వైఎస్ హయాంలో రైతే రాజు
రైతును రాజుగా చూడాలనుకున్నారు రాజన్న. జలయజ్ఞం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించి అన్నదాత కళ్లల్లో ఆనందం నింపాలనుకున్నారు. అందుకే సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. రూ.కోట్ల నిధులు వెచ్చించి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో ప్రగతి పరవళ్లు తొక్కింది. రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.
హంద్రీ–నీవా వైఎస్ చలువే..
సాక్షి, బి.కొత్తకోట: హంద్రీ–నీవా సాగు, తాగునీటి ప్రాజెక్టుల ఘనత పూర్తిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే చెల్లుతుంది. ఈ ప్రాజెక్టును 2013 డిసెంబర్‌నాటికే పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించాలని ఆయన నిర్ణయించారు. ఆయన చిత్తశుద్ధితోనే ఈఏడాది జనవరి 22న జిల్లాలోకి కృష్ణాజలాలు ప్రవేశించాయి. కాలువ పనులు పూర్తి చేసి, ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టి, రైతులకు పరిహారం అందించారు. ఏటా బడ్జెట్లో కేటాయించిన దానికంటే మించిన పనులు చేయించిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది. వైఎస్‌ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాజెక్టుపనుల కోసం అవసరమైన నిధులిచ్చారు. పథకం ప్రారంభ ఏడాది 2005–06 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో రూ.46.50కోట్లు కేటాయిస్తే..రూ.183.15కోట్ల పనులు జరిగాయి.
2006–07లో రూ.253కోట్ల కేటాయిస్తే రూ.415.45కోట్ల పనులు జరిగాయి. 2007–08లో అత్యధికంగా రూ.1,165కోట్లు కేటాయించారు. కాంట్రాక్టర్లు యుద్ధప్రాతిపదికన రూ.1,148.04కోట్ల పనులు పూర్తిచేయగలిగారు. 2009–10లో రూ.999కోట్ల కేటాయిస్తే రూ.1,364.73కోట్ల పనులు జరగడం ప్రాజెక్టు చరిత్రలో రికార్డు. వైఎస్ హయాంలో మొత్తం రూ.3,388.5కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తే రూ.4,295.1కోట్ల పనులు జరిగాయి. పనులు చేసే కాంట్రాక్టర్లకు అప్పట్లో ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉండేది. బిల్లులతో పనిలేకుండా పనులు చేశారు. ప్రధానంగా రైతులు..ప్రాజెక్టు కాలువల తవ్వకం కోసం ప్రభుత్వం పైసా పరిహారం చెల్లించకపోయినా అడ్డు చెప్పలేదు. స్వచ్ఛందంగా భూములు అప్పగించారు.
(చదవండి : జనం గుండె చప్పుళ్లలో రాజన్న జ్ఞాపకం)
తమకు పరిహారం మాటేలా ఉన్నా కాలువలు సత్వరమే పూర్తి కావాలన్న కాంక్ష రైతుల్లో కనిపించింది. గత జనవరి 22న జిల్లాలోకి కృష్ణా జలాలు తరలివచ్చాయి. ఈ జలాలు ప్రవహించింది వైఎస్ తవ్వించిన కాలువలోనే. అది తమ ఘనత అని టీడీపీ సంబరాలు చేసుకుంది. కాలువకు నీరు రప్పించామని అర్భాటంగా ప్రచారం చేసుకున్నారే కాని కాలువలు తవ్వించింది తామేనని చెప్పుకోలేకపోయారు.
గాలేరు– నగరికి శ్రీకారం
పుత్తూరు రూరల్ : కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల సాగునీరు, ప్రజల దాహార్తి తీర్చడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞంలో భాగంగా 2006 జూన్4న నగరి పట్టణంలో ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. కడపజిల్లాలో 1,55,000 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,03,500 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 1,500 ఎకరాలు అంటే మొత్తం 2,60,000 ఎకరాలకు సాగునీరు అందేలా మహానేత ఈ పథకానికి రూపకల్పన చేసారు. ఈ పథకం పూర్తయితే 20 లక్షల మందికి తాగునీరు అందడమే కాక 3.03 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతాయని అంచనా వేసారు. ప్రారంభంలో ఈ పథకం విలువ రూ. 4,620 కోట్లుగా అంచనా వేశారు.
38 శతకోటి ఘనపుటడుగుల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు జలాశయానికి తరలించి గాలేరు నగరి ప్రత్యేక వరద కాలువ ద్వారా క్షామపీడిత ప్రాంతాలకు తరలిస్తారు. 254వ కి.మీ. వద్ద చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. తదుపరి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్, పద్మసాగర్, శ్రీనివాససాగర్, వేణుగోపాల సాగర్ అక్కడి నుంచి పుత్తూరు మండలం వేపగుంట రిజర్వాయరుకు, అక్కడి నుంచి నగరి రూరల్ మండలంలోని అడవికొత్తూరులో నిర్మించే రిజర్వాయర్‌కు చేరుకుంటుంది. రైతు సంక్షేమం కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేట్టిన జలయజ్ఞం పనులు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించి దశాబ్దం పూర్తయినా కృష్ణాజలాలు నగరికి చేరలేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టును అటకెక్కించాయి.
అటకెక్కిన మహానేత ఆశయం
అడవికొత్తూరు శివారుల్లో గాలేరు–నగరి సుజల స్రవంతిలో భాగంగా 0.8 టీఎంసీల నీరు నిల్వచేయడానికి వీలుగా రిజర్వాయరు నిర్మాణం ప్రారంభించారు. పుత్తూరు నుంచి నగరికి వచ్చే గాలేరు నగరి కాలువ, రిజర్వాయరు నిర్మాణాలకు సుమారు రూ.120 కోట్ల మేర పనులు జరిగాయి. ప్రాజెక్టు పనుల్లో 60 శాతం మేర పూర్తి కాగా కరకట్ట పనులు, కాలువల తవ్వకాలు, కాలువల లైనింగ్ పనులు ఆగిపోయాయి. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గాలేరు నగరి ప్రాజెక్టు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. నీటిని నిల్వచేయడానికి దిట్టంగా మార్చిన నేలలు బీటలు వాలిపోతున్నాయి. మహానేత కలలు సాకారమై ప్రాజెక్టుకు నీరు చేరివుంటే నగరి, విజయపురం, నిండ్ర మండలాల్లోని పదివేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు పుష్కలంగా అందేది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తారని రైతులు, ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
సాగునీటికి కొరత లేకుండా....
సదుం:వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పాపిరెడ్డిగారిపల్లె మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. గార్గేయనదిపై పాపిరెడ్డిగారిపల్లె ప్రాజెక్టు నిర్మాణ పనులు 2004లో ప్రారంభమయ్యాయి. రూ. 8.5 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తయింది. 138. 15 ఎంసీఎఫ్‌టీల వరద నీటిని ఇందులో నిల్వ చేయవచ్చు. ఈ నీటిని పీలేరుకు తరలించేలా చేపట్టిన పంపింగ్‌హౌస్‌పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న రెడ్డివారిపల్లె, తాటిగుంటపాళెం, కంభంవారిపల్లె పంచాయతీల పరిధిలోని ç నీటి మట్టం పెరగడంతో పంటలసాగుకు నీటి కొరత లేకుండా పోయింది.
’వైఎస్ హయాంలో పనుల వివరాలు
ఆర్థిక కేటాయింపు కోట్లలో జరిగిన పని కోట్లలో
2005–06 రూ.46.50 రూ.183.15
2006–07 రూ.253 రూ.415.45
2007–08 రూ.925 రూ.1,148.04
2008–09 రూ.1,165 రూ.1,364.73
2009–10 రూ.999 రూ.1,183.47