భారత్‌కు రండి... చకచకా అనుమతులు.. | Nippon, Reliance Group launch India funds for Japan investors | Sakshi
Sakshi News home page

భారత్‌కు రండి... చకచకా అనుమతులు..

Published Tue, Sep 2 2014 1:43 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

భారత్‌కు రండి... చకచకా అనుమతులు.. - Sakshi

భారత్‌కు రండి... చకచకా అనుమతులు..

జపాన్ ఇన్వెస్టర్లకు ప్రధాని మోడీ పిలుపు...
పీఎంఓలోని క్లియరెన్స్ విభాగంలో ఇద్దరు జపాన్ ప్రతినిధులకు చోటు
ఎఫ్‌డీఐలకు ఆమోదాన్ని త్వరలోనే చట్టబద్ధం చేస్తాం...
ఇన్‌ఫ్రా, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో జాప్యాలకు అడ్డుకట్ట
సుపరిపాలనకే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టీకరణ

వ్యాపారం నా రక్తంలోనే ఉంది..
నేను గుజరాతీని. వ్యాపారం అనేది నా రక్తంలోనే ఉంది. వ్యాపార సంస్థలకు మినహాయింపులు అక్కర్లేదు. వాటికి కావాల్సిందల్లా ఎదిగేందుకు అనువైన వాతావరణమే. అందుకు తగిన విధానాలను రూపొందించడం అనేది లీడర్, ప్రభుత్వం బాధ్యత. విధాన నిర్ణయాలు సరిగ్గా ఉంటే ఎలాంటి వివక్షా లేకుండా అందర్నీ సమానంగా చూడటం సాధ్యపడుతుంది.

టోక్యో: భారత్‌లో పెట్టుబడులు పెట్టే జపాన్ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోడీ రెడ్‌కార్పెట్ పరిచారు. ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన అనుమతులను వేగవంతం చేస్తామని జపాన్ ఇన్వెస్టర్లకు మోడీ హామీనిచ్చారు. అంతేకాకుండా జపాన్ పెట్టుబడుల క్లియరెన్స్‌ల కోసం ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నిర్ణయాత్మక బృందంలో ఇద్దరు జపాన్ ప్రతినిధులకు చోటు కల్పిస్తామని కూడా ఆయన ప్రతిపాదించారు. తద్వారా తాము అక్కడి ఇన్వెస్టర్లకు ఎంత ప్రాధాన్యమిస్తున్నామనేది స్పష్టం చేశారు.

జపాన్ పర్యటనలో భాగంగా జపనీస్ వాణిజ్య, పరిశ్రమల మండలి(నిప్పన్ కీడన్‌రెన్), జపాన్-భారత్ వాణిజ్య సహకార సంఘం సోమవారమిక్కడ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విందు సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)తో పాటు రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 26% నుంచి 49%కి పెంచుతూ తమ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలకు చట్టపరమైన మార్పులను సాధ్యమైనంత తొందరగా సాకారం చేయనున్నామని మోడీ ప్రకటించారు.

విధానపరమైన నిర్ణయాల్లో జాప్యాలను తొలగిస్తామని... మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. మోడీతో పాటు జపాన్ పర్యటకు వెళ్లిన కార్పొరేట్ బృందంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సునీల్ మిట్టల్, చందా కొచర్, కిరణ్ మజుందార్ షా, ఆది గోద్రెజ్, సునీల్ ముం జాల్, బాబా కల్యాణి తదితర దిగ్గజాలు ఉన్నారు.
 
సింగిల్ విండో క్లియరెన్స్‌లపై దృష్టి...
వ్యాపారానికి సానుకూల వాతావరణాన్ని కల్పించడం, విధానాల్లో సరళీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించడం, అనుమతి ప్రక్రియల వేగవంతం వంటి అంశాలు చాలా కీలకమైనవని.. అందుకే సింగిల్ విండో క్లియరెన్సులపై తాను దృష్టిసారించినట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రభుత్వం, పారిశ్రామిక రంగం మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. గుజరాత్‌లో సీఎంగా ఉన్నప్పుడు నేను చేపట్టిన సంస్కరణలు, ప్రయోగాలను జాతీయ స్థాయిలో అమలు చేస్తా’ అని మోడీ పేర్కొన్నారు. జపాన్‌లోని నిర్వహణపరమైన మెలకువలను తమ ప్రభుత్వం కూడా అందిపుచ్చుకోనుందని.. ఇందుకోసం జపనీస్ మేనేజ్‌మెంట్(కెజైన్) సిస్టమ్‌ను పీఓఎంలో ప్రవేశపెట్టనున్నట్లు మోడీ వెల్లడించారు. ఇందుకు తగిన శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్లు చెప్పారు.
 
పట్టాలెక్కిన ఆర్థిక వ్యవస్థ...
తమ సర్కారు తొలి 100 రోజుల పాలనలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు త్వరలోనే తగిన ప్రతిఫలాన్నివ్వనున్నాయని ప్రధాని జపాన్ ఇన్వెస్టర్లకు వివరించారు. తాను తీసుకున్న కొన్ని వేగవంతమైన నిర్ణయాలను ప్రస్తావించారు. అహ్మదాబాద్‌లో జపనీన్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి, అరుదైన ఖనిజాల వెలికితీతకు సంబంధించిన ఒప్పందం వంటివి ఇందులో ఉన్నాయి.  ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు రెండున్నరేళ్ల గరిష్టమైన 5.7 శాతానికి పుంజుకోవడాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.

‘నిరుత్సాహకర పరిస్థితులు ఇక తొలగినట్లే. మా ప్రభుత్వ 100 రోజుల పరిపాలనను చూడండి. అంతకుముందు వృద్ధి రేటు 5-5.4 శాతం స్థాయిలో మందగమనంలో ఉండేది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే భారీగా పుంజుకొని 5.7 శాతానికి వృద్ధి చెందింది. ఇదంతా భవిష్యత్తుపై ఆశలను చిగురింపజేస్తోంది. సానుకూల సెంటిమెంట్ నెలకొనేలా చేసింది.’ అని ఆయన చెప్పారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వ దశాబ్ద కాలపు పనితీరుపై మోడీ విమర్శలు గుప్పించారు. ‘30 ఏళ్ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయి మెజారిటీతో మా ప్రభుత్వం కొలువుదీరింది. 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచే దిశగా మాపై బాధ్యత మరింత పెరిగింది’ అని మోడీ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement