అప్పీలుకు రెడీ
కర్ణాటక ప్రభుత్వం మళ్లీ కళ్లు తెరిచింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈనెల 22వ తేదీన అప్పీలుకు వెళ్లేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ వివరాలను కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య శనివారం వెల్లడించారు. ఆర్కేనగర్ పోలింగ్‌కు మరో వారం రోజులుండగా అప్పీలు ప్రకటన వెలువడడం అమ్మ శిబిరంలో కలకలం రేపింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు, కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు కలుపుకుని 18 ఏళ్లపాటు నడిచిన ఆస్తుల కేసులో జయను దోషిగా పేర్కొంటూ గత ఏడాది తీర్పువెలువడింది. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా పడింది. కర్ణాటక హైకోర్టుకు జయ అప్పీలు చేసుకోగా రెండునెలల పాటు విచారణ సాగిన తరువాత కోర్టు జయను నిర్దోషిగా తీర్పుచెప్పింది. అధికార పీఠానికి మార్గం సుగమం కావడంతో జయ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నిక య్యేందుకు ఆర్కేనగర్ ఉప ఎన్నికను రంగంపైకి తెచ్చారు. ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఆర్కేనగర్ ఎన్నికలను బహిష్కరించగా, కేవలం సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచారు. జయ గెలుపు నల్లేరుపై నడకైనా రికార్డు మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో అన్నాడీఎంకే అగ్రనేతలు, మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన పోలింగ్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది పీవీ ఆచార్య అప్పీలుపై మళ్లీ గళం విప్పారు.
కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆచార్య తాజా తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలంటూ తన ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చారు. ఆస్తుల లెక్కలు కట్టడంలో కొన్ని పొరపాట్లు దొర్లాయంటూ ఆచార్య ఆది నుంచి వాదిస్తున్నారు. అప్పీలుకు సిద్ధమైనట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండువారాల క్రితం ప్రకటించారు. అదంతా ఉట్టి నిర్ణయమే, అప్పీలుకు వెళ్లరని అందరూ భావించారు. అయితే, ఈనెల 22వ తేదీన సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఆచార్య అకస్మాత్తుగా ప్రకటించారు. అప్పీలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. ఈ మేరకు బెంగళూరు మీడియాకు ఆయన వివరాలను తెలియజేశారు. జూలై మొదటి వారం నుంచే అప్పీలుపై విచారణ ప్రారంభమవుతుందని చెప్పడం రాజకీయవర్గాలను ఆలోచనలో పడేసింది.