‘చల్లారిన’ చమురు.. కాలుతున్న కలలు
చమురు ధరల తగ్గుదలతో గత ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గింది. కానీ చమురు ధరలు మరీ పడిపోయి ప్రపంచ స్థాయిమాంద్య సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులతో మోదీ దేశాన్ని ఎగుమతుల కేంద్రం చేయాలనుకున్నారు. కానీ నేటి పరిస్థితుల్లో విదేశీయు లెవరూ మన దేశానికి పరుగులు తీయడం లేదు. ఎగుమతుల కోసం ఉత్పత్తి చేసినా కొనేవారు లేరు. మారిన పరిస్థితులను బట్టి దేశ ఆర్థిక దిశను మార్చాలి. తక్కువ పన్నులు, సులభ రుణాల తో ప్రజలకు డబ్బు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేసి, దేశీయ గిరాకీని సృష్టించాలి.
నరేంద్ర మోదీ మే 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి చమురు ధరలు ఇంచుమించు 115 డాలర్లుగా ఉండేవి. మన దేశం దాదాపు 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి చమురు ధర 60 డాలర్లకు పడిపోవడం ఇక్కడ పెద్ద సంబరమే అయింది. అయితే చమురు ధరల తగ్గుదల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేయడం ప్రారంభించింది. చము రు ధరల తగ్గుదలతో మన దేశం కూడా ప్రపంచంలాగే ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక కడుపు నొప్పితో బాధపడుతోంది. చైనా, జపాన్. యూరప్‌ల ఆర్థిక వ్యవస్థలు మందగించి, చమురు వినియోగాన్ని తగ్గించాయి.
భారీ చమురు దిగుమతి దారుగా ఉండే అమెరికా సొంత ఉత్పత్తి పెంచుకొని, చమురు దిగుమతులు మానేసింది. సరఫరా పెరిగి ధరలు తగ్గినా, గిరాకీ తగ్గి ధరలు తగ్గినా ఆర్థిక తిరో గమనం (రిసెషన్) ఏర్పడుతుంది. చమురు ఉత్పత్తి పెరుగుదలతో అమెరికా వృద్ధి చెందడం ప్రారంభమైంది. మరోవంక చైనా, జపాన్, యూరప్‌ల ఆర్థిక వ్యవస్థలు మందగించడంతో చమురు గిరాకీ పడిపోయింది. సాధారణంగా చమురు ధరలు పడిపోయినప్పుడల్లా సౌదీ అరేబియా నేతృత్వంలోని చమురు ఎగుమతి దేశాలు (ఒపెక్) ఉత్పత్తి తగ్గించడం, దాంతో ధరలు వాటికవే పెర గడం పరిపాటి. కానీ ఈసారి ధరలు పడిపోయినా సౌదీ, తదితర దేశాలు ఉత్ప త్తి తగ్గించరాదని నిర్ణయించాయి.
సౌదీ, అమెరికాలు తమకు సమస్యాత్మకంగా ఉన్న రష్యా, ఇరాన్‌ల ఆర్థిక వ్యవస్థలను దె బ్బ తీయాలని కోరుకుంటున్నాయి. రష్యా. ఇరాన్‌లు రెండూ మొత్తంగా తమ బడ్జెట్ల నిధుల కోసం చమురు ఎగు మతులపైనే పూర్తిగా ఆధారపడినవి. చమురు ధరల తగ్గుదల వల్ల గత ఆరు నెలలుగా మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. ఆ ఖ్యాతి నరేంద్ర మోదీకి దక్కి, లబ్ధి పొందారు. కానీ ధరలు బాగా పడిపోవడంతో భారత్ దెబ్బతినిపోసా గింది. అంతర్జాతీయ స్థాయి ఆర్థిక మాంద్య సూచనలు కనిపిస్తుండటం వలన మోదీ ఆర్థిక ప్రణాళికలు ఘోరంగా విఫలమవుతాయో లేదో వేచి చూడాలి.
చమురు ధరల తగ్గుదల ప్రభావం
1. గల్ఫ్, అరబ్బు దేశాలలో దాదాపు 70 లక్షల మంది భారతీయులు పనిచేస్తు న్నారు. లక్షలాదిగా వారు అక్కడ ఉపాధి కోల్పోతారు.
2. గల్ఫ్, అరబ్బు దేశాలు ఆహారం తదితర వస్తువులను భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. అవి ఇక ఈ దిగుమతులను తగ్గిస్తాయి. దీంతో మన ప్రభుత్వ పన్నుల రాబడి పడి పోతుంది. రవాణా, పోర్టుల రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
3. ఏటా భారత్, యూరప్‌ల మధ్య 8,000 కోట్ల డాలర్లకుపైగా వాణిజ్యం సాగుతోంది. మాంద్యం వల్ల యూరప్ మన దేశం నుండి దిగు మతులను తగ్గిస్తుంది. ఇక యూరప్ నుంచి అరబ్బు దేశాలకు ఎగుమతులు కూ డా తగ్గుతాయి. అది తిరిగి భారత్‌పై ప్రభావం చూపుతుంది.
4. భారత్‌కు భారీ గా విదేశీ పెట్టుబడులు అవసరం. ఆ దేశాల్లోని పరిస్థితే గడ్డుగా ఉంటే వారు మన దేశంలో పెట్టుబడులు పెట్టరు. భారీ విదేశీ పెట్టుబడులనే మోదీ కల, కల గానే మిగిలిపోవచ్చు.
5. మన అతి పెద్ద వ్యాపార భాగస్వామి చైనా కూడా వాణిజ్యం విషయంలో అరబ్బు దేశాలపైనా, యూరప్‌పైనా ఆధారపడి ఉంది. కాబట్టి చైనా వాణిజ్యం కూడా తగ్గుతుంది. దీంతో భారత్‌తో దాని వాణిజ్యం, పెట్టుబడులు కూడా క్షీణిస్తాయి.
6. మన మరో ముఖ్య వాణిజ్య భాగస్వామి జపాన్ వచ్చే ఐదేళ్లలో మన దేశంలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులకు వాగ్దా నం చేసింది. కానీ గత నెలలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అది ఆర్థిక తిరోగమనంలో ఉందంటున్నారు. అదీ ఇక్కడ పెట్టుబడులు పెట్టలేదు.
7. ఇక అమెరికాలో తాత్కాలిక వీసాలతో పనిచేస్తున్న లక్షలాది భారతీయులు వందల కోట్ల డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. ఇప్పటికైతే అమెరికా సంతుష్టితో ఉన్నా, చైనా, జపాన్, యూరప్‌లలోని గడ్డు పరిస్థితుల వల్ల దాని ఆర్థిక వ్యవస్థ కూడా పతనోన్ముఖం గాక తప్పదు. దాని సాఫ్ట్‌వేర్‌ను, విమానాలను కొనేదెవరు? అమెరికాపైనే ఆధారపడ్డ మన సాఫ్ట్వేర్ పరిశ్రమ ఏం కావాలి?
మోదీ కల కుప్పకూలుతోందా?
చమురు ధరల హఠాత్ పతనంతో స్టాక్ మార్కెట్లు పతనం చెంది, బ్యాంకులు ఆందోళన చెందడం మొదలైంది. అయితే మోదీ దేశ ఆర్థిక వృద్ధికి విదేశీ పెట్టు బడులు, విదేశీ మార్కెట్లపైనా ఆధారపడ్డారు. దేశం ఎగుమతుల కేంద్రం కాగల దని విశ్వసిస్తున్నారు. కానీ మన వస్తువులను కొనేవారు లేకపోతే ఎలా? చము రు ధరల పతనం వల్ల తొలుత మన దేశానికి కొంత లబ్ధి కలిగినా, అది మన కస్టమర్లను దెబ్బతీసింది. అయితే ఏ సమస్యకైనా పరిష్కారాలుంటాయి. మోదీ ఎలాంటి ఆర్థిక నిర్వహణను అందించగలుగుతారనే దానిపైనే అది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ మాంద్యం సవాలును ఎదుర్కొనలేకపోతే ఆయన ప్రణాళికలన్నీ కుప్పకూలుతాయి. 11 కోట్ల మంది నిరుద్యోగులు మోదీ ఉద్యో గాలు సృష్టిస్తారని ఆశలు పెట్టుకున్నారు. గత ఆరు నెలల కాలంలో అనుమతులు, మంచి పరిపాలన కారణంగా ఉపాధి రంగంలో కొంత మెరుగుదల ఉంది. కానీ ఇది ఆగిపోవచ్చు.
ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాలంటే?
ఇటీవల రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ విధానం దేశీయ మార్కెట్‌పై ఆధారపడితేనే విజయవంతం కాగలదన్నారు. ఎగుమతి మార్కెట్లు లేకపోతే తయారైన వస్తువు లు ఎక్కడకు పోవాలి? ఎగుమతి చేయలేనప్పుడు అసలు ఎందుకు ఉత్పత్తి చేయాలి అన్నారు. కాబట్టి ప్రభుత్వం దేశీయ గిరాకీని పెంచడంపై కేంద్రీకరించి తీరాలి, ఎగుమతులపై ఆధారపడరాదు. వాస్తవానికి ప్రపంచ మార్కెట్ కుప్ప కూలినప్పటి నుండే ప్రభుత్వం దేశీయ వస్తువులను కొనగలిగే విధంగా ప్రజల వద్ద మరింత డబ్బు ఉండేలా చూడాల్సింది. మారిన వాతావరణానికి అను గుణంగా మోదీ ప్రభుత్వ దిశను పూర్తిగా మార్చాల్సి ఉంది. చమురు సంక్షోభం అంటేనే ఆయన ప్రణాళికలన్నీ వృథా అయ్యాయని అర్థం. విదేశీయులెవరూ ఇక్కడకు పరుగెత్తుకు రావడం లేదు. రాజకీయ కారణాలతో మోదీ ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇంకా వేచి చూసే సమయం లేదు.
దేశీయ గిరాకీని పెంచడమే మార్గం
1. ప్రభుత్వం ఏటా రూ. 1.5 లక్షల కోట్లు సర్వీసు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తోంది. మన్మోహన్ హయాంలో ఈ పన్ను మాంద్యానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వం సర్వీసు ట్యాక్స్ వంటి పన్నులను తగ్గించి తీరాలి.
2. తిరిగి రప్పించలేని నల్ల ధనానికి ‘‘పన్ను క్షమాభిక్ష పథకం’’ ప్రవేశపెట్టడం ఉత్తమం. దీంతో భారీగా డబ్బు బయటకు వచ్చి దేశీయ గిరాకీని సృష్టిస్తుంది. ఆర్థిక వ్యవస్థను, మోదీని కాపాడుతుంది.
3. సాహసోపేతమైన దృష్టితో మోదీ పన్నుల సంస్కరణలను చేపట్టి, సంతోషంగా పన్నులను చెల్లించేలా వాటిని తగ్గించాలి. అప్పుడిక ఎవరూ డబ్బును విదేశాలకు తరలించాలనుకోరు.
4. ద్రవ్యోల్బణం దిగి వచ్చింది ఉత్పాదకత పెరగడం వల్లనో లేక మెరుగైన ద్రవ్య నిర్వహణ వల్లనో కాదు. సున్నా ద్రవ్యోల్బణం ఉండటం నేడు మనకు శుభ సూచకం కాదు. ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలోకి మరింత డబ్బును, రుణాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేకపోతే, తక్షణం ప్రభుత్వమే ఆ పనిచేయాలి.
5. అమెరికా 2008 ఆర్థిక మాంద్యానికి పరిష్కారంగా దివాలా తీయబోతున్న పెద్ద బ్యాంకులు, భారీ కార్ల కంపెనీలలో మునుపెన్నడూ ఎరుగని తీరున పెట్టుబడులు పెట్టింది. తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకుల ద్వారా కూడా డబ్బును అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర బ్యాంకు డబ్బు సరఫరాను సడలించింది. ప్రభుత్వం దేశీయ పన్నులను, రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది అలా మరింత డబ్బును ప్రవేశపెట్టడం ద్వారానే అది మాంద్యం నుండి గట్టెక్కింది.
పగటి కలలు మానండి
అమెరికా తన విధానాన్ని మార్చుకొని డబ్బు లభ్యతను తగ్గిస్తుందని ఆశించారు. కానీ అది కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ఈ హఠాత్ మాంద్యాన్ని చూసి భవిష్యత్తులో కూడా ఇదే సరళ ద్రవ్య విధానం కొనసాగుతుందని రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఇది మోదీ అర్థంచేసుకోవాల్సిన సందేశం. తక్కువ పన్నులు, సులభ రుణాల ద్వారా దేశ ప్రజలకు డబ్బు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేసి దేశీయ గిరాకీని సృష్టించాలి, ఏ తప్పు చేయకున్నా స్పైస్‌జెట్ సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం దాన్ని రక్షించకపోతే, మోదీ విఫలమవుతారనడానికి అది సంకేతం అవుతుంది.
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల విచిత్ర స్వప్నాలు కూడా భగ్నం కావచ్చు. సింగపూర్, మలేసియాలను సృష్టించాలన్న వారి కలలు నైజీరియా లేదా ఆఫ్రికాలను సృష్టించే భయానకమైన పీడకలలుగా మారవచ్చు. మాంద్యం ఎక్కడికి దారి తీస్తుందో ఎవరూ చెప్పలేరు. చంద్రబాబు, కేసీఆర్‌లు తమ సింగపూర్, కౌలాలంపూర్ కలలను వాయిదా వేసుకోవడం మేలు.
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)