జయేంద్ర సరస్వతికి అస్వస్థత
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (82) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి హైబీపీతో బాధపడుతూ, స్పృహలేని పరిస్థితిలో ఉండగా ఆయన భక్తులు, అనుయాయులు ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారు. స్వామి ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని, ఆయనకు బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయని స్వామికి చికిత్స అందిస్తున్న డాక్టర్ రవిరాజు తెలిపారు. సాయంత్రం వరకు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుందని వివరించారు.
ఆస్పత్రికి తీసుకువచ్చిన వెంటనే స్వామిని వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స ప్రారంభించారు. ఆయనకు సీటీ స్కాన్ తీయగా అంతా సాధారణంగానే ఉందని, వచ్చినప్పటి కంటే ఇప్పటికి పరిస్థితి కొంచెం మెరుగుపడిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. స్వామి ఆరోగ్య పరిస్థితి తెలియగానే పెద్ద సంఖ్యలో భక్తులు ఆంధ్రా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.
గత సంవత్సరం జరిగిన గోదావరి పుష్కరాలకు కూడా జయేంద్ర సరస్వతి హాజరయ్యారు. రాజమహేంద్రవరంలో 2015 జూలై 14వ తేదీన పుణ్యస్నానం చేసి, ఉదయం 6.26గంటలకు గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కూడా ఒకసారి స్వామి అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో విగ్రహ ప్రతిష్ఠ కోసం వచ్చిన ఆయనకు షుగర్ లెవెల్స్ తగ్గడంతో అక్కడి జయభారత్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు.