జలయజ్ఞంతో 19 లక్షల ఎకరాలకు సాగునీరు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జలయజ్ఞం పథకం ద్వారా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని, దీన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించి ఆ పథకంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు అన్నారు. ఆదివారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 2004లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 54 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు ప్రారంభించిందని, ఇందులో 14 పథకాలు పూర్తయ్యాయని, మరో 14 పూర్తిఅయ్యేదశలో ఉనాయని చెప్పారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలయజ్ఙాన్ని తప్పుపడుతూ ధనయజ్ఙంగా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. ై
రెతు సంక్షేమానికి ఎవరెంత కృషి చేశారో టీడీపీ ప్రభుత్వం సిద్ధం చేసిన అధికార కరపత్రమే నిదర్శనమని గెజెట్ ప్రతులను చూపారు. కాంగ్రెస్ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటుందని, చంద్రబాబులా కార్పొరేట్ సంస్థల క్షేమం కోరుకోదని చెప్పారు. బాబు పాలనలో జిల్లాలో 19 వేలమందికి పింఛన్లు అందడం లేదని, నిబంధనల పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మైనారిటీలకు రూ. 2,500 కోట్లతో సబ్‌ప్లాన్ రూపొందిస్తానని చెప్పిన చంద్రబాబు 370 కోట్ల బడ్జెట్‌తోనే సరిపెట్టారన్నారు.
ఇలా ప్రతి విషయంలో మోసం చేసేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడొద్దని, ప్రజల అభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు ఎం.పి.తిప్పన్న, టి.సలాం, వెంకటేశ్వరరెడ్డి, చున్నుమియ్య తదితరులు పాల్గొన్నారు.