
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇంట్లో ఆదాయపు పన్నుల శాఖ నిర్వహించిన సోదాలతో ఆమె అభిమానులు భగ్గుమన్నారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ లక్ష్యంగా ఆమె బంధుమిత్రుల ఇళ్లపై దాడులు చేస్తున్న ఐటీ అధికారులు... శుక్రవారం వేద నిలయంలో సైతం సోదాలు నిర్వహించారు. సోదాలను నిరసించిన జయ అభిమానులు... బీజేపీ నశించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీవ్ర నిరసన తెలిపారు.
వేద నిలయాన్ని ‘అమ్మ’ స్మారక మందిరంగా ఏర్పాటు చేయనున్న తరుణంలో ఈ దాడులేంటని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంపై మండిపడ్డారు. ఆందోళనకు దిగిన సుమారు 650 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని సీఎం చెప్పారు. శశికళ కుటుంబం పన్నిన కుట్రతోనే ఈ దాడులు జరిగాయనీ, జయలలిత మరణంలో వారి పాత్రపై సీబీఐ విచారణ జరపాలని జయ మేనకోడలు దీప డిమాండ్ చేశారు.
వేద నిలయంలో తాజా ఐటీ సోదాలకు శశికళ కుటుంబమే కారణమని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. జయలలితకు చికిత్సపై తన వద్ద వీడియో ఉందని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రకటించడం, ‘అమ్మ’ మరణం వెనుక మర్మంపై ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిన నేపథ్యంలో తగు ఆధారాల కోసం ఐటీ శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలి ఐటీ దాడుల నేపథ్యంలో కొన్ని సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నందునే జయ నివాసంలో తనిఖీలు చేశామని ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment