11 రోజుల్లో 35 వేల బుల్లెట్లు కాల్చారు!
పాకిస్థాన్ వైపు నుంచి సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పులకు మన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) దీటుగా సమాధానం ఇస్తోంది. మనవైపు నుంచి కూడా అత్యంత భారీ స్థాయిలోనే కాల్పులు ఉంటున్నాయి. అక్టోబర్ 19వ తేదీ నుంచి పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉండటంతో దాదాపు ప్రతిరోజూ తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన కాల్పులలో దాదాపు 15 మంది సైనికులు, మరికొందరు పౌరులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.
గడిచిన 11 రోజుల్లో బీఎస్ఎఫ్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో 35 వేల బుల్లెట్లు కాల్చాయి. వీటిలో ఎంఎంజీలు, ఎల్ఎంజీలు, రైఫిళ్లు తదితరాలున్నాయి. ఇవి కాక.. 3000 దీర్ఘశ్రేణి మోర్టార్షెల్స్ను కాల్చాయి. ఇవి దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదిస్తాయి. అలాగే తక్కువ దూరం వెళ్లగల మోర్టార్ షెల్స్ 2వేలు కాల్చాయి. ఇవి 900 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. దీర్ఘశ్రేణి మోర్టార్ షెల్స్‌తో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేస్తారని, చిన్న ఆయుధాలతో పాటు తక్కువ దూరం వెళ్లే మోర్టార్ షెల్స్‌ను ఉగ్రవాదులు, పాక్ రేంజర్లను లక్ష్యం చేసుకోడానికి ఉపయోగిస్తారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
సరిహద్దులలో కాల్పులు ఎక్కువగా జమ్ము సెక్టార్లోనే జరిగాయి. ఇవి కూడా ప్రధానంగా రాత్రిపూటే ఎక్కువగా ఉంటున్నాయి. పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూ, ఆ సమయంలో ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్నారు. అటువైపు నుంచి జరిపిన కాల్పులలలో బీఎస్ఎఫ్ జవాన్లు ముగ్గురు అమరులయ్యారు. ఈ 11 రోజుల్లో పాకిస్థాన్ దాదాపు 60 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శీతాకాలం సమీపిస్తుండటంతో బీఎస్ఎఫ్ దళాలకు మరింత ఎక్కువగా ఆయుధ సామగ్రి సరఫరా చేస్తున్నారు.