
‘చెన్నై శివగామి’లా సీఎం..!
* భారీ వరద నీటి మధ్య చిన్నారిని ఎత్తుకుని..
* విమర్శలకు తావిస్తున్న హోర్డింగ్
సాక్షి, చెన్నై : బాహుబలి సినిమా సినిమా (తమిళ వెర్షన్‌లో మహాబలి) గుర్తుందా!? ఆ చిత్రంలోని కీలకమైన పాత్రల్లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఒకటి. నదిలో తాను పూర్తిగా మునిగిపోయినా పసికందుగా ఉన్న బాహుబలిని ఒంటి చేత్తో నీళ్లలోంచి పెకైత్తి పట్టుకుని నదిని దాటుతున్న సన్నివేశం సినిమాను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఎంతో కీలకమైనదే.
సినిమా విడుదలకు ముందు ఈ సన్నివేశంతో వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడమే కాకుండా సినిమాపై అంచనాలనూ పెంచింది. విడుదల తర్వాత ఎంతగా బాక్సాఫీసును షేక్ చేసి, రికార్డులు కొల్లగొట్టిందో ఇక చెప్పనవసరం లేదు. ఈ సన్నివేశం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముఖ్యమంత్రి జయలలిత అదే సన్నివేశంలో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి.
ఆ సన్నివేశాన్ని ప్రతిబింబించేలా అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అధినేత్రిని ఏకంగా ‘చెన్నై శివగామి’ని చేశారు.! భారీ వరద నీటి మధ్య జయలలిత తన చేతుల్లో చిన్నారిని ఎత్తుకున్నట్లు చూపుతూ చెన్నై వీధుల్లో పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇది వివాదాస్పదమైంది.
ఓ వైపు చెన్నై నగరం వరద నీటిలో మునిగిపోతుంటే.. ‘చెన్నైని కాపాడే అమ్మ’ అంటూ బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలా హోర్డింగ్ ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు వరదల్లో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే, వారిని పట్టించుకోకుండా ప్రచారం కోసం ఇలాంటి చర్యలు అవసరమా? అని విపక్షాలు మండిపడుతున్నాయి.