జయలలితకు కొడుకు ఉన్నాడా?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఓ కొడుకు ఉన్నాడా? ఆమె ఆస్తులన్నింటికీ అతడే వారసుడా? అమ్మ మరణించిన ఇన్నాళ్ల తర్వాత.. ఇప్పుడు తానే ఆమె కొడుకునంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చారు. తన తల్లిని శశికళే చంపేశారని.. అమ్మ ఆస్తులన్నింటికీ తానే అసలైన వారసుడినని చెప్పారు. గత సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత.. 72 రోజుల తర్వాత డిసెంబర్ 5న మరణించారు. దాంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పన్నీర్ సెల్వం, శశికళ, దీప వర్గాల మధ్య అధికారం కోసం తీవ్రస్థాయిలో పోరాటం జరగడం, మధ్యలో శశికళ జైలుకు వెళ్లడం, చివరకు ఆమె వర్గానికే చెందిన ఎడప్పాడి పళనిస్వామి సీఎం పదవి చేపట్టడం తెలిసిందే.
కొత్త కొడుకు ఎవరు?
చెన్నైలోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి.. జయలలితకు తానే అసలైన కొడుకునని, తన తల్లిని హత్య చేశారని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తాను జయలలిత స్నేహితురాలు వనితామణి ఇంట్లో తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో కలిసి ఉంటానని అందులో చెప్పారు. తాను 2016 సెప్టెంబర్ 14వ తేదీన చివరిసారిగా జయలలితను పోయెస్ గార్డెన్స్‌లో కలిశానని, అప్పుడు అక్కడే నాలుగు రోజులు ఉన్నానని తెలిపారు. తనను సొంత కొడుకుగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అమ్మ అనుకున్నారని.. అయితే ఈ విషయం శశికళకు తెలియడంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని అన్నారు. సెప్టెంబర్ 22న ఇదే వివాదంలో శశికళ తన తల్లి జయలలితను మేడ మెట్ల నుంచి తోసేసి ఆమెను చంపేశారని తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఇన్నాళ్లూ ఎందుకు మౌనం?
ఇవన్నీ బయటపెడితే తన ప్రాణానికి ముప్పు ఉంటుందన్న భయంతోనే తాను ఇన్నాళ్లూ మౌనంగా ఊరుకున్నానని, కానీ చివరకు ఎలాగోలా వాస్తవాలను బయటపెట్టాలన్న ధైర్యాన్ని కూడగట్టుకున్నానని కృష్ణమూర్తి చెప్పారు. జయలలితకు ఏకైక కొడుకును తానే కావడంతో.. ఆమె ఆస్తులన్నింటికీ కూడా తానే వారసుడినని ఆయన ప్రకటించుకున్నారు. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామికి ఈ విషయమై కృష్ణమూర్తి ఓ లేఖ రాశారని తెలుస్తోంది. ఆయన సలహా మేరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారంటున్నారు. మొత్తమ్మీద జయలలిత మృతి విషయం మాత్రం ఇప్పటికీ ఇంకా జనం నోళ్లలో ఏదో ఒక పేరుతో నానుతూనే ఉంది.