‘జనగామ’ కోసం కదం తొక్కిన జనం
జేఏసీ నాయకులను లాక్కెళ్లిన పోలీసులు
ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వేణు, జేఏసీ నేత మాజీద్‌కు గాయాలు
ప్రభుత్వ కార్యాలయాల ఎదుట టీఎన్జీవో నాయకుల నిరసన
జనగామ : జనగామ జిల్లా ఆకాంక్ష, అక్రమ అరెస్టులకు నిరసనగా శనివారం తలపెట్టిన బంద్‌లో వేలాదిగా తరలివచ్చిన జనం కదం తొక్కారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మహిళా పోలీసులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే జేఏసీ, విద్యార్థిసంఘ నాయకులతో నిండిపోయిన దీక్షా శిబిరం వద్దకు లింగాలఘణపురం, బచ్చన్నపేట, నర్మెట మం డలం నుంచి ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
హైదరాబాద్, వరంగల్, సిద్ధిపేట, విజయవాడ హైవేలపై బైఠాయించి రాస్తారోకో మొదలు పెట్టారు. పది నిమిషాల పాటు ఓపికగా ఉన్న పోలీసులు.. నాయకులను అరెస్టు చేసేందుకు సిద్ధం కావడంతో మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, కౌన్సిలర్ మేడ శ్రీను, జేఏసీ నాయకులు మాజీద్, మంగళ్లపల్లి రాజు, శ్రావణ్‌ను బలవంతంగా లాక్కెళ్లి డీసీఎంలో పడేశారు. ఈ క్రమం లో వేణుమాధవ్, మాజీద్‌కు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్వయంగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో రెచ్చిపోయిన ఉద్యమకారులు మరోసారి జాతీయ రహదారిని దిగ్బంధించారు.
అప్పటికే కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలను పంపించే క్రమంలో వాటిని మళ్లీ అడ్డుకున్నారు. మహిళ లు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసుల కు తలనొప్పిగా మారింది. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు రెండు గంటల పాటు అతికష్టం మీద మహిళలను పంపించేశారు. లింగాలఘణపురం మండలం టోల వద్దకు తీసుకువెళ్లి స్వయంగా వారిని ఎక్కించి వెళ్లిపోయే వరకు ఉన్నారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో సీఐ తిరుపతి పర్యవేక్షణలో వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, ఏటూరునాగారం సబ్‌డివిన్‌లోని పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలతో బందోబస్తు కొన సాగిస్తున్నారు. రెవెన్యూ, హెడ్‌పోస్టఫీస్, బ్యాంకుల ఎదుట నిరసన తెలిపిన నాయకులకు టీఎన్జీవో నాయకులు మద్దతు పలికారు. అంతకు ముందు జనగామలో విద్యార్థి సంఘం నేతలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ము నిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, సిద్ధిరాములు, నాగరాజు పాల్గొన్నారు.