ప్రతి రెవెన్యూ భూమినీ పరిశీలించాలి
ఆదిలాబాద్ అర్బన్ : రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే నంబర్ ప్రకారం ప్రతి భూమినీ పరిశీలించాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమల మౌళిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ జయేశరంజన్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో దళిత బస్తీల ఏర్పాటుకు భూములను గుర్తించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనియ పేర్కొన్నారు.
జిల్లాలోని రేషన్ కార్డులను ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని, ఇందుకు జిల్లాలో ఆయా సిబ్బందిని వినియోగించుకోవాలని సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రతి మండలంలోని గ్రామాల్లో సర్వే చేయాలన్నారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు వాటిని సర్వే ఫార్మాట్లో బుధవారంలోగా పంపాలని ఆదేశించారు. జిల్లాలో ఆధార్ సీడింగ్ 90 శాతం పూర్తి చేయాలని, చేయలేదంటే ఎలాంటి సమస్యలూ చెప్పకూడదని స్పష్టం చేశారు.
11 వేల ఎకరాలు పరిశ్రమలకు అనుకూలం : జేసీ
అనంతరం సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ, పరిశ్రమలకు 11 వేల ఎకరాల భూమిని గుర్తించినట్లు వివరించారు. జిల్లాలో ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని, ఇప్పటి దాకా 3 లక్షల 41 వేల ఎకరాలు గుర్తించామని, 11,448 ఎకరాలు పరిశ్రమలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని వివరించారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో 10 వేల బోగస్ కార్డులు గుర్తించామని పేర్కొన్నారు. అలాగే మొక్కల పెంపకానికి అనువైన భూముల గురించి తెలిపారు. ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.