేబరాల నుంచి ఇక్కడ నూనె తీసి... నగరంలోని కొన్ని పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు శంషాబాద్ ఎస్వోటీ ఎస్ఐ లాల్ మజ్హర్ తెలిపారు. ప్రహారీ ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని అద్దెకు తీసుకున్న సలీం, అఫ్రోజ్‌లు... ఈ దందా సాగిస్తున్నారు. పశు వధశాలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సేకరించిన కొవ్వును వీరు భారీ కడారుులలో ఉడికించి నూనె తయారు చేస్తున్నారు. దీన్ని 200 లీటర్ల సామర్థ్యంగల డ్రమ్ముల్లో నింపి నగరంలోని పలు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. తయారీ కేంద్రంలో పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు రాయల్ కాలనీలో ఉండే బర్మా శరణార్థులు. 52 డ్రమ్ముల్లోని 10,400 లీటర్ల నూనె, 8 టన్నుల కొవ్వు, డీసీఎం వ్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. కల్తీ నూనె తయారీలో ఇప్పటికే రెండు సార్లు అరెస్టయిన నిర్వాహకులు ఎప్పటికప్పుడు తమ అడ్డా మార్చుకుంటూ దందా కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. -
నీటి కోసం జల్పల్లి వాసుల నిరసన
జల్పల్లిలో తీవ్రమైన మంచినీటి ఎద్దడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం షాహిన్‌నగర్ వద్ద శ్రీశైలం రహదారిపై రాస్తారోకోకు దిగారు. మంచినీటి సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల తీగల కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహ్మద్ సాబెర్ అలీకి తమ ఇబ్బందులను విన్నవించినా స్పందన కరువైందని ఆరోపించారు. పోలీసులు నచ్చజెప్పినా వారు వినలేదు. ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెంకటాపూర్ మీదుగా వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. నిరసన ఇంకా కొనసాగుతోంది.