జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి శంకుస్థాపన
సంగారెడ్డి: మన ప్రభుత్వం, మన పాలనలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది శివారులో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 20 కోట్లతో విశ్వవిద్యాలయ భవనంతోపాటు బాలుర, బాలికల హాస్టళ్ల భవనాలు నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ యూనివర్సిటీ నిర్మాణం పూర్తయితే తెలంగాణ విద్యార్థులకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడా నిధులు కేటాయించకపోవడంతో తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
బాపట్ల, పులివెందులలో వ్యవసాయ కళాశాలలు స్థాపించిన ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతానికి మాత్రం తీరని అన్యాయం చేశారన్నారు. అందువల్లే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ అధిక నిధులను కేటాయిస్తున్నారని చెప్పారు. త్వరలోనే నిజామాబాద్, సిద్దిపేట తోర్నాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.