Janagama court
-
'నాన్నకు ప్రేమతో’పై కోర్టులో కేసు
వరంగల్ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచురించారని మైనార్టీ యువజన సంఘాల నాయకులు సోమవారం వరంగల్ జిల్లా జనగామ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ఆటోగ్రఫీ విజయ్ చక్రవర్తిపై మైనార్టీ యువజన సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ యువజన నాయకులు ఎండి ఎజాజ్, అన్వర్, సలీం, ఎక్బాల్, షకీల్, ఇమ్రాన్, జాఫర్, సమ్మద్, హబీబ్‌లు మాట్లాడుతూ... మతసామరస్యాన్ని చాటిచెప్పే మనదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. అల్లా, మహ్మద్ ప్రవక్త, మహ్మద్ అనే పేర్లపై డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రచురించారని, ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని వారు ఆరోపించారు. ఈ కేసులో పేర్లు నమోదు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
కోర్టుకు హాజరైన కొండా సురేఖ, బోడకుంటి
జనగామ రూరల్: ఓ కేసు విషయమై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యూరు. 2008లో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ, టీడీపీ తరఫున బోడకుంటి వెంకటేశ్వర్లు అభ్యర్థులుగా పోటీ చేశారు. చేర్యాలలో కొండా సురేఖ సమయానికి మించి ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపిస్తూ బోడకుంటి వెంకటేశ్వర్లు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల అధికారి కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఇరువురు జనగామ కోర్టుకు హాజరయ్యూరు. అడిషనల్ ఫస్ట్ క్లాసు మెజిస్ట్రేట్ టి.నర్సిరెడ్డి ఈనెల 16కు వాయిదా వేశారని న్యాయవాది ఆలేటి సిద్ధిరాములు తెలిపారు. కొండా సురేఖ, బొడకుంటి వెంకటేశ్వర్లును కలుసుకున్న వారిలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రవి, సర్పంచ్ జయప్రకాష్ నారాయణరెడ్డి, నాయకులు ఈగం శ్రీనివాస్ ఉన్నారు.