కాంగ్రెస్ ను ఒత్తిడి చేయలేదు: ఒమర్ అబ్దుల్లా
పూంచ్: తమతో జత కట్టమని కాంగ్రెస్ ను బలవంతపెట్టలేదని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్య, బాధ్యతారహిత వ్యాఖ్యలతో తమను అవమానించారని వాపోయారు. పూంచ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..తమ ప్రభుత్వంలో చేరమని కాంగ్రెస్ ను ఒత్తిడి చేయలేదన్నారు. తనను ముఖ్యమంత్రిగా అంగీకరించమని కాంగ్రెస్ ను బతిమాలలేదని వెల్లడించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, సైపుద్దీన్ సోజ్ సహా అగ్రనాయకులు తమను అవమానించారని ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు తమలో ఏ తప్పు కాంగ్రెస్ కు కనబడలేదని, ఎన్నికలు రావడంతో తమపై విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ఆరేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకున్న తర్వాత ఆయన ఈ ఆరోపణలు చేయడం విశేషం.