breaking news
jayadeer thirumala rao
-
వంద పూలై విరిసే జ్ఞాపకాలు!
జ్ఞాపకాలు గతం ఇనప్పెట్టెలో భద్రంగా ఉంటాయి. దాని మూత తీయాలని అనుకున్నప్పటి నుండి మానసిక వైబ్రేషన్‌కు గురవుతాం. చిన్ననాటి స్మృతులు ముసురుకుంటాయి. సాధారణంగా పదేళ్ళ వరకు బాల్యదశ ఉంటుంది. ఈ స్లాట్ మనిషికి స్వర్ణయుగం. ప్రతిక్షణం కుటుంబంలో, సమాజంలో, వీధిలో, ఊరిలో, బడిలో, పక్కింట్లో ప్రతిచోట ప్రతి అనుభవం గుండె గోడలమీద బొమ్మ కడుతుంది. నలుపు తెలుపు రంగుల్లో సినిమా రీల్‌లాగా గర్గర్ మని ఒక్కో సంఘటన మనసు తెర మీద కదలాడుతుంది.ఒక పండగని జ్ఞాపకం అయితే మరింత సంబరం. పూలదొంతర అల్లాలంటే ఒళ్ళంతా పులకరింతే. గత పరిమళాల జల్లుల్లో తడిసి ముద్దవడమే. బతుకమ్మ పండుగ రంగుల హరివిల్లుల్ని తెంపి వెన్నెల్లో ఆరేసి, వర్షంలో తడిసిన మట్టి సుగంధాలలో నానబెట్టి, కొత్త రంగురంగుల కాంతి తరంగాలని వాటికి పట్టించి నూటొక్క మొగ్గల్ని, పూలని, ఆకుల్ని తొడిగిన పూగుత్తుల్ని పేర్చాలంటే అంత సులభం కాదు. ఇలాంటప్పుడే గత అవిస్మృత ఖజానా విలువ తెలుస్తుంది. పూలను పరిరక్షించే ఇనప్పెట్టె తయారు కానందుకు బాధ. పుప్పొడిలా రాలిన కనబడని కన్నీటి తుంపరల్ని ఎలా, ఎక్కడని దాచగలం.మాది ఊరు కాని ఊరు. పట్టణంలో ఒదిగి ఉన్న ఊరు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ. మా ఇంటి చుట్టూరా అనేకానేక చిన్నా పెద్దా ప్రాచీన గుళ్ళు, చారిత్రక ప్రదేశాలు. ఇంటికి కాస్త దూరంలో మూడు పెద్ద గుట్టల మధ్య పద్మాక్షి గుడి. గుడి కింద నీటి గుండం. అందులో బంగారు జింక ఆకర్షణలా తామరాకులు, పూలు! గుట్టల మీద సీతా ఫలాలే కాదు, ఎన్నో రకాల పూలు, గునుగు పూలు, తంగేడు, గన్నేరు పూలు... ఎన్నెన్నో.మా ఇంట్లో నాకన్నా చిన్నది చెల్లెలు. ఇంటిపక్కన పాటకుల ఇంట్లో ఓ చిట్టెమ్మ. ఇంటి పక్కల చుట్టాలు, పరిచయస్తుల ఇళ్ళల్లో ఆడపిల్లలు. వీళ్లు బొడ్డెమ్మ ఆడేవాళ్లు.భాద్రపదం ప్రకృతి పచ్చదనానికి గర్భ శిశువు. ఈ మాసం ప్రకృతి పరవశించే నిండు చూలాలు. బొడ్డెమ్మ వస్తుందంటేనే పూలవేట షురువయ్యేది. ఆడపిల్లల్ని బొడ్డి అంటారు. బొడ్డి అంటే చిన్నది అని అర్థం. ఈ ఆడపిల్లలు ఆడే బొడ్డెమ్మ ఒక ప్రత్యేక పండగ. ఎవరి ఇంట్లోనూ పదిమంది ఆడే ఆట స్థలం ఉండేది కాదు. గుడిలోనో, ఏదో ఓక బహిరంగ ప్రదేశంలోనో వాళ్ళు వెదురుతో చేసిన చిన్న చిన్న సిబ్బుల్లో పూలు పట్టుకుని అక్కడికి చేరేవారు. అక్కడ కుమ్మరాయన మట్టితో బొడ్డెమ్మ గద్దె తయారు చేసేవాడు. కిందివైపు పెద్దగా పైవైపు చిన్న ఆకారంతో మట్టితో చతురస్రాకారంతో గద్దె కట్టేవాడు. దానికి నాలుగు దిక్కులా ప్రమిదలు పెట్టేవాడు. దానిలో రోజుకొక్కరు 9 రోజులు 9 ఇళ్ళలోంచి నూనె తెచ్చేవారు. దాని చుట్టూ రోజూ కొత్తగా ముగ్గులు వేసేవారు.ఈ పనంతా బాలికలే చేసేవారు. ఊరి వడ్రంగి కర్రతో బొడ్డెమ్మ గద్దె చేసి ఇచ్చేవాడు. దానికి పసుపు, తెలుపు రంగులు వేసేవారు. దానిమీద కూడా ప్రమిదలు ఉండేవి. మధ్యలో పిల్ల బతుకమ్మని చెక్కేవాడు. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని డెబ్బై ఐదేళ్ల తర్వాత అలాంటి కర్ర బొడ్డెమ్మ వస్తువుని ఆద్యకళ మ్యూజియం కోసం సేకరించాను. మగపిల్లల టీం మహాలయ అమావాస్య నాడు ప్రారంభమయ్యే బతుకమ్మ కోసం సంచులు పట్టుకుని పూలవేటకు వెళ్ళేవారం. గునుగు పూలు తెచ్చి రకరకాల రంగులద్దేవాళ్ళం. తంగేడు పూలు, ఆకులు, కొమ్మలతో తెంపేవాళ్ళం. ఇంటికి వచ్చి పూలను వేరు చేసేవాళ్ళం. జలాశయాల్లోంచి తెచ్చిన తామర ఆకుల్ని సిబ్బుల కింద ఉంచేవాళ్ళు. కొంతమంది ఎర్రని తామరపూవుని పైన అలంకరించేవాళ్ళు. పై భాగాన పసుపు ముద్ద పెట్టి గౌరమ్మ తల్లిగా సంభావించేవారు. మరికొందరు గుమ్మడి ఆకుల్ని సిబ్బులో పరిచి బతుకమ్మ పైన గుమ్మడిపూవుని ఉంచేవారు. పూవు మధ్య భాగం కేసరాలు ఉండేచోట పసుపు రంగు ఉండేది. దాన్నే గౌరమ్మగా భావించేవారు. మేం ఇంత కష్టపడితే మాకు దక్కేది ఆట పాటల తర్వాత అక్కలు, అమ్మలు పెట్టే ప్రసాదం. రోజుకో తీరొక్క ప్రసాదం. ఇంటికోరకం ప్రసాదం తెచ్చి అన్నీ ఒక్కో గంపలో వేసి వాళ్లు తిని మాకు పెట్టేవారు. ఆ రుచే వేరు. తలుచుకుంటేనే నోరూరుతుంది. బొడ్డెమ్మ, బతుకమ్మలను తలకెక్కించుకునే సందర్భంలో ఆకులతో చేసిన పీకలు ఊదేవాళ్ళం. మరికొందరి దగ్గర కర్రతో చేసిన గొట్టం ఉండేది. ఎండిన గింజల్నో, కాగితం తుంచి దాన్ని నమిలి చేసిన ముద్దనో కర్ర బర్మారులో పెట్టి బాగా ఊదేవాళ్లం. అది పిస్తోలు పేల్చినట్లు శబ్దం అయ్యేది. ఎవరి శబ్దం పెద్దగా ఉంటే వారిపై ప్రశంసల పూల జల్లు పడేది. అలా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం కొనసాగేది. ఆరో రోజు అరెం. అంటే ఆరోజు బతుకమ్మ పేర్చరు. సెలవుదినం. ఆట ఉండదు. మాకు కూడా కాస్త తీరిక దొరికేది. కాకపోతే బతుకమ్మ ప్రసాదం దొరికేది కాదు. పండుగ తొమ్మిది రోజులు చాలా ఇండ్లల్లో శాకాహారమే ఉండేది. కొత్త ధాన్యంతో, పప్పులతో తయారు చేసిన రుచి ఈనాటికీ గుర్తు చేసుకుంటే నోరూరుతుంది. బతుకమ్మ తొమ్మిది రోజులు ఆట పాటలతో గడిచేది. అక్కలు, చెల్లెల్లు, కోడళ్ళు, మరదళ్లతో సందడిగా గడిపిన క్షణాలు ఈ తరాలకు దక్కని మహోత్కృష్ట గడియలు.బతుకమ్మలనే కాదు ఇంటిని, ఇంటి పరిసరాల్ని శుభ్రపరిచి అలంకరించేవారు. ఇళ్ళు ముందు భాగం ముగ్గులు రంగులతో మెరిసిపోయేవి. వివిధ రకాల పూలు ఒక్కచోట ఉంచడం వల్ల చక్కని సువాసనలతో ఆ ప్రదేశం ఎంతో బాగుండేది. బతుకమ్మలపై కొందరు అగరుబత్తీలు పెట్టేవారు. చాలా కాలం దాచిపెట్టి పండుగ రోజున కట్టుకునే పీతాంబరం, పాత చీరల ప్రత్యేక వాసన ఇంకా పీల్చుతున్నట్లే ఉంటుంది. రోజూ అలికిన తాజా వాసన సైతం పండగ ప్రత్యేకతని చెప్పకనే చెప్పేది.బాలికల గుంపు చిన్న మగపిల్లగాళ్ల గుంపు, యువతుల గుంపు, తల్లుల గుంపు, అమ్మమ్మ నానమ్మల గుంపు ఇలా ఎవరి గుంపు వారిదే. ఎవరి స్నేహితులతో వారు కలిసిమెలసి ఉండేవారు. హాస్యం వందపూలై పూసేది. సామెతలతో సంభాషణ నవరసాలతో ఆకట్టుకునేది. వరసలను బట్టి హాస్యం, చతురోక్తులు ఉండేవి. ఇది పండుగ సంబరాన్ని మరింత పెంచేది. ఊరు ఊరంతా గాన ప్రవాహంలో ఈదేది. చెరువు గట్టో, నీటి గుండాల పక్కనో వాళ్ల నృత్యంతో భూమి పులకరించేది. సంధ్యాసమయంలో ప్రకృతిని చూసి మా ఒడలు పులకరించేది. నాడు బతుకమ్మ ప్రకృతి పండుగ. నా జ్ఞాపకాలలో ఆనాటి ప్రాకృతిక సౌందర్యం చూడడం కోసం ఊరూ, వాడా, అడవీ, పల్లె తిరుగుతూనే ఉన్నాను. ఏదో తెలియని శూన్యం. నా జీవితకాలం అంతా పద్మాక్షి గుట్ట కింద నీటి గుండంలోని తామర పూవుల సువాసన ఇంకా వెన్నాడుతోంది. కొండమీది గోగుపూలు రమ్మని చేతులు చాస్తున్నాయి. పండిన సీతాఫలాల సువాసన, రుచి, బతుకమ్మ ప్రసాదాలు తిన్నాక చాలా గంటల వరకు చేతికంటిన కమ్మని సువాసన కోసం మళ్లీ బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపు! స్త్రీలు పాడే పాటలు చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బతుకమ్మ పేర్పులోని నేర్పు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళ కళాత్మక భావనల్నిచూసి వారిపై ఎనలేని ప్రేమ, గౌరవం కలిగేది. ఊరు ఊరంతా ఒక్కటై చేసుకునే పండుగ పట్ల గౌరవం ఇనుమడించేది. పండుగ కాలంలో స్త్రీలు మిగతా వాళ్ళని గౌరవంగా చూసేవాళ్ళు. అందరూ సమానమే. ఎందుకంటే అందరూ సుమంగళులే. అంటే గర్భం ధరించి పిల్లల్ని కనగలిగే అర్హత ఉన్నవాళ్ళే. వాళ్లే బతుకమ్మ ఆడాలి. వాయనాలు పెట్టుకోవాలి.– జయధీర్ తిరుమలరావు -
అక్షరం.. ప్రజల దిక్కు!
కవులు, రచయితలు ప్రజల పక్షం రాష్ట్ర ఏర్పాటులో ‘అక్షరా’నికీ భాగస్వామ్యం సీరియస్ రచయితలను సర్కారే గుర్తించాలి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో ఆచార్య జయధీర్ తిరుమలరావు (హన్మకొండ కల్చరల్) వృత్తి కళాకారుల పక్షాన ఆయన ‘జానపద’మై నిలిచారు. కనుమరుగైపోతోన్న అమూల్య గ్రంథాలు, తాళపత్రాలకు పెద్దదిక్కయ్యారు. యాభై ఏళ్లుగా అక్షరాల సేద్యం.. నిరంతరాయంగా సాహిత్యం, సాంస్కృతికోద్యమం.. ఇదే ఆచార్య జయధీర్ తిరుమలరావు జీవనపథం.. తెలంగాణకు ప్రత్యేక సాహిత్య, సాంస్కృతిక అస్తిత్వం ఉందని బలంగా చెప్పే ఆచార్య తిరుమలరావు ఓరుగల్లులో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, ప్రచురణల శాఖ డెరైక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ప్రాచ్యలిఖిత భాండాగారం డెరైక్టర్‌గా ఉన్న సమయంలో అమూల్య గ్రంథాలను, తాళపత్రాలను సేకరించి భద్రపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన జానపద కళాకారులు, కళల పరిరక్షణ కోసం ‘జానపద’ను స్థాపించారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఆయన.. రాష్ర్ట ఆవిర్భావం తరువాత కవులు, రచయితలపై బాధ్యత పెరిగిందని అంటారు. రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే.. ప్రజలకు జవాబుదారీ.. ‘తెరవే’ తెలంగాణ రచయితల వేదిక (తెరవే) పదహారేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ లక్ష్యంగానే ఇది ఆవిర్భవించింది. రాష్ట్ర సాధనలో రచయితల పాత్ర అమోఘం. అరసం, విరసంతో పాటు రాజకీయ ఎజెండాతో పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. కానీ ప్రాంతీయ స్పృహతో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో ఏర్పడిన సంస్థ తెరవే మాత్రమే. ప్రస్తుతం కొన్ని సంస్థలు రాజకీయ ప్రాపకం, ప్రాబల్యం కోసం ‘పాటుపడు’తున్నాయి. మేం మాత్రం ఎప్పటికీ ప్రజలకు జవాబుదారీగానే ఉంటాం. ప్రభుత్వమే గుర్తించాలి.. కళాకారులకు ఉద్యోగాలిచ్చారు. కానీ, రాసే కవికి మాత్రం న్యాయం జరగలేదు. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనడం అన్యాయం. సీరియస్, సిన్సియర్ రచయితలను ప్రభుత్వమే గుర్తించాలి. రచయితకు లభించే గుర్తింపు, సహాయం రచయిత వ్యక్తిత్వాన్ని పెంచేదిగా ఉండాలి. రచయితలను ప్రచారకులుగా భావించే పరిస్థితి పోవాలి. ప్రస్తుతం సీరియస్ రచయితలు చాలా ‘అసౌకర్యం’ ఫీలవుతున్నారు. రచయితలకు ఇచ్చే ఆర్థిక సహా యాన్ని పెంచాలని చాలా కాలంగా అడుగుతున్నాం. రెండే ళ్లు గడిచిన సందర్భంలో మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రజల మన్ననలే ముఖ్యం.. సాహిత్యం, రచయిత పాత్ర విస్తరించాలి. పాత నమూనాలు పనికిరావు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలతో మమేకమై రాయాలి. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులు, రచయితలను గుర్తించి అవార్డులివ్వాలి. కానీ, ప్రభుత్వంతో సన్మానాలు, పురస్కారాలు పొందడం మాకంత ముఖ్యం కాదు. రచయితలు ప్రజల అవసరాలు తీర్చేలా అక్షరాలు రాసి ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే పాత్ర పోసిస్తూ ప్రజల మన్నన పొందడమే ముఖ్యం. ఏవిధంగానూ సాహిత్య గౌరవాన్ని పోగొట్టకూడదు. ప్రభుత్వం, ప్రభుత్వ అవార్డులు ఆశించే వారు.. ఇద్దరూ కూడా రచయితల గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించవద్దు. వారిని కాపాడుకోవడం పౌరధర్మం పేద రచయితలు అనారోగ్యానికి గురైనప్పుడు సమాజమే వారిని రక్షించుకోవాలి. వారిని కాపాడుకోవడం పౌరధర్మంగా భావించాలి. సుద్దాల హనుమంతుకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి, దవాఖానాకు తీసుకువెళ్తామని మేం అంటే- ‘ఇప్పటి వరకు మా ఇంట్లో ఉన్నది తిని బతికాం. దవాఖానకు వెళ్తే ఇంట్లో ఉన్న సామాను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అక్కడకు రాను’ అన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా నేటికీ పేద రచయితలు, కవుల గురించి ఎలాంటి విధాన నిర్ణయమూ జరగలేదు. సాహిత్యంలోనూ డబ్బున్న వాళ్లే రాణించే పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పెంచాలి.. అవార్డుల కోసం పైరవీలు చేసేవారు ఒకవైపు.. అవార్డులు కాదు.. ప్రజల పక్షానే ఉంటామనే వారు మరోవైపు.. ఇందులో ప్రయోజనాలదే పెద్దపీట. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పోయే పరిస్థితి ఏర్పడకూడదు. రచయితలకు ప్రభుత్వం సహకరిం చాలి. పుస్తకాలు అచ్చు వేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. పది జిల్లాల్లో గ్రంథాలయాల ద్వారా పుస్తకాలను కొనుగోలు చేయాలి. రచయితల కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సీరియస్‌గా అధ్యయనం చేసి, సూచనలు చేసే కవులను, రచనలను గుర్తించాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రచయితలకు గౌరవం ఎక్కువ అనే మాట వినపడాలి. స్వేచ్ఛను హరించొద్దు.. సభలు, సమావేశాలకు ఇతర కారణాలను చూసి అనుమతులు ఇవ్వకపోవడం, ఆంక్షలు విధించడం సరి కాదు. వరంగల్ సభ విషయంలో న్యాయస్థానం కూడా సరైన పాత్ర నిర్వహించ లేదు. ఎవరు ఏ రూపంలోనైనా సరే.. స్వేచ్ఛను హరించడాన్ని మేం నిరాకరిస్తాం. రచయితలుగా, కవులుగా మేం సంస్కారవంతమైన భాషలోనే మాట్లాడతాం. రాష్ట్ర సాధనలో ‘అక్షర’ భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విజయంలో అక్షరాలకు నిండైన భాగస్వామ్యం ఉంది. ఇప్పు డు రకరకాల పండుగలు చేస్తున్నారు. రచయితలను సమాజానికి దూరం చేయాలని కొందరు చూస్తున్నారు. అక్షర రంగం దానిని ప్రతిఘటిస్తుంది. ఈ ప్రభుత్వం మాది. మా లక్ష్యం.. సామాజిక క్రాంత దర్శనం సీమాంధ్ర పాలనలో పెడ ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్లం. ప్రస్తుతానికి ప్రభుత్వానికి హితవు చెప్పడం, వాస్తవాలు వివరించడం వంటివి మాత్రమే చేస్తున్నాం. రచయితలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుని నిలబడుతున్నారు. వారు సామాజిక వాస్తవాన్ని తమ ఆత్మవ్యక్తీకరణను అక్షరాలుగా పెట్టి సూచనలుగా అందిస్తున్నారు. సామాజిక క్రాంత దర్శనం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడమే అక్షరం కర్తవ్యం. రచయిత సామూహిక ఆలోచనల ప్రతినిధి.. ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ అవసరాల రీత్యా మాట్లాడుతాడు. వాటిలో ఎలిగేషన్స్ ఉంటాయి. కానీ, రచయిత చేసే పనిలో, రాసే రాతల్లో అవేవీ ఉండవు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను ఒక లాజిక్‌తో వివరించి చెబుతాడు. ఒక నినాదంగా కవి, రచయిత ప్రభుత్వాన్ని నేరగ్రస్తంగా చిత్రించాలని అనుకోరు. అది ఉద్దేశమై కూడా ఉండదు. రచయిత సామూహిక ఆలోచనలకు ప్రతినిధి. దానిని పది మంది తరఫున ప్రతిఫలిస్తాడు. అందులో నిజాయితీ ఉంటుంది.