సందెపొద్దు అందాలున్న చిన్నదీ
అతను కొంత ప్రకృతిలో కలం ముంచాడు. అతను కొంత పలుకుబడిలో పాళీని అద్దాడు. అతను కొంత సంస్కృతిని మన్నులా అందుకుని నుదుటికి పూసుకున్నాడు. అతను కొంత ఈ నేల పాడే పాటను తానూ పాడాడు. ఆ పాటలో బైరాగి తత్త్వం ఉంది. ఆ పాటలో జానపదుల శృంగారం ఉంది. ఆ పాటను అందరూ ‘జాలాది’ అన్నారు. ప్రేక్షకులు అతన్ని తమ మదిలో ఉంచుకున్నారు.
సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి మీద తానాలాడుతు ఉన్నదీ...
జాలాది రాజారావు అనే పూర్తి పేరుగల జాలాది రెగ్యులర్ సినీకవి కాదనిపిస్తుంది. ఆయన కవి సమయాలు ప్రత్యేకం అనిపిస్తుంది. ఆయన రాయవలసిన పాటల సందర్భాలు ఉన్నప్పుడే ఆయన కలానికి ఆహ్వానం దక్కుతుందని అనిపిస్తుంది. ఆయన రాసిన తొలి సినిమా ‘పల్లె సీమ’. దర్శకుడు పి.సి.రెడ్డి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మద్రాసు గదిలో వాన కురిసిన ఒక రాత్రి చూరు నుంచి కారే చప్పుళ్లను విని రాసిన పాటే జాలాదికి తొలి సినిమా పాట అయ్యింది.
సూరట్టుకు జారతాంది
సితుక్కు సితుక్కు వానసుక్క...
గుడివాడలో పుట్టి హైస్కూల్ వయసులోనే స్వాతంత్య్ర పోరాటంలో కొరియర్‌గా పని చేసి ఆ తర్వాత డ్రాయింగ్ టీచర్‌గా మారి సమాజాన్ని మార్చాలంటే కలం అందుకోక తప్పదు అని కలం అందుకున్న కవి జాలాది. నటుడు కైకాల సత్యనారాయణ, సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్.స్వామి వీరంతా ఆయన స్నేహితులు. అక్కినేని అన్న కుమారుడైన అక్కినేని వెంకటరత్నం క్లోజ్ ఫ్రెండ్. వీరే నాటకాలు రాస్తున్న జాలాదిని నాడు మద్రాసు అనబడే నేటి చెన్నైకి పిలిపించారు. తొలిపాట ‘పల్లెసీమ’లో హిట్ అయితే మలిపాట ‘చల్ మోహనరంగ’లో సూపర్‌హిట్ అయ్యింది. కృష్ణ నటించిన ఈ పాట రేడియో సిలోన్లో అత్యధికులు కోరిన ఆ పాటగా, ఆల్ ఇండియా రేడియోలో మళ్లీ మళ్లీ మోగిన పాటగా అందరికీ గుర్తు.
ఘల్లుఘల్లున కాలి గజ్జెలందియ మోగ
కలహంస నడకాల కలికి
అయితే ప్రతి సినీ కవి వెలిగే సమయం ఒకటి వస్తుంది. జాలాదికి కూడా వచ్చింది. జాలాదిని ‘సినిమా వేమన’ను చేసిన పాట ఒకటి ఉంది. ఆ పాట ఆయనకు శాశ్వత కీర్తి సంపాదించి పెట్టింది. భారతీయ తత్వాన్ని ఇంత సులువైన పదాల్లో చెప్పడం జాలాదికి మాత్రమే సాధ్యం అని రుజువు చేసింది. ‘ప్రాణం ఖరీదు’లో ఆయన రాసిన ఆ పాటలో ‘పలుపుతాడు మెడకేస్తే పాడె ఆవురా... పసుపుతాడు ముడులేస్తే ఆడదాఝెరా’ అన్నాడు. ‘అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే... చీము నెత్తురులు పారే తూము ఒక్కటే’ అని జన్మసమానత్వం చెప్పడానికి ఆయన ఉయోగించిన శ్లేషకు ఇప్పటి వరకూ సరి సమాన పాట లేదు. గుర్తుకొచ్చిందా పల్లవి? తప్ప ఎవరు రాయగలరు?
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
జాలాది ఎన్నో క్లాసిక్స్ రాశారు. కాని వాటికి ఆ సమయాన రావలసిన అవార్డులు రాలేదు. ప్రేక్షకుల రివార్డులు తప్ప. జాలాదికి పనిని వెతుక్కుంటూ వెళ్లడం తెలియదు. పని తనను వెతుక్కుంటూ వస్తేనే పని చేశారు. సగటు సినిమా రాజకీయాలు ఆయనకు తెలియవు. ముక్కుపట్టుకుంటే తుర్రుమనే ఈ ప్రాణం కోసం పెనుగులాట ఎందుకు అనేది ఆయన భావన. అదే తత్వాన్ని ‘ఎర్రమందారం’లో పాటగా రాసి నంది అవార్డు పొందారు. ‘కన్ను తెరిస్తే ఉయ్యాలా... కన్ను మూస్తే మొయ్యాలా’ అని రెండు ముక్కల్లో జీవిత పరమార్థాన్ని తేల్చాడాయన.
యాలో యాల ఉయ్యాల..
ఏడేడు జన్మాల మొయ్యాల...
జాలాది మోహన్‌బాబు సినిమాలకు ఎక్కువ పాటలు రాశారు. ‘అల్లుడుగారు’, ‘చిట్టెమ్మ మొగుడు’, ‘మేజర్ చంద్రకాంత్’... ఈ సినిమాలలో మోహన్‌బాబు ఆయనచే పాటలు రాయించారు. ‘మేజర్ చంద్రకాంత్’ కోసం జాలాది రాసిన దేశభక్తి గీతం తెలుగువారి శాశ్వత దేశభక్తి గీతంగా మారి ఆగస్టు పదిహేనున వాడవాడన మారుమోగే పాట అయ్యింది.
పుణ్యభూమి నా దేశం నమో నమామి
ధన్యభూమి నా దేశం సదా స్మరామి
జాలాది తన మూడు దశాబ్దాల కెరీర్లో దాదాపు వెయ్యికి పైగా పాటలు రాశారు. చైతన్యవంతమైన గీతాలతో పాటు కమర్షియల్ గీతాలు కూడా రాశారు. ప్రయివేటు ఆల్బమ్స్ కోసం క్రీస్తు గీతాలు అనేకం రాసిన జాలాది ‘కుంతీపుత్రుడి’ కోసం ఈ పాట రాసి సాయి భక్తులకు కానుకగా ఇచ్చారు.
లేలే బాబా నిదుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా...
జాలాది 2011లో మరణించారు. కాని ఆయనకూ ఆయన కుటుంబానికీ ‘పుణ్యభూమి నా దేశం’ పాటకు తగిన అవార్డులు రాలేదన్న చిన్న అసంతృప్తి ఉంది. సినిమా పరిశ్రమలో ఆయన గౌరవాన్ని పొందారు. అదేచోట వివక్షను కూడా చవి చూశానని చెప్పుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆయనకు ‘కళాప్రపూర్ణ’ ఇచ్చింది. ప్రేక్షకులు మాత్రం పూమాలలతో ఆయనను హత్తుకుంటూనే వచ్చారు. రేడియో పెడితే రోజూ ఆయన పాట వినిపిస్తుంది. బతుకు బండి నడవడానికి ఆయన పాట ఒక తోడు.
బండెళ్లిపోతోంది చెల్లలా...
బతుకు బండెళ్లిపోతోంది చెల్లెలా... – సాక్షి ఫ్యామిలీ