janata pariwar
-
ఎన్నికల హామీలేమయ్యాయి?
కేంద్రంపై ‘జనతా పరివార్’ నేతల ధ్వజం ఢిల్లీలో మహాధర్నా చేతులు కలిపిన ములాయం, లాలు, నితీశ్, శరద్‌యాదవ్ సాక్షి, న్యూఢిల్లీ: పాత మిత్రులు ఏకమయ్యారు.. విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపై కొలువుదీరారు.. గతంలో ‘జనతా పరివార్’లో కీలక భూమిక పోషించిన ఆరు పార్టీలు సోమవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాయి. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆ పార్టీ ముఖ్యనేత నితీశ్ కుమార్, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ, ఐఎన్ఎల్డీ నాయకుడు దుష్యంత్ చౌతాలా, ఎన్సీపీ నేతలు తారిక్ అన్వర్, డీపీ త్రిపాఠిలతోపాటు సమాజ్‌వాదీ జనతాపార్టీ(ఎస్జేపీ) నాయకుడు కమల్ మొరార్కా తదితరులు పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన మద్దతును తెలుపుతూ పార్టీ నేత డెరిక్ ఓబ్రీన్ ద్వారా ఒక లేఖను పంపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో గుప్పించిన హామీలను విస్మరించి విభజన రాజకీయాలకు పాల్పడతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. సర్కారును దీటుగా ఎదుర్కోవాలంటే ఒక్కతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రంపై విమర్శల జడి: విభేదాలను పక్కనపెట్టి బలమైన ప్రతిపక్షంగా ఏర్పడేందుకు ఇతర పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని జేడీయూ నేత నితీశ్ కుమార్ అన్నారు. ‘‘మనమంతా ఒకే పార్టీగా ఏర్పడాలి. ఇందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ములాయంసింగ్ విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. ఇతర పార్టీలనూ కలుపుకొని పోదాం.’’ అని అన్నారు. లాలు ప్రసాద్ మాట్లాడుతూ..‘‘నల్లధనాన్ని వెనక్కి తెస్తే ఒక్కో పేదవాడికి రూ.15 లక్షలు ఇవ్వొచ్చని వీరు చెప్పారు. ఆ హామీ ఎటు పోయిందో అడగండి.’’ అంటూ మండిపడ్డారు. శరద్ యాదవ్ మత మార్పిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఒక్కరూ ఒకే మతాన్ని ఆచరించాలని అనుకుంటే దానిపైనే మళ్లీ ఎన్నికలకు రావాలంటూ మోదీకి సవాలు విసిరారు. గతంలో రెండుసార్లు ఆరు పార్టీల నేతలు సమావేశమై కొత్త కూటమికి పెట్టాల్సిన పేరు, జెండాపై చర్చించారు. ‘సమాజ్‌వాది జనతాదళ్’గా నామకరణం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ప్రాంతీయ పార్టీల మహాకూటమి
ములాయం నివాసంలో ‘విందు’ భేటీ హాజరైన ఆరు పార్టీల అధినేతలు ‘జనతా పరివార్’ పునర్నిర్మాణానికి యత్నాలు ఉభయసభల్లో మోదీ సర్కారు ముట్టడికి వ్యూహాలు సాక్షి, న్యూఢిల్లీ: ముక్కలైన ‘జనతా పరివార్’(ప్రజా కుటుంబం)ను మళ్లీ ఒక్కటి చేయడానికి ప్రాంతీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. జనతా పరివార్‌లోని పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌యాదవ్ చొరవ తీసుకున్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో గురువారం ములాయం ఇచ్చిన విందు భేటీకి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్, ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, జనతాదళ్(యూ) అధినేత శరద్‌యాదవ్, బీహార్ మాజీ సీఎం నితీశ్‌కుమార్, మాజీ ప్రధాని, జనతాదళ్(ఎస్) అధినేత దేవెగౌడ, ఇండియన్ లోక్‌దళ్ నేత దుష్యంత్ చౌతాలా, సమాజ్‌వాదీ జనతా పార్టీ నేత కమల్ మొరార్క హాజరయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, మోదీ ప్రభంజనం, ప్రభుత్వ పనితీరు, హామీలు నెరవేర్చడంలో వైఫల్యాలు, ప్రాంతీయ పార్టీల భవిష్యత్ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. సంపూర్ణ మెజార్టీతో కొనసాగుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఉభయసభల్లో ముట్టడించే దిశగా వీరంతా సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయి జనతా పరివార్‌ను ఒక్కటిగా చేసి విపక్ష పాత్ర పోషించడానికి నిర్ణయించారు. భేటీ అనంతరం ములాయం మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటైందని, ఆ పార్టీని ఓడించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తామని చెప్పారు. నితీశ్ కుమార్ మాట్లాడుతూ నైతికంగా, సైద్ధాంతికపరంగా జనతా పరివార్‌లోని తామంతా కలసికట్టుగా పనిచేయడానికి సమ్మతి కుదిరిందన్నారు. జనతా పరివార్‌లోని విభిన్న పార్టీలన్నింటినీ ఒక్కటిగా చేయడానికియత్నిస్తున్నామని, ఇది సఫలమైతే జనతా పరివార్ బలోపేతం అవుతుందని, పార్టీల మధ్య సమన్వయం, పొత్తులు, విలీనాలు, ఇతరత్రా విషయాలన్నీ తర్వాత వస్తాయన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం సహా పలు హామీల అమల్లో విఫలమైన మోదీ సర్కారును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నిలదీస్తామన్నారు. కాగా, తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న వామపక్షాలను ఈ భేటీకి ఆహ్వానించకపోవడం గమనార్హం.