'అమ్మా నువ్వు మాకు కావాలి'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపాలైన నాటి ముగ్గురు ఫ్యాన్స్ ఆసుపత్రి ఎదుటే ఉంటున్నారు. అమ్మకు తొందరగా నయం కావాలని దేవుడిని పూజిస్తున్నారు. అపోలో ఆసుపత్రి వద్దే ఉంటున్న కొందరు అమ్మ అభిమానుల మనోగతాలు చూద్దాం.
మొదురమ్ పొన్నుస్వామి
ఈయనది చెన్నై నుంచి 10గంటలపాటు నిర్విరామంగా ప్రయాణిస్తే కాని చేరుకోలేని చిన్న పల్లెటూరు. తమిళంలో మొదురమ్ అంటే ఉంగరపు వేళ్లు అని అర్ధం. అందుకు తగ్గట్టుగానే ఆయన వేళ్లకి ఉన్న రెండు పెద్ద ఉంగరాల్లోని ఒక దానిలో అమ్మ ఫోటో, మరో ఉంగరంలో ఎంజీఆర్ ఫోటో ఉన్నాయి. ఈయన అమ్మ వీరాభిమాని అని చెప్పుకోవడానికి ఇది ఒక్కటి చాలు. కానీ, పొన్నుస్వామికి అమ్మ అంతకంటే ఎక్కువ. మెడలోని గొలుసులో అమ్మ ఫోటో, ఫోన్ రింగ్ టోన్ ఎంజేఆర్ పాట కూడా అన్నాడీఎంకే అంటే ఎంత మమకారమో తెలుపుతున్నాయి.
పొన్నుస్వామిని ఓ సారి పలకరించగా.. ఎంజేఆర్ కు జబ్బు చేసినప్పుడు తాను పాదయాత్ర చేసినట్లు చెప్పారు. గుడి, మసీదు, చర్చి అనే పరమత భేదాలు లేకుండా అందరి దేవుళ్లను దర్శించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అమెరికా నుంచి ఎంజేఆర్ తిరిగి వచ్చి మళ్లీ పాలించాడని చెప్పారు. అమ్మ కూడా అలానే తిరివస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు.
ఎంజీఆర్ వెంకటేశన్
అమ్మ అనారోగ్యం కారణంగా తల్లడిల్లుతున్న హృదయాల్లో వెంకటేశన్ కూడా ఒకరు. ఎంజీఆర్ అనే పదాన్ని తన పేరు ముందు తానే చేర్చుకున్నట్లు వెంకటేశన్ చెప్పారు. తనను గుర్తించడానికి ఇంతకంటే ఏం అవసరం లేదని అన్నారు. అమ్మకు కలలో కూడా ఏం కాదని చెప్పారు. కనిపిస్తూ మాట్లాడే దేవత అమ్మ అని పేర్కొన్నారు. మాకు ఆమెను చూడాలని ఉంది. కానీ ఇప్పుడు అది సాధ్యపడకపోవచ్చు. ఆమె ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకున్న మేం వేచి చూస్తామని చెప్పారు.
జే మరిముత్తు
సాధారణంగా నువ్వేం చేస్తుంటావు అంటే ఆ కంపెనీలో పనిచేస్తున్నాననో లేదా వ్యాపారం చేసుకుంటున్నాననో చెబుతువుంటారు. జే మరిముత్తు ఏం చెబుతారో తెలుసా. నేను పూజిస్తుంటాను. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నా దేవత అని. తమిళ సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటిపేరును తనయులు తన ముందుపేరుగా పెట్టుకుంటారు. కానీ మరిముత్తు మాత్రం జయలలిత పేరులో మొదటి అక్షరం 'జే'ను తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.
ఎలాంటి ప్రమాదం లేకుండా అమ్మ తిరిగి వస్తారని మరిముత్తు చెబుతున్నారు. తన ఒక్కడి కోసం కాకపోయినా, తన లాంటి వందలాది మంది కోసం ఆమె తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మ లేకపోతే మేం జీవించడం అర్ధం లేదని ఆవేదన చెందారు.
తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి వివాదం రగులుతున్నా బెంగుళూరులోని అమ్మ అభిమానులు చెన్నైకు వందలాదిగా తరలివస్తున్నారు. అమ్మ మాత్రమే సమస్యకు పరిష్కారం చూపించగలదని చెబుతున్నారు. తమ వాహనాలకు అమ్మ ఫోటోలు, బ్యానర్లు కట్టుకుని అమ్మ కచ్చితంగా తిరిగి వస్తారని తమకు నమ్మకం ఉందని అంటున్నారు.