జై రాజశేఖరా...
మహానేత, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జై రాజశేఖరా’. ఈ చిత్రానికి ‘దేవుడు కాని దేవుడు’ ఉపశీర్షిక. ఇందులో వైఎస్ఆర్గా సుమన్ నటిస్తున్నారు. ఎం.సుబ్బారెడ్డి దర్శకుడు. అప్పారావు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ మంగళవారం హైదరాబాద్లో ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ప్రారంభమైంది. సుమన్ మాట్లాడుతూ- ‘‘నా అభిమాన నాయకుడు రాజశేఖరరెడ్డి. ఆయన పాత్రను పోషించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ వైఎస్ఆర్ జరిపిన పాదయాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.
ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి వల్ల లబ్ధి పొందిన ప్రజలు, వారి అభిప్రాయాలు ఈ చిత్రంలో కీలకం కానున్నాయి’’ అని తెలిపారు. ‘‘రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. అద్భుతమైన పాలన అందించి దేవుడు కాని దేవుడిగా ప్రజల గుండెల్లో నిలిచారాయన. 40 రోజులు ఏకధాటిగా చిత్రీకరణ జరిపి ఎన్నికల కంటే ముందే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత అప్పారావు తెలిపారు. ఒక మహామనిషి కథను తెరకెక్కించే అవకాశం రావడం వరంగా భావిస్తున్నానని దర్శకుడు చెప్పారు. జయసుధ, రమ్యకృష్ణ, రోజా, కవిత ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కొండలరావు, మాటలు: అనిల్ నాని, కెమెరా: శివరామిరెడ్డి, కూర్పు: వేణు, సంగీతం: అర్జున్, నిర్మాణం: సత్యదేవా ఆర్ట్ ప్రొడక్షన్స్.