Jayalalithaa Baahubali poster
-
‘చెన్నై శివగామి’లా సీఎం..!
* భారీ వరద నీటి మధ్య చిన్నారిని ఎత్తుకుని.. * విమర్శలకు తావిస్తున్న హోర్డింగ్ సాక్షి, చెన్నై : బాహుబలి సినిమా సినిమా (తమిళ వెర్షన్లో మహాబలి) గుర్తుందా!? ఆ చిత్రంలోని కీలకమైన పాత్రల్లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఒకటి. నదిలో తాను పూర్తిగా మునిగిపోయినా పసికందుగా ఉన్న బాహుబలిని ఒంటి చేత్తో నీళ్లలోంచి పెకైత్తి పట్టుకుని నదిని దాటుతున్న సన్నివేశం సినిమాను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఎంతో కీలకమైనదే. సినిమా విడుదలకు ముందు ఈ సన్నివేశంతో వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడమే కాకుండా సినిమాపై అంచనాలనూ పెంచింది. విడుదల తర్వాత ఎంతగా బాక్సాఫీసును షేక్ చేసి, రికార్డులు కొల్లగొట్టిందో ఇక చెప్పనవసరం లేదు. ఈ సన్నివేశం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముఖ్యమంత్రి జయలలిత అదే సన్నివేశంలో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. ఆ సన్నివేశాన్ని ప్రతిబింబించేలా అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అధినేత్రిని ఏకంగా ‘చెన్నై శివగామి’ని చేశారు.! భారీ వరద నీటి మధ్య జయలలిత తన చేతుల్లో చిన్నారిని ఎత్తుకున్నట్లు చూపుతూ చెన్నై వీధుల్లో పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇది వివాదాస్పదమైంది. ఓ వైపు చెన్నై నగరం వరద నీటిలో మునిగిపోతుంటే.. ‘చెన్నైని కాపాడే అమ్మ’ అంటూ బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలా హోర్డింగ్ ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు వరదల్లో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే, వారిని పట్టించుకోకుండా ప్రచారం కోసం ఇలాంటి చర్యలు అవసరమా? అని విపక్షాలు మండిపడుతున్నాయి. -
అమ్మా, ది గ్రేట్ బాహుబలి
చెన్నై: కుండపోత వర్షాలకు చెన్నై నగరమంతా కకావికలమై ప్రజలు అహోరాత్రులు కూడు, గూడు లేకుండా అల్లాడిపోతుంటే కార్యరంగంలోకి దూకి సహాయక చర్యల్లో తలమునకలు కావాల్సిన అధికార ఏఐడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు అమ్మ జపంలో తరించిపోతున్నారు. నీట మునిగి పోతున్న ప్రజలను అమ్మ మాత్రమే కాపాడుతోందన్న అర్థంలో పోస్టర్లు వేసి గురుభక్తిని చాటుకుంటున్నారు. తిరునల్వేలి ఎమ్మెల్యే ముత్తుకరప్పన్ ఒక్క అడుగు ముందుకేసి అమ్మను బాహుబలిలాగా ఫొటోషాపులో చిత్రీకరించి ఆ ఫొటోలను పెద్దపెద్ద బిల్ బోర్డులపై ఏర్పాటు చేసి అమ్మా ది గ్రేట్ అంటున్నారు. భారీ వర్షంలో వరద నీటిలో కొట్టుకుపోకుండా ఒంటిచేత్తో చంటిపాపను ఒడ్డుకు చేరుస్తున్న బాహుబలిలాగా ఆ పోస్టర్లో అమ్మను చిత్రీకరించారు. అమ్మ మాత్రమే ఇలాంటి సాహసం చేస్తోందన్న భావంతో కామెంట్ కూడా రాశారు. జయలలిత పట్ల తమకున్న వీరాభిమానాన్ని చాటుకోవడం తమిళనాట కొత్తేమి కాదు. అమ్మ కోసం శరీరాలను చేతులారా తగులబెట్టుకున్న వాళ్లు, శిలువకు శరీరాలను దిగేసికున్న వారూ లేకపోలేదు. ఇప్పుడు అసందర్భంగా అమ్మను బాహుబలిలా చిత్రీకరించడం పట్ల సోషల్ మీడియా మండిపడుతోంది. వరదల్లో చిక్కుకున్న చెన్నై మహానగరాన్ని ప్రత్యక్షంగా వీక్షంచడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్ నుంచి పరిస్థితిని పరిశీలిస్తున్న దృశ్యాన్ని కూడా ఫొటోషాపులో మార్ఫింగ్చేసి సాక్షాత్తు పీఐబీ విడుదల చేయడం ఇప్పటికే వివాదమైన విషయం తెల్సిందే. గతంలో జయలలిత హెలికాప్టర్లో వరద పరిస్థితిని వీక్షించినప్పుడు కూడా ఇలాంటి మార్ఫింగే చేశారు.