ప్లాన్ ఒక్కటే లక్ష్యాలు రెండు
సాక్షి, తిరుపతి: స్వచ్ఛంద సమైక్య ఉద్యమం అధికార కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. విభజన ప్రకటన అపవాదు నుంచి బయటపడటంతోపాటు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జనాన్ని నమ్మించేందుకు జిమ్మిక్కులకు తెరతీశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వ్యూహాత్మకంగా ఇళ్ల పట్టాల డ్రామా తెరపైకి తెచ్చారు.
కొంత కాలంగా తిరుపతి నగరంలో ఆ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇళ్లు ఇస్తామంటూ మహిళలను పిలిపించుకుని మంతనాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పేరుతో ముద్రించిన పత్రాలను పంచి పెడుతున్నారు. ఆ పత్రాలను తీసుకున్న మహిళల వివరాలను నమోదు చేసి, ఫొటో అంటించి గెజిటెడ్ అధికారి వద్ద సంతకం తీసుకుంటారు. ఆ పత్రాన్ని మహిళా సంఘాల్లోని ఓ లీడర్ చేతికి చేరుస్తారు. ఈ తతంగమంతా ఓ పథకం ప్రకారం చేస్తున్నారు. ఐకేపీకి చెందిన ఓ ఉన్నతాధికారి, కొందరు మహిళా సంఘాల లీడర్లుఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
డ్రామా అసలు స్వరూపం ఇదీ..
ఇళ్ల పట్టాల పంపిణీ వెనుక అధికార ప్రజాప్రతినిధికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడం, ఉద్యమంలో మహిళలు పాల్గొనకుండా నిలువరించే ప్రయత్నం. ‘సొంతిల్లు లేని వారందరికీ ఈసారి ఇళ్లిప్పిస్తాం. అందుకు మీరు చేయాల్సిందల్లా సమైక్య సమ్మెలో పాల్గొనకూడదు. వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేసి మరోసారి గెలిపించాలి. నేను అడిగిన ఈ చిన్న హామీలను నెరవేరిస్తే సొంతింటి కలను నేను నెరవేరుస్తాను’ అని మహిళలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో 15వేల మంది నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. మరో 10వేల మంది నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు కాంగ్రెస్ పత్రాలను పంపిణీ చేస్తున్నారు. నివాస స్థలం కోసం పెట్టుకుంటున్న దరఖాస్తు పత్రంలో గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి. అందుకోసం కొందరు డ్వాక్రా లీడర్లు ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వసూలు చేస్తున్న మొత్తాన్ని అధికారికి ఇస్తారా అనేది ప్రశ్నార్థకమే.
అసంపూర్తి నిర్మాణాల మాటేంటి?
తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నిర్మించ తలపెట్టిన పక్కా ఇళ్ల నిర్మాణం నాలుగేళ్లుగా పిల్లర్స్కే పరిమితమయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తి నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో కోట్ల రూపాయల నిధులు మట్టిపాలవుతున్నాయి.
జేఎన్ఎన్యూఆర్ఎం, మినిస్టరీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ పథకం కింద పాడిపేట, దామినేడు, అవిలాల సమీపంలో వెక్కిరిస్తున్న అసంపూర్తి గృహాలే ఇందుకు నిదర్శనం. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తిరుపతికి 2009లో రూ.2,223 కోట్లు మంజూరు చేసింది. అందులో మొదటి విడతగా రూ.100 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ నిధులతో అర్బన్ హౌసింగ్, నీటి సరఫరా, మురికికాలువలు, రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ నిధులు నీటి సరఫరా, మురికి కాలువలు, రోడ్ల నిర్మాణాలకే చాల్లేదని తెలిసింది.
దీంతో అర్బన్ హౌసింగ్ నిర్మాణం అసంపూర్తిగా నిలిపేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. మంజూరైన ఇళ్లనే పూర్తి చేయలేక ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజాప్రతినిధి కొత్తగా మళ్లీ ఇళ్లు నిర్మించి ఇస్తామనడం నమ్మశక్యంగా లేదని అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆ నేత అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తే వాటిలో వేలాది మంది నిరుపేదలకు నీడ కల్పించిన వారవుతారని అంటున్నారు.