సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
పెదమిడిసిలేరు (చర్ల): సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆయన శుక్రవారం కిసాన్ సభ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి(రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్)తో కలిసి చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్, కుడి ఎడమ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలను పరిశీలించారు.
అనంతరం, విలేకరులతో ఆయన మాట్లాతడుతూ... వీటి నిర్వహణకు వందలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అయినప్పటికీ మరమతులు పనులు సక్రమంగా సాగడం లేదని, ఫలితంగా సాగు భూములకు పూర్తిస్థాయిలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆత్యహత్యను ఆశ్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాలిపేరు ఆధునికీకరణ పనుల కోసం జపాన్ బ్యాంక్ ఐదేళ్ల క్రితం 42కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, మూడేళ్లలో పూర్తికావాల్సిన ఆ పనులను కాంట్రాక్టర్ ఇప్పటికీ పూర్తి చేయలేదని అన్నారు.
అధికారుల పర్యవేక్షణ లేనందునే ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తాలిపేరు ప్రాజెక్టులో పూడికను తొలగించి, ప్రాజెక్ట్ ఎత్తును పెంచడం ద్వారా ప్రస్తుతం సాగు విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 24,700 నుంచి దాదాపు 50వేల ఎకరాలకు పెంచవచ్చని, సునాయాసంగా రెండు పంటలు వేసుకోవచ్చని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్ట్ వద్ద విద్యుదీకరణకు 25లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ప్రస్తుతం అక్కడ ఒక్క లైటు కూడా వెలగడం లేదని అన్నారు.
కిసాన్ సభ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగంపై కేసీఆర్ ప్రభుత్వ తీవ్ర వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం 2004 నుంచి వందల కోట్ల రూపాయలను ప్రభుత్వాలు ఖర్చు చేసినప్పటికీ రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్టు చెప్పారు.
ఈ క్యాక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి సంజీవరెడ్డి, భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు యలమంచి రవికుమార్ కార్యదర్శి బీబీజీ తిలక్, తాలిపేరు ప్రాజెక్ట్ ఆయకట్టు కమిటీ మాజీ అధ్యక్షుడు సాగె శ్రీనివాసరాజు, దుమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యుడు సత్యాలు తదితరులు పాల్గొన్నారు.