నీరజ్ కోచ్‌గా జాన్ జెలెజ్నీ
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరు...ఇదే క్రీడాంశంలో సంచలన ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్స్ స్వర్ణం అందించిన ఆటగాడు మరొకరు...వీరిద్దరు ఇప్పుడు మరిన్ని రికార్డులను సృష్టించే లక్ష్యంతో జోడీగా మారారు. భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, 2 ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన కొత్త కోచ్‌గా చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెన్జీని కోచ్‌గా ఎంచుకున్నాడు.రాబోయే 2025 సీజన్‌కు ముందు జత కలిసిన నీరజ్, జెలెజ్నీ అద్భుతమైన ఫలితాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. 58 ఏళ్ల జెలెజ్నీ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం వరుసగా మూడు ఒలింపిక్స్ (1992, 1996, 2000)లలో స్వర్ణాలు గెలుచుకున్నాడు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతని పేరిటే జావెలిన్‌ను అతి ఎక్కువ దూరం విసిరిన వరల్డ్ రికార్డు (98.48 మీటర్లు) కూడా ఉంది.2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌కు ఇటీవలి వరకు జర్మనీకి చెందిన బయోమెకానిక్స్ ఎక్స్పర్ట్ క్లాస్ బార్టొనిట్జ్ కోచ్‌గా ఉన్నాడు. ‘చిన్నప్పటినుంచి నేను జెలెజ్నీకి వీరాభిమానిని. ఆయన టెక్నిక్ అంటే ఎంతో ఇష్టం. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆయన వీడియోలు చూస్తుండేవాడిని. ఇప్పుడు జెలెజీ్నతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.మా ఇద్దరి త్రోయింగ్ శైలి ఒకటే. మున్ముందు నా కెరీర్లో మరిన్ని అత్యుత్తమ విజయాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. నీరజ్ ఆట గురించి తనకు బాగా తెలుసని.. ఎంతో మంది అథ్లెట్లు కోచింగ్ కోసం తనను సంప్రదించినా వారందరినీ కాదని భారత ఆటగాడిని ఎంచుకోవడం అతనిలో ప్రతిభను చూసేనని జెలెన్జీ వెల్లడించాడు. గతంలో ఈ దిగ్గజం శిక్షణలోనే జేకబ్ వాలెజ్, విటెస్లావ్ వెసెలి, బార్బరా స్పొటకోవా లాంటి ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకోవడం విశేషం.