japan women
-
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా.. జపాన్ మహిళ!
జపాన్‌కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఇంతకీ ఆమె పుట్టిందెప్పుడో తెలుసా? రైట్ బ్రదర్స్ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించిన 1908లో. అదే ఏడాది ఈఫిల్ టవర్ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుకా జపాన్‌లోని నగరమైన అషియా నివాసి.ఆమె 70వ ఏట జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా స్నీకర్స్‌తో ఎక్కి గైడ్‌నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా (117) మంగళవారం కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించారు. -
క్యాన్సర్‌తో పోరాడి... ఒలింపిక్స్‌కు అర్హత
టోక్యో: సాధారణంగా ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు అందరూ క్వాలిఫయింగ్‌లో పోరాడతారు. కానీ జపాన్‌కు చెందిన మహిళా స్విమ్మర్ రికాకో ఐకీ మాత్రం క్యాన్సర్‌తో పోరాడింది. దానిని జయించి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. జపాన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో లక్ష్యదూరాన్ని ఆమె 57.77 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. రెండేళ్ల క్రితం లుకేమియా (రక్త క్యాన్సర్) బారిన పడిన ఆమె తాజా విజయంతో వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
మన జీవితకాలం ఐదేళ్లు పెరిగిందంట!
జెనీవా: గత 15 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు జీవిత కాలం ఐదేళ్లు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రకటించింది. 1960 నుంచి సగటు జీవిత కాలం పెరుగుదలను పరిశీలిస్తే ఇదే అత్యధికమని తెలిపింది. 1990లో ఆఫ్రికాలో ఎయిడ్స్ వ్యాధి, తూర్పు ఐరోపాలో సోవియట్ కూటమి విడిపోవడం వంటి కారణాలరీత్యా సగటు జీవిత కాలం బాగా తగ్గిపోయింది. తాజాగా ఆఫ్రికాలో అత్యధికంగా ఇది 9.4 ఏళ్లు పెరిగి 60 సంవత్సరాలకు చేరింది. 2015లో జన్మించిన పిల్లలు సగటున 71.4 ఏళ్లు (బాలికలు 73.8 ఏళ్లు, బాలురు 69.1 ఏళ్లు) బతుకుతారని చెప్పారు. అయితే స్థానిక పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇందులో మార్పు ఉండొచ్చన్నారు. జపాన్ మహిళలు అత్యధికంగా 86.8 ఏళ్లు జీవిస్తారని డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది.