అక్షరం.. ప్రజల దిక్కు! | aksharam...the direction of, the character of people- thirumalarao | Sakshi
Sakshi News home page

అక్షరం.. ప్రజల దిక్కు!

Published Wed, Jun 1 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

aksharam...the direction of, the character of people- thirumalarao

  •  కవులు, రచయితలు ప్రజల పక్షం
  •  రాష్ట్ర ఏర్పాటులో ‘అక్షరా’నికీ భాగస్వామ్యం
  •  సీరియస్ రచయితలను సర్కారే గుర్తించాలి
  •  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో ఆచార్య జయధీర్ తిరుమలరావు
     
  •  (హన్మకొండ కల్చరల్)
    వృత్తి కళాకారుల పక్షాన ఆయన ‘జానపద’మై నిలిచారు. కనుమరుగైపోతోన్న అమూల్య గ్రంథాలు, తాళపత్రాలకు పెద్దదిక్కయ్యారు. యాభై ఏళ్లుగా అక్షరాల సేద్యం.. నిరంతరాయంగా సాహిత్యం, సాంస్కృతికోద్యమం.. ఇదే ఆచార్య జయధీర్ తిరుమలరావు జీవనపథం.. తెలంగాణకు ప్రత్యేక సాహిత్య, సాంస్కృతిక అస్తిత్వం ఉందని బలంగా చెప్పే ఆచార్య తిరుమలరావు ఓరుగల్లులో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, ప్రచురణల శాఖ డెరైక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ప్రాచ్యలిఖిత భాండాగారం డెరైక్టర్‌గా ఉన్న సమయంలో అమూల్య గ్రంథాలను, తాళపత్రాలను సేకరించి భద్రపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన జానపద కళాకారులు, కళల పరిరక్షణ కోసం ‘జానపద’ను స్థాపించారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఆయన.. రాష్ర్ట ఆవిర్భావం తరువాత కవులు, రచయితలపై బాధ్యత పెరిగిందని అంటారు. రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే..
     
     ప్రజలకు జవాబుదారీ.. ‘తెరవే’
     తెలంగాణ రచయితల వేదిక (తెరవే) పదహారేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ లక్ష్యంగానే ఇది ఆవిర్భవించింది. రాష్ట్ర సాధనలో రచయితల పాత్ర అమోఘం. అరసం, విరసంతో పాటు రాజకీయ ఎజెండాతో పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. కానీ ప్రాంతీయ స్పృహతో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో ఏర్పడిన సంస్థ తెరవే మాత్రమే. ప్రస్తుతం కొన్ని సంస్థలు రాజకీయ ప్రాపకం, ప్రాబల్యం కోసం ‘పాటుపడు’తున్నాయి. మేం మాత్రం ఎప్పటికీ ప్రజలకు జవాబుదారీగానే ఉంటాం.
     
     ప్రభుత్వమే గుర్తించాలి..

     కళాకారులకు ఉద్యోగాలిచ్చారు. కానీ, రాసే కవికి మాత్రం న్యాయం జరగలేదు. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనడం అన్యాయం. సీరియస్, సిన్సియర్ రచయితలను ప్రభుత్వమే గుర్తించాలి. రచయితకు లభించే గుర్తింపు, సహాయం రచయిత వ్యక్తిత్వాన్ని పెంచేదిగా ఉండాలి. రచయితలను ప్రచారకులుగా భావించే పరిస్థితి పోవాలి. ప్రస్తుతం సీరియస్ రచయితలు చాలా ‘అసౌకర్యం’ ఫీలవుతున్నారు. రచయితలకు ఇచ్చే ఆర్థిక సహా యాన్ని పెంచాలని చాలా కాలంగా అడుగుతున్నాం. రెండే ళ్లు గడిచిన సందర్భంలో మరోసారి గుర్తు చేస్తున్నాం.
     
     ప్రజల మన్ననలే ముఖ్యం..
     సాహిత్యం, రచయిత పాత్ర విస్తరించాలి. పాత నమూనాలు పనికిరావు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలతో మమేకమై రాయాలి. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులు, రచయితలను గుర్తించి అవార్డులివ్వాలి. కానీ, ప్రభుత్వంతో సన్మానాలు, పురస్కారాలు పొందడం మాకంత ముఖ్యం కాదు. రచయితలు ప్రజల అవసరాలు తీర్చేలా అక్షరాలు రాసి ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే పాత్ర పోసిస్తూ ప్రజల మన్నన పొందడమే ముఖ్యం. ఏవిధంగానూ సాహిత్య గౌరవాన్ని పోగొట్టకూడదు. ప్రభుత్వం, ప్రభుత్వ అవార్డులు ఆశించే వారు.. ఇద్దరూ కూడా రచయితల గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించవద్దు.
     
     వారిని కాపాడుకోవడం పౌరధర్మం
     పేద రచయితలు అనారోగ్యానికి గురైనప్పుడు సమాజమే వారిని రక్షించుకోవాలి. వారిని కాపాడుకోవడం పౌరధర్మంగా భావించాలి. సుద్దాల హనుమంతుకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి, దవాఖానాకు తీసుకువెళ్తామని మేం అంటే- ‘ఇప్పటి వరకు మా ఇంట్లో ఉన్నది తిని బతికాం. దవాఖానకు వెళ్తే ఇంట్లో ఉన్న సామాను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అక్కడకు రాను’ అన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా నేటికీ పేద రచయితలు, కవుల గురించి ఎలాంటి విధాన నిర్ణయమూ జరగలేదు. సాహిత్యంలోనూ డబ్బున్న వాళ్లే రాణించే పరిస్థితి ఉంది.
     
     కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పెంచాలి..
     అవార్డుల కోసం పైరవీలు చేసేవారు ఒకవైపు.. అవార్డులు కాదు.. ప్రజల పక్షానే ఉంటామనే వారు మరోవైపు.. ఇందులో ప్రయోజనాలదే పెద్దపీట. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పోయే పరిస్థితి ఏర్పడకూడదు. రచయితలకు ప్రభుత్వం సహకరిం చాలి. పుస్తకాలు అచ్చు వేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. పది జిల్లాల్లో గ్రంథాలయాల ద్వారా పుస్తకాలను కొనుగోలు చేయాలి. రచయితల కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సీరియస్‌గా అధ్యయనం చేసి, సూచనలు చేసే కవులను, రచనలను గుర్తించాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రచయితలకు గౌరవం ఎక్కువ అనే మాట వినపడాలి.
     
     స్వేచ్ఛను హరించొద్దు..

     సభలు, సమావేశాలకు ఇతర కారణాలను చూసి అనుమతులు ఇవ్వకపోవడం, ఆంక్షలు విధించడం సరి కాదు. వరంగల్ సభ విషయంలో న్యాయస్థానం కూడా సరైన పాత్ర నిర్వహించ లేదు. ఎవరు ఏ రూపంలోనైనా సరే.. స్వేచ్ఛను హరించడాన్ని మేం నిరాకరిస్తాం. రచయితలుగా, కవులుగా మేం సంస్కారవంతమైన భాషలోనే మాట్లాడతాం.
     
     రాష్ట్ర సాధనలో ‘అక్షర’ భాగస్వామ్యం
     తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విజయంలో అక్షరాలకు నిండైన భాగస్వామ్యం ఉంది. ఇప్పు డు రకరకాల పండుగలు చేస్తున్నారు. రచయితలను సమాజానికి దూరం చేయాలని కొందరు చూస్తున్నారు. అక్షర రంగం దానిని ప్రతిఘటిస్తుంది. ఈ ప్రభుత్వం మాది.
     
     మా లక్ష్యం.. సామాజిక క్రాంత దర్శనం

     సీమాంధ్ర పాలనలో పెడ ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్లం. ప్రస్తుతానికి ప్రభుత్వానికి హితవు చెప్పడం, వాస్తవాలు వివరించడం వంటివి మాత్రమే చేస్తున్నాం. రచయితలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుని నిలబడుతున్నారు. వారు సామాజిక వాస్తవాన్ని తమ ఆత్మవ్యక్తీకరణను అక్షరాలుగా పెట్టి సూచనలుగా అందిస్తున్నారు. సామాజిక క్రాంత దర్శనం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడమే అక్షరం కర్తవ్యం.
     
     రచయిత సామూహిక ఆలోచనల ప్రతినిధి..

     ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ అవసరాల రీత్యా మాట్లాడుతాడు. వాటిలో ఎలిగేషన్స్ ఉంటాయి. కానీ,  రచయిత చేసే పనిలో, రాసే రాతల్లో అవేవీ ఉండవు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను ఒక లాజిక్‌తో వివరించి చెబుతాడు. ఒక నినాదంగా కవి, రచయిత ప్రభుత్వాన్ని నేరగ్రస్తంగా చిత్రించాలని అనుకోరు. అది ఉద్దేశమై కూడా ఉండదు. రచయిత సామూహిక ఆలోచనలకు ప్రతినిధి. దానిని పది మంది తరఫున ప్రతిఫలిస్తాడు. అందులో నిజాయితీ ఉంటుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement