Japan investors
-
ఈ దశాబ్దం ఆసియాదే..
♦ అందులో భారత్ కీలకం ♦ మరిన్ని సంస్కరణలు తెస్తాం ♦ పన్నుల వ్యవస్థ సంస్కరిస్తాం ♦ జపాన్ ఇన్వెస్టర్లకు జైట్లీ వాగ్దానాలు టోక్యో: ఈ దశాబ్దం ఆసియాదేనని, దీంట్లో భారత్‌ది కీలక పాత్ర అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 40 శాతం ఆసియాదేశాలకే వస్తున్నాయని చెప్పారు. మరిన్ని వ్యవస్థాగత, మార్కెట్ సంబంధిత సంస్కరణలు తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జపాన్ ఇన్వెస్టర్లకు వాగ్దానం చేశారు. ప్రస్తుతమున్న 7.6 శాతాన్ని మించిన వృద్ధి సాధన కోసం మౌలిక రంగంపై వ్యయాలను మరింతగా పెంచనున్నామని, పన్నుల వ్యవస్థను మరింత సరళీకరిస్తామని ఆయన వారికి భరోసానిచ్చారు. జపాన్ నుంచి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆరు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తున్న ఆయన నికాయ్ ఇన్‌కార్పొ ఇక్కడ ఏర్పాటు చేసిన ‘ద ఫ్యూచర్ ఆఫ్ ఏషియా’ సదస్సులో మాట్లాడారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, గత రెండేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. వరుసగా రెండేళ్ల పాటు కరువు, ప్రైవేట్ రంగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ మంచి వృద్ధినే సాధించిందని తెలిపారు. తాము తెస్తున్న సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. రెండేళ్లలో 101 బిల్లులు చట్టాలయ్యాయని, రానున్న వర్షాకాల సమావేశాల్లో వస్తువులు, సేవల బిల్లు(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-జీఎస్టీ) ఆమోదం పొందగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గ్రామీణ డిమాండ్ పెరుగుతుంది... పన్నుల వ్యవస్థను సంస్కరించడం అతి పెద్ద సవాలని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ వ్యవస్థను మరింతగా సరళీకరిస్తున్నామని చెప్పారు. వ్యాపారంలో ప్రవేశించడం సులభతరం చేశామని, వ్యాపారం చేయడం కూడా సులభతరం చేశామని, ఇక ఇప్పుడు దివాలా బిల్లు ఆమోదంతో వ్యాపారం నుంచి నిష్ర్కమించడం కూడా సులభతరం చేశామని వివరించారు. ఈ ఏడాది 10 వేల కిమీ. జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని, రైల్వేల ఆధునీకీకరణ కార్యక్రమం పట్టాలపై పరుగులు పెడుతోందని, రైల్వే మౌలిక సదుపాయాల రంగంలోకి ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను అకర్షించే అంశంపై దృష్టిసారిస్తున్నామని తెలిపారు. 70 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయని, ఈ ఏడాది కొత్తగా 25 ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఈ ఏడు వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాలున్నాయని, ఫలితంగా గ్రామీణ డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే ఆసియా దేశాలు జోరుగా వృద్ధి సాధిస్తున్నాయని, చైనా మందగమనం కారణంగా ప్రపంచం భారత్ వైపు చూస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు. ఏషియన్, సార్క్, ఆర్సెప్, టీపీపీ... సంస్థ ఏదైనా భారత్ కీలకమని వివరించారు. శాంతికి, వృద్ధికి భారత్ ప్రతీక అని పేర్కొన్నారు. -
భారత్ మౌలిక రంగంపై జపాన్ దృష్టి!
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ * ఆరు రోజుల పర్యటన ప్రారంభం టోక్యో: జపాన్ ఇన్వెస్టర్లు భారత్ మౌలిక రంగంలో పెట్టుబడులకు ఉత్సుకత చూపుతున్నారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆరురోజుల జపాన్ పర్యటనను ప్రారంభించారు. ఆసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఆయన ఈ పర్యటన ప్రారంభమైంది. తొలి రోజు పర్యటనలో జైట్లీ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సీఈఓ మసయోషీ సన్తో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇంటర్నెట్, సోలార్ ఎనర్జీలో పెట్టుబడులకు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కసరత్తు జైట్లీతో సమావేశం అనంతరం మసయోషీ సన్ విలేకరులతో మాట్లాడుతూ, ఇంటర్నెట్ కంపెనీలు, సోలార్ విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకు తమ సంస్థ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంధన రంగంలో ఇప్పటికే తమ కంపెనీ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతీ ఎంటర్ప్రైజెస్ అండ్ తైవాన్ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను ప్రారంభించిందని వెల్లడించారు. మరో అర శాతం రేటు కోత: మోర్గాన్ స్టాన్లీ ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో అరశాతం రెపోరేటు కోత నిర్ణయం తీసుకుంటుందని రేటింగ్ దిగ్గజ సంస్థ- మోర్గాన్‌స్టాన్లీ అంచనావేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి 2017 నాటికి 4.7 శాతంగా ఉంటుందని, ఇది రేటు కోతకు దారితీసే ప్రధాన అంశమని తన తాజా నివేదికలో వివరించింది. -
భారత్‌కు రండి... చకచకా అనుమతులు..
జపాన్ ఇన్వెస్టర్లకు ప్రధాని మోడీ పిలుపు... ►పీఎంఓలోని క్లియరెన్స్ విభాగంలో ఇద్దరు జపాన్ ప్రతినిధులకు చోటు ►ఎఫ్‌డీఐలకు ఆమోదాన్ని త్వరలోనే చట్టబద్ధం చేస్తాం... ►ఇన్ఫ్రా, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో జాప్యాలకు అడ్డుకట్ట ►సుపరిపాలనకే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టీకరణ వ్యాపారం నా రక్తంలోనే ఉంది.. నేను గుజరాతీని. వ్యాపారం అనేది నా రక్తంలోనే ఉంది. వ్యాపార సంస్థలకు మినహాయింపులు అక్కర్లేదు. వాటికి కావాల్సిందల్లా ఎదిగేందుకు అనువైన వాతావరణమే. అందుకు తగిన విధానాలను రూపొందించడం అనేది లీడర్, ప్రభుత్వం బాధ్యత. విధాన నిర్ణయాలు సరిగ్గా ఉంటే ఎలాంటి వివక్షా లేకుండా అందర్నీ సమానంగా చూడటం సాధ్యపడుతుంది. టోక్యో: భారత్‌లో పెట్టుబడులు పెట్టే జపాన్ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోడీ రెడ్‌కార్పెట్ పరిచారు. ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన అనుమతులను వేగవంతం చేస్తామని జపాన్ ఇన్వెస్టర్లకు మోడీ హామీనిచ్చారు. అంతేకాకుండా జపాన్ పెట్టుబడుల క్లియరెన్స్‌ల కోసం ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నిర్ణయాత్మక బృందంలో ఇద్దరు జపాన్ ప్రతినిధులకు చోటు కల్పిస్తామని కూడా ఆయన ప్రతిపాదించారు. తద్వారా తాము అక్కడి ఇన్వెస్టర్లకు ఎంత ప్రాధాన్యమిస్తున్నామనేది స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా జపనీస్ వాణిజ్య, పరిశ్రమల మండలి(నిప్పన్ కీడన్రెన్), జపాన్-భారత్ వాణిజ్య సహకార సంఘం సోమవారమిక్కడ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విందు సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)తో పాటు రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 26% నుంచి 49%కి పెంచుతూ తమ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలకు చట్టపరమైన మార్పులను సాధ్యమైనంత తొందరగా సాకారం చేయనున్నామని మోడీ ప్రకటించారు. విధానపరమైన నిర్ణయాల్లో జాప్యాలను తొలగిస్తామని... మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. మోడీతో పాటు జపాన్ పర్యటకు వెళ్లిన కార్పొరేట్ బృందంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సునీల్ మిట్టల్, చందా కొచర్, కిరణ్ మజుందార్ షా, ఆది గోద్రెజ్, సునీల్ ముం జాల్, బాబా కల్యాణి తదితర దిగ్గజాలు ఉన్నారు. సింగిల్ విండో క్లియరెన్స్‌లపై దృష్టి... వ్యాపారానికి సానుకూల వాతావరణాన్ని కల్పించడం, విధానాల్లో సరళీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించడం, అనుమతి ప్రక్రియల వేగవంతం వంటి అంశాలు చాలా కీలకమైనవని.. అందుకే సింగిల్ విండో క్లియరెన్సులపై తాను దృష్టిసారించినట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రభుత్వం, పారిశ్రామిక రంగం మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు నేను చేపట్టిన సంస్కరణలు, ప్రయోగాలను జాతీయ స్థాయిలో అమలు చేస్తా’ అని మోడీ పేర్కొన్నారు. జపాన్‌లోని నిర్వహణపరమైన మెలకువలను తమ ప్రభుత్వం కూడా అందిపుచ్చుకోనుందని.. ఇందుకోసం జపనీస్ మేనేజ్మెంట్(కెజైన్) సిస్టమ్‌ను పీఓఎంలో ప్రవేశపెట్టనున్నట్లు మోడీ వెల్లడించారు. ఇందుకు తగిన శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్లు చెప్పారు. పట్టాలెక్కిన ఆర్థిక వ్యవస్థ... తమ సర్కారు తొలి 100 రోజుల పాలనలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు త్వరలోనే తగిన ప్రతిఫలాన్నివ్వనున్నాయని ప్రధాని జపాన్ ఇన్వెస్టర్లకు వివరించారు. తాను తీసుకున్న కొన్ని వేగవంతమైన నిర్ణయాలను ప్రస్తావించారు. అహ్మదాబాద్‌లో జపనీన్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి, అరుదైన ఖనిజాల వెలికితీతకు సంబంధించిన ఒప్పందం వంటివి ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు రెండున్నరేళ్ల గరిష్టమైన 5.7 శాతానికి పుంజుకోవడాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ‘నిరుత్సాహకర పరిస్థితులు ఇక తొలగినట్లే. మా ప్రభుత్వ 100 రోజుల పరిపాలనను చూడండి. అంతకుముందు వృద్ధి రేటు 5-5.4 శాతం స్థాయిలో మందగమనంలో ఉండేది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే భారీగా పుంజుకొని 5.7 శాతానికి వృద్ధి చెందింది. ఇదంతా భవిష్యత్తుపై ఆశలను చిగురింపజేస్తోంది. సానుకూల సెంటిమెంట్ నెలకొనేలా చేసింది.’ అని ఆయన చెప్పారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వ దశాబ్ద కాలపు పనితీరుపై మోడీ విమర్శలు గుప్పించారు. ‘30 ఏళ్ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయి మెజారిటీతో మా ప్రభుత్వం కొలువుదీరింది. 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచే దిశగా మాపై బాధ్యత మరింత పెరిగింది’ అని మోడీ వ్యాఖ్యానించారు.